ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా సెప్టెంబరు 1నుంచి నిరసన వారం సీపీఐ(ఎం) కేంద్రకమిటీ పిలుపు

CPI(M) Central Committee has called for a protest week from September 1 against the price hike మణిపూర్‌ సీఎం రాజీనామా చేయాలి
– సమాఖ్యవ్యవస్థపై దాడులను తిప్పికొట్టాలి
న్యూఢిల్లీ : ధరల పెరుగుదలకు నిరసనగా, ఉపాధి కల్పన కోరుతూ సెప్టెంబరు 1 నుంచి 7 వరకు దేశవ్యాప్తంగా అన్ని పార్టీ శాఖలు నిరసన వారం పాటించాలని సీపీఐ(ఎం) పిలుపునిచ్చింది. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్ట్‌) కేంద్ర కమిటీ ఈ నెల 4-6 తేదీల్లో న్యూఢిల్లీలో సమావేశమై పలు అంశాలపై చర్చించింది. అనంతరం ఒక ప్రకటన జారీ చేసింది.
మణిపూర్‌
మణిపూర్‌లో మతవిద్వేషంతో కూడిన జాతి ఘర్షణలు గత మూడు మాసాలకు పైగా కొనసాగుతుండడం పట్ల కేంద్ర కమిటీ తన తీవ్ర అసమ్మతిని తెలియజేస్తోంది. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు వందలాదిమంది చనిపోయారు. వేలాది మంది నిర్వాసితులై, అమానవీయ పరిస్థితుల్లో సహాయ శిబిరాల్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తు న్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ దోషి అనేది సుస్పష్టం. ప్రధాని మోడీ మౌనం వహించడం, కేంద్ర ప్రభుత్వం చేష్టలుడిగినట్టు వ్యవహరించడం చూస్తుంటే మణిపూర్‌ను మరింతగా అరాచకత్వంలోకి, మారణ హౌమంలోకి నెట్టేలా ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉదాసీనత ఏ స్థాయిలో ఉందో ఇది తెలియజేస్తోంది. పార్లమెంట్‌కు జవాబుదారీ వహించాల్సిన బాధ్యతను విస్మరించే వైఖరిని ప్రధాని మోడీ ఎంచుకున్న ఫలితంగా, పార్లమెంటరీ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. మణిపూర్‌ ఘర్షణలు ఈశాన్య ప్రాంతంలోని సమీప రాష్ట్రాలకు విస్తరిస్తుండడమనేది అత్యంత తీవ్రమైన పర్యవసానాలు కలిగివుంది. శాంతి, సాధారణ పరిస్థితులను పునరుద్ధరించేందుకు మొదటి చర్యగా ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ రాజీనామా చేయాలని కేంద్ర కమిటీ డిమాండ్‌ చేసింది.
పెచ్చరిల్లుతున్న మతోన్మాద పోకడలు
హర్యానా మత హింస : నుహ్ లో ప్రారంభమై, గురుగావ్‌, ఇతర ప్రాంతాలకు విస్తరించడం ద్వారా మేవాట్‌ ప్రాంతంలో చెలరేగిన మతోన్మాద హింసాకాండ నేపథ్యంలో హర్యానా బీజేపీ ప్రభుత్వం అనుసరించిన దారుణమైన బుల్డోజర్‌ రాజకీయాలను కేంద్ర కమిటీ తీవ్రంగా ఖండిం చింది. ఈ హింసకు పాల్పడిన దోషులు, రెచ్చగొట్టేవారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి బదులుగా హర్యానా రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం మైనారిటీ కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకుంటోంది. ముస్లింలకు చెందిన దుకాణాలు, ఇండ్లను ధ్వంసం చేసే చర్యలను పెద్ద ఎత్తున అమలు చేస్తోంది. వీరిలో చాలామంది చట్ట పరమైన యాజమాన్య పత్రాలను కలిగి వున్నారు. కొంతమంది కోర్టు స్టే ఉత్తర్వులను కూడా తెచ్చుకున్నారు. అయిన ప్పటికీ, వాటితో సం బంధం లేకుండా బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం వీరి ఆస్తులను ధ్వంసం చేసే చర్యలకు దిగింది. అయితే, గతనాలుగు రోజులుగా సాగుతున్న ఈ కూల్చివేతలు, విధ్వంసకాండను నిలుపు చేయాలంటూ పంజాబ్‌, హర్యానా హైకోర్టు స్టే విధించింది.
