– గుడిసెవాసులకు అండగా ఉంటాం
– బెదిరింపులకు భయపడేది లేదు
– ప్రభుత్వం.. రియల్ ఎస్టేట్ల వైపా? పేదల వైపా?
– స్టాలిన్ నగర్‌ను సందర్శించిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి.సాగర్, మల్లు లక్ష్మి
నవతెలంగాణ-కాశిబుగ్గ
తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ భూమిలో పేదలకు ఇంటి స్థలాలతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. రియల్ ఎస్టేట్ వ్యాపారుల వైపా.. పేదల వైపు.. ఉంటుందో తేల్చుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి.సాగర్, మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. ఆదివారం గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్ పరిధి పైడిపల్లి శివారులోని ఎస్సారెస్పీ కాలువ సమీపంలో స్టాలిన్ నగర్ పేరుతో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పేదలు వేసుకున్న గుడిసెలను శనివారం తెల్లవారుజామున అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. కాగా, ఆదివారం సీపీఐ(ఎం) సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి.సాగర్, మల్లు లక్ష్మితో పాటు మరికొందరు బృందం ఆ కాలనీని సందర్శించి అండగా ఉంటామని బాధితులకు భరోసా నిచ్చారు. అనంతరం స్టాలిన్‌నగర్ వ్యవస్థాపక అధ్యక్షులు అక్కనపల్లి యాదగిరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సాగర్ మాట్లాడారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదలకు 125 గజాల ఇంటి స్థలంతో పాటు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేకపోయిందని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం.. పేదలకు ప్రభుత్వ స్థలంలో పట్టాలిచ్చి పక్కా ఇంటి నిర్మాణానికి రూ. 5లక్షలు ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇవ్వడంతో పేదలు కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చారని గుర్తుచేశారు.
ఈ క్రమంలో పైడిపల్లి శివారులోని ఎస్సారెస్పీ కాలువ సమీపంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రెండేండ్ల క్రితం 1560 నిరుపేద కుటుంబాలు వేసుకున్న గుడిసెలకు పట్టాలిచ్చి ఇంటి నిర్మాణానికి సహాయం చేయవలసిన ప్రభుత్వం అర్ధరాత్రి ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా జేసీబీలతో కూల్చడం హేయమైన చర్య అని అన్నారు. కూలీ, నాలి చేసుకునే పేదలు.. ఒక్కొక్కరు రూ.30 వేల నుంచి లక్ష రూపాయల వరకు అప్పులు చేసి నిర్మించుకున్న ఇండ్లను నిర్ధాక్షణంగా కూల్చడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని, స్టాలిన్‌నగర్ గుడిసె వాసులకు న్యాయం జరిగే వరకూ సీపీఐ(ఎం) అండగా ఉంటుందన్నారు.
అనంతరం మల్లు లక్ష్మీ మాట్లాడుతూ.. వృద్ధులు, మహిళలు చిన్నపిల్లలు నిద్రలో ఉండగా అర్ధరాత్రి వేళ పోలీసులు పేదల ఇండ్లను కూల్చడమే కాకుండా మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించడం బాధాకరమన్నారు. వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ పార్టీ నాయకులు ఆక్రమిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర కమిటీ సభ్యులు స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ.. దళితులు, మైనారిటీలు వెనుకబడిన తరగతులకు చెందిన పేదలు నివాసం ఉంటున్న గుడిసెలను తొలగించిన అధికారులు.. ధనవంతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించుకున్న ప్రభుత్వ స్థలాల జోలికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ.. విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు నివాస స్థలాల కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకుంటే వాటిని ప్రభుత్వం తొలగించడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. సీపీఐ(ఎం) వరంగల్ జిల్లా కార్యదర్శి రంగయ్య మాట్లాడుతూ.. వరంగల్ జిల్లాలో 30ఏండ్లుగా అనేక భూపోరాట కేంద్రాలు నిర్మించి వేలాదిమందికి ఇంటి స్థలాలు ఇచ్చిన చరిత్ర సీపీఐ(ఎం)దని గుర్తుచేశారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో స్టాలిన్‌నగర్ పేరుతో పేదలు వేసుకున్న గుడిసెలను తొలగించడం బాధాకరమని, తక్షణమే గుడిసెలు తొలగించిన ప్రభుత్వ భూమిలోని ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కాసు మాధవి మాట్లాడుతూ.. పేదరికంలో ఉన్న వందలాదిమంది కార్మిక కుటుంబాలు స్టాలిన్ నగర్‌లో గుడిసెలు వేసుకుంటే అర్ధరాత్రి దాడి చేసి తొలగించడం బాధాకరమని వారికి న్యాయం జరిగే వరకు సీఐటీయూ అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) వరంగల్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈసంపల్లి బాబు, గోనె కుమారస్వామి జిల్లా కమిటీ సభ్యులు ఎం.సాగర్, నామిండ్ల స్వామి, హనుమకొండ శ్రీధర్, ఆరూరి కుమార్, కాశిబుగ్గ ఏరియా కార్యదర్శి ఎండీ బషీర్, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి దుర్గయ్య, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సాంబమూర్తి, స్టాలిన్ నగర్ నాయకులు రవిరాకుల ప్రసంగి, సుస్మిత, రాజలింగం, శ్రీనివాస్, పాషా, నాగరాజు, రవి, శివకుమార్, సమ్మక్క, అనిత, మంజుల, ఉమా, మొగిలి, గౌస్ పాషా, మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.