ఏడుపు – ఓదార్పు

ఏడుపు - ఓదార్పు‘జంతువుల జనరల్‌ బాడి’ పిల్లల హాస్య నాటికలో ఓ సన్నివేశం.
అడవిలో జంతువులన్నీ సమావేశమై తమను వివిధ సందర్భాల్లో మనుషులు ఎలా ఆడిపోసు కుంటున్నదీ మృగరాజు సింహంకు విన్నవించు కుంటాయి. ప్రధానమంత్రిగా ఉన్న నక్క వాటికి వివరణ ఇస్తూ ఉంటుంది.
పిల్లివచ్చి ‘నన్ను గోడమీద పిల్లి అంటున్నారు మహాప్రభో’ అని వాపోతే, స్వప్రయోజనాలకోసం పార్టీలు ఫిరాయించే వారిని గోడమీద పిల్లులు అని వ్యాఖ్యానిస్తారని నక్క వివరణ ఇస్తూ గోడలు అసెంబ్లీలోనూ, పార్లమెంటులోను ఉంటాయి గాని అడవిలో ఎందుకుంటాయి? ఎక్కడుంటాయి? అంటూ పిల్లిపై రెచ్చిపోతుంది. పిల్లి నోరు మూసు కుంటుంది. ఇంతలో మొసలి వచ్చి ”అసెంబ్లీ అంటే గుర్తుకు వచ్చింది మహారాజా! ‘ప్రజలపై పాలక పక్షానిది ఎప్పుడూ మొసలి కన్నీరే’ అంటూ నన్ను అందరూ ఆడిపోసుకుంటారు. మాకు మాత్రం హృదయం ఉండదా? కన్నీరు రాదా? మేం ప్రాణు లం కామా? అంటూ బావురుమంటుంది. దాంతో సింహం కూడా కరిగిపోయి మొసలిని అక్కున చేర్చుకుని ఊరడిల్లుము ఊరడిల్లుము. ప్రాణుల న్నాక సుఖదు:ఖాలు తప్పవు అని ఓదారుస్తుంది.
‘ఆహా ఎంతటి అద్భుత దృశ్యము. మొసలికి సింహం ఓదార్పు. చూడటానికి రెండు కళ్ళూ చాలటం లేదు’ అని నక్క వినయంతో చతురాడి ప్రేక్షకులకు నవ్వులు పువ్వులు పూయిస్తుంది.

ఇటీవల ఓ సభలో కన్నీరు మున్నీరుగా విల పించిన మందకృష్ణ మాదిగను ప్రధాని నరేంద్ర మోడీ అక్కున చేర్చుకుని ఓదార్చారు. ‘మూడు దశా బ్దాల వర్గీకరణ పోరాటాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గుర్తించింది. వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం’ అని మోడీ ప్రకటించగా మందకృష్ణ ఉద్వే గానికి లోనైనట్టు పత్రికలు రాసాయి. ‘పోరాటంలో చిన్నితమ్ముడు మందకృష్ణతో భాగస్వామిని అవుతా! అని మోడీ అనగానే మందకృష్ణకు దు:ఖం పొగిలి పొగిలి వచ్చినట్టు తెలిపాయి.
మాదిగ కులాల విశ్వరూప మహాసభలోనిది ఈ సన్నివేశం. ప్రధాని మోడీ గంభీరవదనం చెక్కు చెదరలేదని అవి వర్ణించాయి.

సోషల్‌ మీడియాలో ఆ ఫోటోతో పాటు ఓ పోస్టు చక్కర్లు కొట్టింది.
‘నాటక మిత్రులకు శుభవార్త నాటకం అంత రించిపోతుందని తెగ బాధపడిపోనవసరం లేదు. అవసరమైనప్పుడల్లా వ్యవస్థ తనకు కావాల్సిన సన్నివేశాలను, నటులను దానికదే సృష్టించుకుం టుంది. అనేది ఆ పోస్ట్‌ సారాంశం.

ఇందులో నటనెంత? నిజమెంత? అనేది శేషప్రశ్నగానే మిగిలిపోతుంది.
– శైలి