మణిపూర్‌లో కర్ఫ్యూ వెనక్కి

– మరికొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు సడలింపు
ఇంఫాల్‌ : నిరసనలు, హింసాత్మక ఘటనలతో అట్టుడికిన ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో పరిస్థితులు కాస్త కుదుట పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాల్లో పరిస్థితితి సాధారణ స్థితికి చేరుకున్నదని అక్కడి పోలీసులు తెలిపారు. దీని కారణంగా కర్ఫ్యూ సమయాలను సడలించటం, తొలగించటం చేసినట్టు వెల్లడించారు. తమెంగ్‌లాంగ్‌, నోనీ, సేనాపతి, ఉఖ్రుల్‌, కమ్‌జోం గ్‌లలో కర్ఫ్యూ లేదని చెప్పారు. మిగతా ప్రాంతాల్లో అక్కడి పరిస్థితులను బట్టి 5 నుంచి 12 గంటల పాటు కర్ఫ్యూను విధించినట్టు తెలిపారు. రాష్ట్రంలో నెలక్రితం హింసాత్మక ఘర్షనలు నెలకొని ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసిన విషయం విదితమే. గత 15 రోజుల్లో రాష్ట్రంలో హింసాత్మక పరిస్థితులు కాస్త చల్లబడ్డాయి. రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించే ప్రయత్నంలో మే 3 నుంచి జరిగిన ఘర్షణల్లో కనీసం 80 మంది మరణించారు. హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా మణిపూర్‌కు వచ్చి గురువారం తన నాలుగురోజుల పర్యటనను ముగించుకున్నారు.