నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ నకిలీ మందుల గుట్టు రట్టు చేసింది. హైదరాబాద్ మూసాపేటకు చెందిన రామ్స్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో తమారు చేస్తున్న నకిలీ యాంటీ అల్సర్ మందులను అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ మేరకు తెలంగాణ డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ జనరల్ కమలాసన్ రెడ్డి వివరాలను వెల్లడించారు. పంజాబ్‌కు చెందిన ఈ కంపెనీ కాలం చెల్లిన డ్రగ్ లైసెన్స్‌తో మందులను తయారు చేస్తున్నట్టు తెలిపారు. కూకట్ పల్లికి చెందిన జైపీ ట్రాన్స్‌పోర్టు ద్వారా నిజామాబాద్‌కు చెందిన బయోమెడిక్ ఫార్మాస్యూటికల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఫుడ్ సప్లిమెంట్ తయారీ ముసుగులో మందులను సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. వెంటనే నిజామాబాద్ డీసీఏ అధికారులను అలర్ట్ చేయడంతో సదరు కంపెనీపై దాడులు నిర్వహించి రూ.లక్షా 41 వేల విలువ చేసే 29,600 మాత్రలను స్వాదీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. దాడుల్లో దొరికిన ఔషదాలను సీజ్ చేసి, కంపెనీపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.