కమర్షియల్‌ మార్కెట్‌కు క్రికెట్‌!

– తొలిసారి ఐసీసీ ఈవెంట్‌కు అమెరికా ఆతిథ్యం
– మెగా ఈవెంట్‌ హంగామా కనిపించని వైనం
– నేటి నుంచి ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2024
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌. ఆధునిక క్రికెట్‌లో అభిమానులకు అతిపెద్ద పండుగ. పొట్టి కప్పు పోరు ఎక్కడ జరిగినా హంగామా మామూలుగా ఉండదు. స్టార్‌ క్రికెటర్లకు స్వాగతం పలుకుతూ ఎయిర్‌పోర్ట్‌లో అభిమానుల కేరింతలు, క్యాబ్‌ డ్రైవర్ల నుంచి ఎక్కడ చూసినా కప్పు ఎవరు నెగ్గుతారనే చర్చ, ఆతిథ్య నగరాల్లో భారీ స్థాయిలో హోర్డింగ్‌లు, టికెట్ల సోల్డ్‌అవుట్‌ గోల. కానీ ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తున్న అమెరికాలో ఇదేమీ కనిపించటం లేదు. అమెరికాలో టీ20 ప్రపంచకప్‌ జరుగుతుందని ప్రపంచానికి తెలుసు.. కానీ అమెరికాకు ఆ సంగతి తెలియదేమో అనే పరిస్థితి!.
నవతెలంగాణ క్రీడావిభాగం
కమర్షియల్‌ సొబగులు దిద్దుకున్న క్రికెట్‌.. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద స్పోర్ట్స్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. ఆదాయం అన్వేషణలో భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ చుట్టూ తిరుగుతున్న ఐసీసీ.. భవిష్యత్‌లో అమెరికాను అతి పెద్ద ఆదాయ వనరుగా మార్చుకునే ఆలోచనలో ఉంది. అందుకే, అమెరికాలో క్రికెట్‌కు పెద్దగా క్రేజ్‌ లేకపోయినా ఏకంగా టీ20 ప్రపంచకప్‌నే అక్కడ నిర్వహిస్తోంది. అమెరికాలో ప్రతి క్రీడ కమర్షియల్‌ రూపంలో అత్యంత విజయంతం అయ్యాయి! ఆ జాబితాలోకి క్రికెట్‌ ఏనాడైనా చేరుతుందనే నమ్మకంతో అమెరికాలో పునాది వేసేందుకు ఐసీసీ తీవ్రంగా శ్రమపడుతోంది. 20 జట్లు పోటీపడుతున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ నేడు అమెరికా, కెనడా ఆరంభ మ్యాచ్‌తో షురూ కానుంది. గ్రూప్‌-ఏలో పాకిస్థాన్‌తో పాటు చోటుచేసుకున్న భారత్‌.. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది.
డల్లాస్‌లోని గ్రాండ్‌ ప్రైరీ క్రికెట్‌ స్టేడియం ఆరంభ మ్యాచ్‌కు వేదిక. అమెరికా, కెనడా మ్యాచ్‌తో టీ20 ప్రపంచకప్‌ ఆరంభం కానుంది. ఆరంభ వేడుకలు సైతం భారీ స్థాయిలోనే ఉంటాయి. సహజంగానే అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఆసక్తి చూపిస్తారు. స్టేడియం సామర్థ్యం 7 వేల మంది. అయినా, మ్యాచ్‌కు ముందు రోజు వరకు టికెట్లు పూర్తిగా అమ్ముడుపోలేదు. అమెరికాలో డల్లాస్‌లోనే ఎక్కువగా క్రికెట్‌కు ఆదరణ ఉందని చెబుతారు. ఇక్కడే దక్షిణాసియా ప్రజలు సుమారు 45 లక్షల మంది నివసిస్తున్నారు. ప్రతి వారాంతంలో డల్లాస్‌ చుట్టుపక్కల గ్రౌండ్లలో సుమారు 200 క్లబ్‌లు క్రికెట్‌ మ్యాచులు ఆడతాయి. దీంతో డల్లాస్‌లో జరిగే మ్యాచులకు ఆదరణ బాగుంటుందని అంచనా వేశారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. న్యూయార్క్‌, ఫ్లోరిడా, టెక్సాస్‌లో మరింత దారుణంగా ఉండనుంది.
క్రికెట్‌ను కమర్షియల్‌గా మరింత ముందుకు తీసుకెళ్లేందుకే అమెరికాలో మెగా ఈవెంట్‌ ప్లాన్‌ చేసిన ఐసీసీ.. టికెట్ల ధరల అంశంలో వెనక్కి ఎలా తగ్గుతుంది?. భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ క్రేజ్‌ను వంద శాతం సొమ్ముచేసుకునేందుకు ఐసీసీ రంగం సిద్ధం చేసింది. సాధారణ స్టాండ్స్‌ టికెట్ల ధరలు రూ.25 వేలు, రూ.35 వేలుగా నిర్ణయించారు. ఇక హాస్పిటాలిటీ విభాగాల్లో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. డైమండ్‌ క్లబ్‌ టికెట్‌కు రూ.8.5 లక్షలు గరిష్ఠ ధర. కార్నర్‌ క్లబ్‌ టికెట్‌ ధర రూ.2.31 లక్షలు, ప్రీమియం క్లబ్‌ లాంజ్‌ టికెట్‌ ధర రూ.2.10 లక్షలు, పెవిలియన్‌ క్లబ్‌ టికెట్‌ ధర రూ. 1.68 లక్షలు, బౌండరీ క్లబ్‌ టికెట్‌ ధర రూ.1.26 లక్షలు. భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ రోజు పార్కింగ్‌కు సైతం గరిష్టంగా రూ.21 వేలు వసూలు చేయనున్నారు. ఇతర మ్యాచులకు మాత్రం టికెట్ల ధరలు సాధారణంగానే ఉన్నాయి. గరిష్టంగా రూ.63-84 వేల వరకు ఉన్నాయి. పార్కింగ్‌ టికెట్‌ ధర రూ.3500 వరకు నిర్ణయించారు. భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌కు సాధారణ స్టాండ్స్‌ టికెట్లు (రూ.25 వేలు, రూ.35 వేలు) పూర్తిగా అమ్ముడైనట్టు తెలుస్తోంది. కార్పోరేట్‌ బాక్స్‌ల టికెట్లు అందుబాటులో ఉన్నాయి.
