దళిత సమస్యలే జాతీయ ఎజెండా

Dalit issues are the national agenda– బీజేపీ అధికారంలోకొచ్చాక ఎస్సీల పరిస్థితి అధ్వాన్నం
– విద్య, ఉపాధితోనే దళితుల్లో సాధికారత
– ఎన్‌ఈపీతో దేశానికే ప్రమాదం
– దేశవ్యాప్తంగా ఉద్యమానికి కార్యాచరణ : జాతీయ దళిత సమ్మిట్‌లో వక్తలు
– హైదరాబాద్‌లో ఉత్సాహంగా సదస్సు ప్రారంభం
ప్రమాదంలో ప్రజాస్వామ్యం, సమానత్వం, స్వావలంబన, లౌకికతత్వం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ హయాంలో దళితులపై వివక్ష, అసమానతలు పెరిగాయి. చరిత్ర, సైన్స్‌ రంగాల్లో మతోన్మాద భావజాలాన్ని చొప్పించేవిధంగా కుట్రలు చేస్తోంది. కేరళ రాష్ట్రంలో అసమానతలు, వివక్షతకు తావులేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. నారాయణగురు లాంటి నాయకులు వివక్షపై తిరుగులేని పోరాటాలు చేశారు. కేరళ వామపక్ష ప్రభుత్వం దేవాలయాల్లో దళితులను అర్చకులుగా నియమించింది.ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన కృష్ణ పిళ్లై 1931లో దళితులపై వివక్షతకు వ్యతిరేకంగా పోరాడారు. ఆయనపై ఆర్‌ఎస్‌ఎస్‌ గూండాలు దాడి చేశారు. అయినా వాళ్లకు ఎదురొడ్డి నిలిచారు.
కేరళ దేవాదాయ శాఖ మంత్రి రాధాకృష్ణన్‌ రాజ్యాంగం రద్దుకు ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర
భారత రాజ్యాంగాన్ని రద్దుచేసి మనుస్మృతిని తెచ్చేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర చేస్తోంది. దళితుల్లో ఎక్కువగా మహిళలే పీడనకు గురవుతున్నారు.దళితులు, ఆదివాసీలకు వ్యతిరేకంగా హిందూత్వ శక్తులు చట్టాలు చేస్తున్నారు. తెలంగాణలో మాల, మాదిగల మధ్య, మణిపూర్‌లో గిరిజనులు, ఇతర ప్రాంతాల్లో ప్రజల మధ్య ప్రభుత్వాలే చీలికలు తీసుకొస్తున్నాయి.వీటన్నింటిని ప్రజలు తిప్పికొట్టాలి.
దళిత్‌ సోషన్‌ ముక్తి మంచ్‌ (డీఎస్‌ఎంఎం) నేత సుభాషిణీఅలీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘వచ్చే పార్లమెంట్‌ ఎన్నికలతోపాటు రాబోయే కాలంలో దళితుల సమస్యలే జాతీయ స్థాయిలో ప్రధాన ఎజెండా కావాలి. బీజేపీ అధికారంలోకొచ్చాక దళితుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. హైదరాబాద్‌ తరహాలోనే డిసెంబర్‌, జనవరి మాసాల్లో దేశవ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తాం’ అని పలువురు వక్తలు అన్నారు. హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో రెండురోజులపాటు జరగనున్న నేషనల్‌ దళిత్‌ సమ్మిట్‌ శనివారం ఉత్సాహంగా ప్రారంభమైంది. డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సదస్సుకు సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ చైర్‌పర్సన్‌ మల్లేపల్లి లక్ష్మయ్య, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌, డీఎస్‌ఎంఎం నాయకురాలు సుభాషిణి అలీ, జాతీయ నాయకులు నిర్మల్‌, ధీరేంద్ర ఝా, గుల్జార్‌సింగ్‌ గోరియా అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. 26 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 300 మందికిపైగా ప్రతినిధులు హాజరయ్యారు. అంతకుముందు వేదికపైకి అతిధులను కేవీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు జాన్‌వెస్లీ ఆహ్వానించారు.
ప్రమాదంలో ప్రజాస్వామ్యం : రాజశేఖర్‌ ఉండ్రు
‘దళితుల ఎజెండాపై ముసాయిదా పత్రం’ అంశంపై హర్యానా రాష్ట్ర ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ ఉండ్రు కీలకోపన్యాసం చేశారు. సామాజిక న్యాయం, అంటరానితనం నిర్మూలన, దళితులు, గిరిజనుల సమగ్రాభివృద్ధి కోసం డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగంలో హక్కులు పొందుపర్చారని అన్నారు. 1976 హరిజన మహాసభ, 2002లో భోపాల్‌ డిక్లరేషన్‌, 2013లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కోసం అనేక ఉద్యమాలు, పోరాటాలు జరిగాయని గుర్తుచేశారు. భారత రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్ల కారణంగా దళితులు, గిరిజనులకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులయ్యే అవకాశం వచ్చిందన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, రిజిర్వేషన్లను వివరించారు. అర్టికల్‌ 46 ప్రకారం… దళితులు, గిరిజనులకు జీవనోపాధి, ఉపాధి, విద్య, భూమి, ఆరోగ్య సంరక్షణ, రిజర్వేషన్లు తప్పనిసరిగా కల్పించాల్సి ఉందని వివరించారు. దళితులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించిన తర్వాత తొలిసారిగా రిజర్వుడ్‌ నియోజకవర్గం నుంచి అంబేద్కర్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని తెలిపారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారత రాజ్యాంగ పీఠికలో పొందుపర్చిన సమానత్వం, స్వావలంభన, లౌకికత్వం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డాయని ఆయన వివరించారు.
