– రోజుకో తీరులో రెచ్చిపోతున్న నేరస్థులు
– గతంలో మోసపోయిన వారే అధికం
– డబ్బు రాబట్టుకోవాలని వారే ఇంకొకరిని మోసం చేస్తున్న వైనంనవతెలంగాణ- సిటీబ్యూరో
సైబర్ నేరస్థులు రోజుకో తీరులో రెచ్చిపోతున్నారు. లక్కీ డ్రాలు, బ్యాంక్ వివరాలు అప్‌డేట్ చేస్తామని, కేవైసీ, ఆధార్ అప్‌డేట్, డెబిడ్, క్రెడిట్ కార్డుల లిమిట్ పెంచుతామని, బిట్ కాయిన్ వ్యాపారం పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతుంటే, మరికొందరు ఉద్యోగాలు, రుణాలు, వీసాలు ఇప్పిస్తామంటూ అందినకాడికి దండుకుంటున్నారు. తాజాగా వైన్ గ్రూప్ పేరుతో అమాయకులకు వల వేస్తున్న నేరస్థులు లక్షలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్న విషయం వెలుగుచూసింది.
బాధితులతోనే వ్యాపారం
వైన్ గ్రూప్‌తో మోసపోయిన బాధితులతోనే పెట్టుబడులు, సభ్యులను చేర్చుకుని వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఇది ఒక గొలుసు కట్టు విధానం అని తెలియక అమాయకులు రూ.లక్షలు చెల్లిస్తున్నారు. టెలిగ్రామ్ యాప్‌లో ‘అమ్మెల్యే’ అనే మహిళ పేరుతో ఉన్న ఐడీతో అన్ని గ్రూప్‌లలో పరిచయం చేసుకుంటారు. సదురు మహిళ పేరుతో సూచనలు, సలహాలు ఇస్తున్నారు. కొంత మందిని టార్గెట్ చేసుకొని వాట్సాప్ గ్రూప్ తయారు చేయిస్తున్నారు. ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసినందుకు నెలకు కొంత మొత్తంలో డబ్బు పంపిస్తామంటూ నమ్మిస్తున్నారు. ఆ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌కు ‘మాది ‘వైన్’ తయారు చేసే పెద్ద సంస్థ, వైన్ గ్రూప్ యాప్ ఉంటుంది’ అని నమ్మిస్తున్నారు. వాట్సాప్ గ్రూప్‌లో చేరే వారికి అన్ని విషయాలు తామే వివరిస్తామంటూ నమ్మిస్తున్నారు. ముందుగా వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ పెట్టుబడి రూపంలో దాదాపు రూ.17000 చెల్లిస్తారు. ఆ తర్వాత మీరు ఎంత మందిని గ్రూప్‌లలో చేర్పిస్తే అంత మొత్తంలో మీ కమీషన్ డబ్బు పెరుగుతుందంటూ టాస్క్‌లు పెడ్తారు. ఇది నిజమని నమ్మి గ్రూప్ అడ్మిన్ పెట్టుబడులు పెట్టడంతోపాటు స్నేహితులను, తెలిసిన వారిని, తోటి ఉద్యోగులను, బంధువులను ఇలా మరింత మందిని గ్రూప్‌లలో సభ్యులుగా చేర్పించి, సైబర్ నేరగాళ్లకు ఆ గ్రూప్‌ను అప్పగిస్తున్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు ఆ గ్రూప్‌లో ఉండే సభ్యులను వ్యక్తిగతంగా, గ్రూప్ వారీగా టార్గెట్ చేసి, వైన్ గ్రూప్ యాప్‌లో పెట్టుబడులు పెట్టించి మోసం చేస్తున్నారు. ఇందులో పెట్టుబడులు పెట్టి మోసపోయిన వాళ్లు సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ‘వైన్’గ్రూప్ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఒకే సారీ వేలాది మంది టార్గెట్
సైబర్ నేరగాళ్లు ఇప్పటి వరకు నిరుద్యోగులను, మహిళలను, అమాయకులను టార్గెట్ చేసుకునేవారు. ఈ మెయిల్, సెల్‌ఫోన్, ఫేస్‌బుక్, వాట్సాప్‌లో మెసేజ్‌లో లింక్ పంపించి, వారిని టెలిగ్రామ్ యాప్‌లలోకి రప్పించి, మరో లింక్ ద్వారా ఒక వెబ్‌సైట్ లింక్‌తో బాధితులను పరిచయం చేసుకునేవారు. అయితే, వైన్ గ్రూప్ పేరుతో సైబర్ నేరస్థులు ఒక్కసారిగా వేలాది మందిని మోసం చేస్తున్నారు. ఇక్కడ గ్రూప్ అడ్మిన్‌లు చాలా మందిని ఆ గ్రూప్‌లో చేర్పిస్తున్నారు. మోసపోయిన వాళ్లు మరో కొత్త గ్రూప్‌ను తయారు చేసి, మరింత మందిని అందులోకి చేర్చుతున్నారు. ఇందులో మోసపోయిన బాధితులు సైతం డబ్బు రాబట్టుకోవాలంటే, ఇంకొకరిని మోసం చేస్తూ వెళ్తున్నారు. ఇక్కడ తెలిసిన వారే, మరొకరిని ఆ గ్రూప్‌లో చేర్పించడంతో చాలా మంది వైన్ గ్రూప్ చేతిలో మోసానికి గురవుతున్నారు.