కొత్త చాంపియన్‌ను చూస్తామా?
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ఇప్పటివరకు ఎనిమిది ఎడిషన్లు జరిగింది. ఆరు జట్లు ఇప్పటివరకు పొట్టి ప్రపంచకప్‌ను అందుకున్నాయి. అందులో రెండు జట్లు రెండేసి సార్లు విజేతలుగా నిలిచాయి. తొలిసారి 20 జట్లు పోటీ పడుతున్నా.. టైటిల్‌ వేట ప్రధానంగా ఎనిమిది జట్లు నడుమే సాగనుంది. భారత్‌ (2007), పాకిస్థాన్‌ (2009), ఇంగ్లాండ్‌ (2010), వెస్టిండీస్‌ (2012), శ్రీలంక (2014), వెస్టిండీస్‌ (2016), ఆస్ట్రేలియా (2021), ఇంగ్లాండ్‌ (2022) ఇప్పటివరకు జరిగిన టీ20 ప్రపంచకప్‌లలో చాంపియన్లుగా నిలిచాయి. భారత్‌ సహా ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లు ఈసారి సెమీఫైనల్‌ ఫేవరేట్లుగా నిలిచాయి. న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా సహా బంగ్లాదేశ్‌ తొలిసారి టైటిల్‌ అందు కోవాలని ఆరాటపడుతు న్నాయి. రెండు అంచెల్లో గ్రూప్‌ దశ మ్యాచుల అనంతరం సెమీఫైనల్స్‌ బెర్త్‌ ఖరారు కాను న్నాయి. దీంతో సహజంగానే బలమైన జట్లే నాకౌట్‌కు చేరుకుంటాయి. సంచలన విజయా లతో ముందుకెళ్లే అవకాశాలు అతి స్వల్పం.
కొత్త రూల్స్‌ గురూ
వైట్‌బాల్‌ క్రికెట్‌లో నూతన నిబంధనలు జూన్‌ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. నేడు ఆరంభం కానున్న టీ20 ప్రపంచకప్‌లో కొత్త రూల్స్‌ అమలు చేస్తారు. ఐసీసీ రూల్స్‌ ప్రకారం స్టాప్‌క్లాక్‌ను ఏర్పాటు చేస్తారు. ప్రతి ఇన్నింగ్స్‌ 90 నిమిషాల్లో ముగియాలి. ప్రతి రెండు ఓవర్ల నడుమ వ్యవధి 60 సెకండ్లు మించరాదు. ఒకవేళ మ్యాచ్‌లో ఓవర్ల మధ్య విరామం 60 సెకండ్ల కంటే ఎక్కువగా ఉంటే తొలి రెండు సార్లు అంపైర్‌ హెచ్చరిక జారీ చేస్తాడు. మూడోసారీ అదే ఆలస్యం జరిగితే ఫీల్డింగ్‌ జట్టుకు ఐదు పరుగుల జరిమానా విధిస్తాడు. 90 నిమిషాల సమయం మించిపోతే ఆఖరు ఓవర్‌కు బౌండరీ లైన్‌ వద్ద ఓ ఫీల్డర్‌ కుదింపు, మ్యాచ్‌ ఫీజులో కొత యథాతథంగా కొనసాగుతాయి.
మన రికార్డు పేలవం!
కరీబియన్‌ గడ్డపై ఇది మూడో ఐసీసీ మెన్స్‌ ఈవెంట్‌. 2007 వన్డే వరల్డ్‌కప్‌, 2010 టీ20 వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్‌ ఆతిథ్యం ఇచ్చింది. కానీ ఈ రెండు టోర్నీల్లోనూ టీమ్‌ ఇండియా అత్యంత దారుణ ప్రదర్శన కనబరిచింది. 2007 వన్డే వరల్డ్‌కప్‌లో కనీసం గ్రూప్‌ దశ దాటి సూపర్‌8కు చేరుకోలేదు. బంగ్లాదేశ్‌, శ్రీలంక చేతిలో ఓటమిపాలై.. బర్ముడాపై ఊరట విజయం సాధించి టోర్నీ నుంచి నిష్క్రమించింది. 2010 టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్‌ దశ దాటి సూపర్‌8కు చేరుకున్నా.. ఆ గండం గట్టెక్కలేదు. సూపర్‌8లో ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్‌ చేతిలో భారత్‌ పరాజయాలు చవిచూసింది. ఒక్క విజయం సాధించకుండానే ఇంటిముఖ పట్టింది. ఇప్పుడు మరోసారి కరీబియన్‌ గడ్డ వేదికగా భారత్‌ ఐసీసీ టైటిల్‌ వేటకు వెళ్లింది. ఈసారి కథ మారుతుందా? మళ్లీ భారీ అంచనాలు బోల్తా కొట్టిస్తాయా? ఆసక్తికరం.