సృజనాత్మకం సైన్స్‌ బోధన

– ఆ రకంగా బోధన జరిగే దేశాలు ఎంతో ప్రగతిని సాధించాయి.. : ప్రొఫెసర్‌ డాక్టర్‌ క్వాజీ అజ్హర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సైన్స్‌ తరగతులు సజీవమైన ఆనందమయ ప్రయోగశాలలుగా పరిశోధనా కేంద్రాలుగా మారినప్పుడే దేశం ఉజ్వలంగా ఎదుగుతుందని మిచిగన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డా.క్వాజీ అజ్హర్‌ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో విజ్ఞానదర్శిని అధ్యక్షులు రమేష్‌ అధ్యక్షతన ‘అమెరికాలో స్కూల్‌ సైన్స్‌ – పాఠ్యాంశాలు, పాఠ్యప్రణాళిక, పెడగాజీ’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా క్వాజీ అజ్హర్‌ మాట్లాడుతూ ”సైన్స్‌ బోధన అనేది సృజనాత్మకంగా వైజ్ఞానికంగా ఉండాలి. వైజ్ఞానిక పద్ధతుల్లో బోధన జరిగే అమెరికా, జపాన్‌, జర్మనీ, చైనా వంటి దేశాలు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో ప్రగతిని సాధిస్తున్నాయి. సైన్స్‌ నేర్చుకోవాలంటే ప్రతి అంశాన్ని ప్రయోగాత్మకంగా పరిశోధించి తెలుసుకోవాలి. సైన్స్‌ పద్ధతులను ప్రతి విద్యార్థి అలవర్చుకోవాలి….. ” అని సూచించారు. ”అమెరికాలో నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రతి తరగతిలో సైన్స్‌ పద్ధతి అనేది ఒక పాఠ్యాంశంగా ఉంటుంది. పై తరగతికి పొయినా కొద్దీ బోధనా ప్రమాణాలు, పద్ధతులు పెరుగుతాయి. సైంటిస్టులు తమ ప్రయోగశాలలో ఏ విధంగా పరిశోధనలు చేస్తారో విద్యార్థులు తరగతి గదిలో అదే విధంగా పరిశోధనాత్మక విద్యను నేర్చుకుంటారు. మన దేశంలో పద్యాలను బట్టి పట్టినట్టు సైన్సును లేదా సైన్స్‌ సూత్రాలను వివరించి దాని కోసం ఒక ప్రయోగం చేసి చూపిస్తారు. ఇదే బోధన పద్ధతి మన కరికులంలో భాగంగా ఉంది. టీచర్లు చెప్తుంటే విద్యార్థులు వినడం మాత్రమే మన దగ్గర ఉంటుంది. కానీ అమెరికా సైన్స్‌ బోధన విధానాన్ని పరిశీలిస్తే అందుకు భిన్నంగా ఉంటుంది. టీచర్‌ సైన్స్‌ నేర్చుకునే విద్యార్థులకు ఫెసిలిటేటర్‌గా మాత్రమే ఉంటారు. విద్యార్థులు స్వయంగా తామే ప్రయోగాలు చేస్తూ పరిశోధనలు చేస్తారు. ఏదైనా సందేహాలు తలెత్తితే నివృత్తి చేయడానికి మాత్రమే టీచర్లు వారి వెనకాల ఉంటారు. విద్యార్థులు స్వయంగా చేస్తూ నేర్చుకుంటారు. అందుకే ఆ బోధనా విధానాన్ని అనుసరిస్తారు. దానికి అనుగుణంగానే పాఠ్యప్రణాళికలు, పాఠ్యాంశాలు, బోధనా పద్ధతులను రూపొందిస్తారు. అందుకే అమెరికాలో ఎందరో నోబెల్‌ బహుమతి గ్రహీతలు తయారవుతుంటారు. అక్కడ సైన్స్‌ కూడా వేగంగా ఎదుగుతున్నది…. ” అని తెలిపారు.
”సైన్స్‌ నేర్చుకోవడంలో మాతృభాష కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పిల్లలకు తమ రోజువారి జీవితంలో వాడే భాష సైన్స్‌ సులభంగా నేర్చుకోవడానికి తోడ్పడుతుంది. ఫిన్లాండ్‌ విద్యారంగంలో అగ్రగామిగా ఉండడానికి కారణం మాతృభాషలో బోధనే. భారతదేశంలో సైన్స్‌ బోధన పద్ధతి పూర్తిగా మారాల్సిందే. ఉపాధ్యాయులు నూతన బోధనా పద్ధతులను నేర్చుకునివిద్యార్థులను వైజ్ఞానికంగా తీర్చిదిద్దాలి. వైజ్ఞానిక దక్పథాన్ని ప్రతి ఒక్క విద్యార్థికీ అలవర్చాలి. అందుకు ఉపాధ్యాయులు సృజనాత్మకంగా వైజ్ఞానిక పద్ధతుల్లో కషి చేయాలి…. ” అని డాక్టర్‌ క్వాజీ అజ్హర్‌ పిలుపునిచ్చారు. ఈ సదస్సులో విజ్ఞాన దర్శనీ ప్రధాన కార్యదర్శి విజయ కందుకూరి, కోర్‌ టీం మెంబర్‌ శోభారాణి, నాయకులు రామకృష్ణ, యాదగిరి, పాఠ్యపుస్తక రచయితలు విజయ ప్రతాప్‌, జయరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.