విద్వేష నేరాలు
రైల్వే రక్షక దళానికి చెందిన కానిస్టేబుల్‌ ఒక అధికారిని, ముగ్గురు ముస్లిం ప్రయాణికులను దారుణంగా హతమార్చడం అత్యంత అమానవీయమైన విద్వేష నేరం. ముస్లిం కమ్యూనిటీని రాక్షసులుగా చిత్రీకరిస్తూ బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు సాగించే విషపూరితమైన విద్వేష ప్రసంగాలు, ప్రచారం ఫలితంగా ఇటువంటి నేరాలు పెరుగుతున్నాయి. హిందూశ్వ శక్తుల విషపూరితమైన ఎజెండా భారతీయ రిపబ్లిక్‌ లౌకిక, ప్రజాతంత్ర స్వభావాన్ని ధ్వంసం చేస్తోంది, గర్హనీయమైన ఈ ఘటన భారత్‌కు ఒక మేల్కొలుపు వంటిది.
జ్ఞానవాపి మసీదు వివాదం
ఆరాధనా స్థలాల చట్టం-1991ని అత్యు న్నత స్థాయిలోని న్యా య వ్యవస్థ కఠినంగా ఎందుకు అమలు చేయడం లేదన్నది ఒక అంతు చిక్కని రహస్యంగా వుం దంటూ కేంద్ర కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. స్వాతంత్య్రం లభించిన తర్వాత దేశంలోని ఆరాధనా స్థలాలకు సంబంధించి యథాతథ స్థితిని పరిరక్షించాలని ఈ చట్టం పేర్కొంటోంది. దీని నుంచి ఏకైక మినహాయింపు అయోధ్య. ఈ చట్టం చేసే సమయంలో అయోధ్య వివాదం కోర్టు కార్యకలాపాల పరిధిలో వుండడం వల్ల ఆ మినహాయింపు ఇవ్వడం జరిగింది.. జ్ఞానవాపి మసీదు ఆవరణలో సర్వే నిర్వహించేందుకు ఎఎస్‌ఐని అనుమతిస్తూ అలహాబాద్‌ హైకోర్టు ఈ నెల 3న ఉత్తర్వులు జారీ చేసింది. 1991 ప్రార్థనా స్థలాల చట్టం చెల్లుబాటును పదే పదే సమర్ధిస్తూ వచ్చిన సుప్రీం కోర్టు కూడా ఈ సర్వేను ఆపేందుకు ఎలాంటి యత్నం చేయలేదు. ఈ చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిందేనని కేంద్ర కమిటీ డిమాండ్‌ చేసింది.