ప్రతి రోజూ వేలల్లో లాభాలు..
‘వైన్ తయారు చేసే సంస్థ మాకుంది. మా వైన్ ధర రూ.35000 ఉంటుంది, మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది. ఎక్కువ మందికి వ్యాపారంలో భాగస్వామ్యం ఇవ్వాలని పరిచయం చేస్తున్నాం. వైన్‌పై మీరు పెట్టుబడి పెడితే మీకు ప్రతి రోజూ రూ.2,200 లాభం వస్తుంది’ అని నమ్మిస్తారు. ఇది నమ్మిన చాలా మంది ‘వైన్ యాప్’ను డౌన్‌లోడ్ చేసుకొని అందులో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ముందుగా కొంతమందికి ఎక్కుమ మొత్తంలో డబ్బు చెల్లించడంతో, చాలా మంది పెట్టుబడులు పెట్టారు. ఇలా రూ.50 వేల నుంచి రూ. 10 లక్షల వరకు పెట్టుబడులు పెట్టిన వారున్నారు. ఈ యాప్‌లో పెట్టిన పెట్టుబడి డిజిటల్‌లో కనిపిస్తుండగా, మరోపక్క రోజు వారీ లాభాలు కనిపిస్తుంటాయి. మొదటి ఒకటి రెంఓజులు వచ్చిన లాభాన్ని విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు. ఆ తరువాత విత్‌డ్రా ఆప్షన్‌ను బ్లాక్ చేసి, మరింత పెట్టుబడి పెట్టండి, మరిన్ని లాభాలొస్తాయంటూ నమ్మిస్తూ దఫ దఫాలుగా పెట్టుబడులు పెట్టిస్తూ వెళ్తున్నారు.
కష్టపడందే ఏదీ రాదు
సైబర్‌క్రైమ్స్ ఏసీపీ, కేవీఎం ప్రసాద్
ఎవరికైనా కష్టపడందే ఏదీ సులువుగా రాదని సైబర్‌క్రైమ్ ఏసీపీ, కేవీఎం ప్రసాద్ తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులను నమ్మొద్దన్నారు. ఆన్‌లైన్‌లో ఎవరో తెలియని వ్యక్తులు చెప్పే మాటలు విని, కొందరు వాట్సాప్ గ్రూప్‌లలో అమాయకులను చేర్పించి, వారికి లాభాల ఆశ చూపి బుట్టలో వేస్తున్నారని తెలిపారు. వైన్ గ్రూప్ నిర్వహించే వారు సైతం ఒకప్పుడు బాధితులేనని, వారి డబ్బులు రాబట్టుకోవడం కోసం వారు కూడా మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ వైన్‌గ్రూప్ మోసాల వెనుక ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్‌కు సంబంధించిన వాళ్లే ఉంటున్నారు, ఎక్కువగా దుబారు, చైనా సైబర్‌నేరగాళ్లు ఇలాంటి మోసాలు చేసే అవకాశాలున్నాయని చెప్పారు. ఎవరూ ఇలాంటి మోసపూరితమైన మాటలు, మెసేజ్‌లను నమ్మి డబ్బులు పెట్టుబడి పెట్టొద్దన్నారు.