బంగ్లా, మయన్మార్‌ను వణికిస్తోన్న మోచ తుఫాను…

నవతెలంగాణ – మయన్మార్‌: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మోచ తుఫాన్‌  బంగ్లాదేశ్, మయన్మార్‌ దేశాలను వణికిస్తోంది. ఈ తుఫాను ఆదివారం మధ్యాహ్నం రెండు దేశాల మధ్య తీరం దాటింది. దీంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను తీరం దాటిన సమయంలో గంటలకు 210 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. సముద్రంలో 8-12 అడుగుల ఎత్తు వరకు అలలు ఎగసి పడ్డాయి. భారీ గాలులతో బంగ్లాదేశ్‌, మయన్మార్‌ తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. భారీ వర్షాలకు రెండు దేశాలు అల్లాడిపోతున్నాయి. రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తుఫాను కారణంగా మయన్మార్‌లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈదురు గాలులకు చెట్లు కూలి ఇళ్లు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విత్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రెండు దేశాల్లో కలిపి సుమారు 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి.