నవతెలంగాణ -భువనగిరి: పోలింగ్ రోజున యువత పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొనాలని, ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలమైన ఎన్నికలలో యువత భాగస్వామ్యం కావాలని భువనగిరి మున్సిపల్ చైర్మన్, స్వీప్ ప్రచార కార్యక్రమాల నోడల్ అధికారి బి.నాగిరెడ్డి అన్నారు. సాధారణ ఎన్నికల సందర్భంగా స్వీప్ ప్రచార కార్యక్రమాలలో భాగంగా మంగళవారం నాడు భువనగరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుండి ఓటరు అవగాహన, చైతన్యంపై విద్యార్ధినీ విద్యార్ధులతో నిర్వహించిన సైకిల్ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్ర్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజాస్వామ్య వ్యవస్థకు కీలకమైన ఎన్నికల ప్రక్రియలో యువత పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించే క్రమంలో ఎన్నికల కమీషన్ సి -విజిల్ యాప్ ప్రవేశపెట్టిందని, ఎన్నికలలో ఎక్కడైనా నిబంధనలను అతిక్రమిస్తే సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులు చేయాలని, నగదు, మద్యం పంపిణీ, ప్రలోభాలకు గురి చేసే వస్తువుల పంపిణీ, అసత్య వార్తలను ప్రసారం చేయడం, కుల మత ద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం, ఓటర్లను బెదిరించడం తదితర ఉల్లంఘనల పట్ల ఫిర్యాదులు చేయాలన్నారు. వంద నిమిషాలలో తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఎన్నికల ఫిర్యాదులకు 1950 నెంబరుకు కూడా చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రమణి, జిల్లా యువజన అధికారి ధనుంజయ్, జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ పాపిరెడ్డి, వివిధ డిగ్రీ కాలేజీల విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొన్నారు.