ఢిల్లీ ఆర్డినెన్స్‌
అధికార యంత్రాంగంపై నియంత్రణతో సహా పాలనకు సంబంధించిన ప్రధాన రంగాలపై, ఎన్నికైన ఢిల్లీ ప్రభుత్వానికి గల హక్కులను సమర్ధిస్తూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇటీవల ఇచ్చిన సుప్రీం తీర్పును రద్దు చేస్తూ అత్యంత నిరంకుశమైన ధోరణిలో, మోడీ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకువచ్చింది. ఇది కోర్టు ధిక్కారమే కాకుండా, రాజ్యాంగం సమాఖ్య స్వభావంపై, సుప్రీం కోర్టు నిర్వచించినట్లుగా జవాబుదారీ, ప్రజాస్వామ్య పాలన నిబంధనలపై నేరుగా దాడి చేయడం కూడా. లోక్‌సభలో తనకున్న అధిక మెజారిటీని ఉపయోగించుకుని, రాజ్యసభలో బీజేడీ, వైఎస్‌ఆర్‌సీపీ వంటి ప్రాంతీయ పార్టీల మద్దతుతో మోడీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. జాతీయ ఆస్తులు లూటీ: కార్పొరేట్‌-మతతత్వ శక్తులు కుమ్మక్కయి జాతీయ ఆస్తుల లూటీకి చట్టబద్ధత కల్పించేలా కొత్త చట్టాలను తీసుకొస్తోంది. పార్లమెంట్‌ కార్యకలాపాలకు అంతరాయాలను ఉపయోగించుకుని జాతీయా ఆస్తుల ప్రయివేటీకరణకు వీలు కల్పించే కీలకమైన బిల్లులను ఆమోదింపజేసుకుంది. వీటిల్లో అభివృద్ధి పేరుతో అన్నింటికీ మినహాయింపును అందచేసే అటవీ (సంరక్షణ) సవరణ బిల్లు, 2023 వుంది. జాతీయాస్తులను కొల్లగొట్టడానికి కార్పొరేట్లకు ఇది సాయపడుతుంది. పర్యవసానంగా చోటు చేసుకునే అడవుల నరికివేత దేశంలో వాతావరణ మార్పులపౖౖె చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు, 2023ని కూడా ఆమోదించారు. లిథియంతో సహా కీలకమైన, విలువైన ఖనిజ వనరులను ప్రయివేటుగా తవ్వుకోవడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. తీర ప్రాంతాల (అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు, 2023ని ఆమోదించారు. ప్రయివేటుగా తీర ప్రాంతాల్లో ముడి చమురు అన్వేషణ కోసం ఈ బిల్లు వీలు కల్పిస్తోంది.
సమాఖ్యవాదంపై దాడులు
ఆర్థిక సమాఖ్యవాదం : రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్వేచ్ఛను మరింతగా కుదించేలా పబ్లిక్‌ బారోయింగ్స్‌ ( పబ్లిక్‌ రుణాల) నిర్వచనాన్ని మోడీ ప్రభుత్వం ఇటీవల మార్చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే బడ్జెట్‌లో లేని రుణాలను, అదనపు బడ్జెట్‌ రుణాలను ఇప్పుడు ప్రభుత్వ రుణాల జాబితాలో భాగంగా పరిగణిస్తారు.. అయితే, ఇది కేంద్రం తీసుకునే పబ్లిక్‌ రుణాలకు వర్తించదు. పైగా, వెనుకటి కాలం నుంచి కూడా దీనిని వర్తింపచేస్తున్నారు. కేరళ వంటి రాష్ట్రానికి, 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.17,310కోట్లు కొరత ఏర్పడనుంది. ఫలితంగా రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్‌లో పెద్ద ఎత్తున లోటు ఏర్పడుతుంది. ఇది, రాష్ట్ర హక్కులపై తీవ్రంగా దాడి చేయడమే.
మహిళలు, ఆడపిల్లలపై పెరుగుతున్న నేరాలు
మహిళలు, ఆడపిల్లలపై దాడులు పెరుగుతున్నాయి. వారిపై చోటు చేసుకుంటున్న నేరాలు ఆందోళన కలిగించే రీతిలో పెరుగుతున్నాయి.
సగటున 86 లైంగికదాడులు కేసులు రోజువారీ నమోదవుతున్నాయని ఎన్‌సీఆర్‌బీ డేటా తెలియచేస్తోంది. 2021లో మహిళలపై ప్రతి గంటకూ 49నేరాలు జరిగాయి. 2020లో మొత్తంగా లైంగికదాడి కేసులు 28,046 నమోదు కాగా, 2021లో 31,677కి పెరిగాయి. మహిళలపై నేరాల సంఖ్య 2020లో 3,71,503గా వుండగా, 2021లో ఆ సంఖ్య 4,28,278కి పెరిగింది. అనేక కేసుల్లో నిందితుల పట్ల మోడీ ప్రభుత్వం కనబరిచే ఆదరాణాభిమానాలు నేరస్తుల్లో శిక్ష పడుతుందనే భయం లేకుండా చేసే సంస్కృతికి దారి తీస్తోంది.