బిలియనీర్లలో అతిపెద్ద దేశం భారత్‌ : కాకి మాధవరావు
దేశంలో బ్రిటీషు ప్రభుత్వం పోయి బిలియనీర్ల ప్రభుత్వం వచ్చిందని, అందుకు సిగ్గుపడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు అన్నారు. బిలియనీర్లలో ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా పేరుగాంచిందన్నారు. ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఆదాయం పన్ను 75 శాతం వసూలైతే ప్రస్తుతం 30 శాతానికి పడిపోయిందని గుర్తుచేశారు. అంబేద్కర్‌ భావజాలం ప్రకారం సమానత్వం ఎక్కడుందని, అందుకు బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. దళితులు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగంలో అసమానతలు, వివక్ష ఎదుర్కొంటున్నారని తెలిపారు. నేటి పరిస్థితుల్లో ‘లాల్‌-నీల్‌’ ఐక్యత అవసరమని అన్నారు. మార్క్స్‌, అంబేద్కర్‌ భావజాలాలను అర్థం చేసుకోవడంలో లోపం ఉందన్నారు.
విద్యా, ఉపాధితోనే దళితుల్లో సాధికారత : లింబాద్రి
తెలంగాణలో 2014కు ముందు ప్రయివేటు డిగ్రీ కాలేజీల్లో రిజర్వేషన్లు అమలుకాలేదని ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ఆర్‌ లింబాద్రి చెప్పారు. 2014 తర్వాత ‘దోస్త్‌’ ద్వారా 1,040 ప్రయివేటు డిగ్రీ కాలేజీల్లో రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని అన్నారు. దళితుల సాధికారతకు ఎన్నో చట్టాలు, జీఓలు వచ్చినా ఆశించిన ఫలితాలు రాలేదన్నారు. కానీ విద్యా, ఉపాధి ద్వారానే దళితుల్లో సాధికారత సాధ్యమని అన్నారు. 1950లో 25 యూనివర్సిటీలు, 700 కాలేజీలు ఉన్నాయని, నేడు 1113 యూనివర్సిటీలు ఉన్నాయని, ఐఐటీ, ఐఐఎంలలో దళితుల సంఖ్య తక్కువగా ఉందని గుర్తుచేశారు. ఆర్థిక, సామాజిక కారణాల వల్ల డ్రాపౌట్‌లో దళితులే ఎక్కువగా ఉన్నారని వివరించారు. గణితం, సైన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, స్టాటిటిక్స్‌, డేటా సైన్స్‌, ఆస్ట్రానమీ రంగాల్లో దళితుల పాత్ర నామమాత్రంగానే ఉందన్నారు. దేశవ్యాప్తంగా విద్యలో దళిత బాలికలు 23శాతం కంటే తెలంగాణలో 39.3శాతం ఉందన్నారు.
ఎన్‌ఈపీతో దేశానికే ప్రమాదం : నరేంద్రకుమార్‌
ప్రయివేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ కారణంగా దేశంలో ఉద్యోగాల సంఖ్య పడిపోయిందని జేఎన్‌యూ ప్రొఫెసర్‌ నరేంద్రకుమార్‌ అన్నారు. గతంలో కార్మికుల పిల్లలు, గ్రామ సర్పంచ్‌ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలోనే చదివేవారని, కాలక్రమేణా పరిస్థితి మారిందన్నారు. కానీ నూతన విద్యావిధానం (ఎన్‌ఈపీ)-2020 అమలైతే ప్రయివేటు స్కూళ్లలో దళితులు, ఆదివాసీల పిల్లలకు ప్రవేశం ఉండదన్నారు. ఎన్‌ఈపీ అమలైతే దేశానికే ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయివేటు, విదేశీ యూనివర్సిటీలతో ప్రభుత్వ యూనివర్సిటీలకు ప్రమాదం పొంచి ఉందన్నారు. రాజ్యాంగ సంస్థలు స్వతంత్రను కోల్పోయాయని విమర్శించారు.
సామాజిక సమస్యలు పరిష్కారం కాలేదు : మల్లేపల్లి లక్ష్మయ్య
దళితులపై వివక్ష, ఆర్థిక అసమానతలు, సామాజిక వెలివేతలు వంటి ఎన్నో సామాజిక సమస్యలు పరిష్కారం కాకుండా మిగిలిపోవడం ఆందోళనకరమని సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ చైర్‌ పర్సన్‌ మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు. భవిష్యత్‌లో జరగబోయే పరిణామాలు, అభివృద్ధిపై చర్చించి ప్రజల ముందు పెట్టడానికి, రాబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీల ఎజెండాల్లో దళితుల అంశాన్ని పెట్టడానికి ఈ సదస్సు ఉపయోగపడనుందని చెప్పారు. అంబేద్కర్‌ కంటే ముందుగానే హైదరాబాద్‌లో భాగ్యరెడ్డివర్మ దళితుల సమస్యలపై పోరాడారని గుర్తుచేశారు.
దేశవ్యాప్త ఉద్యమానికి కార్యాచరణ : బి.వెంకట్‌
జాతీయ దళిత సదస్సు ప్రత్యేక సందర్భంగా జరుగుతుందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ అన్నారు. దళితుల సమస్యలపై దేశవ్యాప్త ఉద్యమాన్ని నిర్మించేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రాబోయే కాలంలో దళితుల సమస్యలే జాతీయ ఎజెండా కావాలని, ఆ దిశగా ఈ సదస్సు దోహద పడుతుందని తెలిపారు.