152 మందిపై పెట్టిన ఉపా కేసును ఎత్తివేయాలి: సిపిఐ(ఎంఎల్)

నవతెలంగాణ – డిచ్ పల్లి
ప్రొఫెసర్ హరగోపాల్, న్యాయవాది ఆల్గోట్ రవీందర్ సహా 152మందిపై పెట్టిన ఉపా కేసును వెంటనే ఎత్తివేయాలని, ఉపా చట్టాన్ని శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ(ఎంఎల్) ప్రజాపంథా పార్టీ డిచ్ పల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం తాహసిల్దార్ కార్యాలయం లో రెవెన్యూ అధికారి శ్రీకాంత్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రూరల్ సబ్ డివిజన్ కార్యదర్శి సాయగౌడ్ మాట్లాడుతూ.. 2022 ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్ లో ప్రొ.హరగోపాల్, ప్రొ.కాశీం, ఆల్గోట్ రవీందర్ తదితరులు 152 మందిపై దేశద్రోహం కేసులు నమోదు చేశారన్నారు.సమాజంలో గౌరవం వున్న వ్యక్తులకు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలు చేసి, దేశద్రోహం కేసును బనాయించడాన్ని సిపిఐ(ఎంఎల్) ప్రజాపంథా పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తక్షణమే ఈ కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రజా సమస్యలపై గొంతేత్తి వామపక్షవాదులను, మేధావులను, ప్రజా సంఘాల నాయకులను టార్గెట్ చేసి, వారిపై కేసులు బనాయించడం సరైంది కాదని అన్నారు.  ప్రొఫెసర్ హరగోపాల్, ఆల్గోట్ రవీందర్ ఇతరులపై పెట్టిన దేశద్రోహం కేసులను ఎత్తివేయాలన్నారు. రాష్ట్రంలో అమలౌతున్న ఉపా చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ యంయల్ ప్రజా పంథా పార్టీ డివిజన్ నాయకులు మురళి, కిషన్, మోహన్, నాయకులు రాజేందర్, గంగమల్లు తదితరులు పాల్గొన్నారు.