సంక్షోభంలోకి సేద్యం

Cultivation into crisis– వ్యవసాయ రంగాన్ని దివాలా తీయిస్తున్న బీజేపీ
– అఖిల భారత కిసాన్‌ సభ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్‌
నవతెలంగాణ – మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని దివాలా తీయించిందని, సంక్షోభంలోకి నెట్టేస్తోందని అఖిలభారత కిసాన్‌ సభ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్‌ అన్నారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల సరిహద్దు యానగుంది దగ్గర విలేకరుల సమావేశంలో ఆయన శనివారం మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఆర్థిక విధానాల కారణంగా వ్యవసాయ రంగం కుదేలవుతోందన్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందులో భాగంగానే నల్ల చట్టాలను తెచ్చారని, రైతాంగం పెద్దఎత్తున పోరాటం చేయడం వల్ల వెనక్కి తగ్గారని చెప్పారు. ప్రధానమంత్రి దిగొచ్చి రైతులకు క్షమాపణ చెప్పి నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటామని ప్రకటన చేశారని గుర్తు చేశారు. ఆ ఉద్యమ సమయంలో రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రైతులకు ఇచ్చిన హామీలను ఆయన నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఇచ్చే సబ్సిడీలను ఎత్తేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ మార్కెట్లను ప్రయివేట్‌ వాళ్లకు అప్పజెప్పడానికి పూనుకుందన్నారు. పెరిగిన సాగు ఖర్చుల వల్ల రైతులు పెట్టుబడులు పెట్టలేక.. పంట దిగుబడులు లేక ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతాంగం మేల్కొని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్‌, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్య, మాజీ వైస్‌ ఎంపీపీ మహేష్‌ కుమార్‌, ముస్తాపేట్‌ సర్పంచి లాలప్ప, నాయకులు ప్రకాశ్‌, గోవిందు, దొబ్బలి మల్లేష్‌, గోపాల్‌, బాలరాజ్‌, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.