ప్రామాణికమైన డేటా అంటే భయం : ప్రజల్లో నెలకొన్న రక్తహీనత, అంగ వైకల్యానికి సంబంధించిన ప్రశ్నలను జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6 నుండి తొలగించడం పట్ల కేంద్ర కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
భారతదేశంలో 57శాతం మహిళల్లో, 67శాతానికి పైగా పిల్లల్లో రక్తహీనత వుందని గత సర్వేల్లో వెల్లడైంది. ఇతర కారణాలతో పోల్చుకుంటే ప్రసూతి మరణాల్లో, శిశు మరణాల్లో రక్త హీనత అనేది ప్రధాన కారణంగా వుంది. ఇక వైకల్యానికి సంబంధించిన ప్రశ్నలను తొలగించడమనేది తిరోగమన చర్య.
కచ్చితమైన డేటా పట్ల మోడీ ప్రభుత్వం భయంతో వుంది. పైగా దాన్ని ధిక్కరించే విషయంలో కూడా నిస్సంకోచంగా వ్యవహరిస్తోంది. ప్రపంచంలో అన్ని చోట్లా జనాభా లెక్కల ద్వారానే డేటాను సేకరిస్తుండగా, భారత్‌లో మాత్రం ఆ ప్రక్రియను నిరవధింకగా వాయిదా వేస్తూ వస్తున్నారు.
ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ పాపులేషన్‌ సైన్సెస్‌ (ఐఐపీఎస్‌) డైరెక్టర్‌ కె.ఎస్‌.జేమ్స్‌ను సస్పెండ్‌ చేయడాన్ని కేంద్ర కమిటీ ఖండించింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలను నిర్వహించేది ఈ సంస్థే. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-5లో వెల్లడించిన డేటా, బహిరంగ మల విసర్జన రహిత దేశంగా భారత్‌ మారిందన్న వాదన గురించి మోడీ ప్రభుత్వం చెప్పుకునేదానితో ఏ మాత్రమూ సరిపోలడం లేదు.
గిరిజనుల నిరసన ర్యాలీ
అటవీ సంరక్షణ (సవరణ) చట్టం, 2023, ఏకరూప పౌర స్మృతికి వ్యతిరేకంగా ఆగస్టు 9వ తేదీన దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహించాలని ఆదివాసీ సంస్థలు ఇచ్చిన పిలుపునకు కేంద్ర కమిటీ మద్దతు నిచ్చింది. అటవీ హక్కుల చట్టం, ఇతర చట్టాలు హామీ కల్పించిన హక్కులను ఈచట్టం తిరస్కరిస్తుంది. సాంప్రదాయ చట్టాల సంరక్షణకు రాజ్యాంగపరమైన హామీలను ఇది నేరుగా ప్రభావితం చేస్తుంది.
కేంద్ర కమిటీ పిలుపు :
1 ధరల పెరుగుదలకు నిరసనగా, ఉపాధి కల్పన కోరుతూ సెప్టెంబరు 1 నుండి 7 వరకు దేశ వ్యాప్తంగా అన్ని పార్టీ శాఖలు నిరసన వారం పాటించాలి.
2.సాధ్యమైనంత త్వరలో వామపక్షాల సదస్సును నిర్వహించే ప్రయత్నాలు చేపట్టాలి. పరస్పర అంగీకృతమైన డిమాండ్ల పత్రంపై దేశవ్యాప్త ప్రచారాన్ని చేపట్టాలి.
3.కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక, సంయుక్త కిస్తాన్‌ మోర్చా ప్రకటించిన కార్యాచరణకు మద్దతునివ్వాలి.
4.అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఇచ్చిన పిలుపు మేరకు అక్టోబరు 5న అఖిల భారత ఢిల్లీ ర్యాలీకి మద్దతునివ్వాలి.