డామిట్‌ కథ అడ్డం తిరిగింది!

సంస్కరణల వేటగాళ్ళు జనం మీద పడి పీక్కుతినే కాలంలో… వాటి వైఫల్యం ఆ సంస్కరణలపై పోరాడే శక్తుల చేతికి కొత్త ఆయుధమై అంది వస్తుంది. విద్యుత్‌ రంగ సంస్కరణలు చేస్తేనే పోటీతత్వం పెరుగుతుందన్నారు. నాణ్యమైన, నిరంతరాయ కరెంటు వస్తుందన్నారు. రాష్ట్రాల విద్యుత్‌ బోర్డులన్నీ నిలువుగా ఏకమై ఉండటమే (వర్టికల్‌ ఇంటిగ్రేషన్‌) సమస్యలకు మూలకారణమన్నారు. వాటిని ముక్కలు చేస్తే ప్రభుత్వ, ప్రయివేటు జనరేటర్లు ఒకరితో ఒకరు పోటీపడి తక్కువ ధరకు కరెంటు అమ్ముతారు కాబట్టి వినియోగదార్లకు చౌకైన విద్యుత్‌ లభిస్తుందన్నారు. 1998లో ఎ.పి. విద్యుత్‌ సంస్కరణల చట్టం అసెంబ్లీలో పాస్‌ చేసేకునేందుకు నాటి ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పిన మాటలు నేటికీ మన చెవుల్లో రింగుమంటూనే ఉన్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ పోటీ కనపడదు. టారిఫ్‌లు తగ్గిన దాఖలాల్లేవు. ఆ మాటకొస్తే దేశంలో ఎక్కడా టారిఫ్‌లు తగ్గలేదు. డిస్కాంల నష్టాలు తగ్గలేదు. రూ.5లక్షల కోట్ల బకాయిలు పేరుకు పోయాయి. ప్రస్తుతం మన తెలంగాణ ప్రజల నెత్తిన రూ.36,124కోట్ల ట్రూ అప్‌ చార్జీల భారం ఏక్షణానైనా పడేందుకు సిద్ధంగా వేలాడుతోంది.
ఇంత జరిగిన తర్వాత ఈ ”సంస్కర్తల”కి (పాపం శమించుగాక) గిరీశం గుర్తుకి రావడంలో ఆశ్చర్యమేముంది?
ప్రస్తుతం ప్రజల మీద భారాలు పడటంతో పాటు యావత్‌ విద్యుత్‌రంగమే ప్రయివేటు పరం అయ్యే ముంగిటున్నాం. అందుకు విద్యుత్‌ చట్టం 2003 దారులు పరిచింది. ఆలస్యాన్ని భరించలేని పెట్టుబడిదారులు మోడీ రాగానే దానికి సవరణ ప్రారంభించారు. విద్యుత్‌ సవరణ బిల్లు 2014కు వ్యతిరేకంగా అఖిల భారత స్థాయిలో విద్యుత్‌ ఉద్యోగులు పోరాడారు. మొత్తానికి 2022లో సదరు సవరణ చట్టం పాస్‌ అయ్యింది. అంతకంటే ముందే అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలుకు ఒక ప్రయత్నం చేసింది మోడీ సర్కార్‌. చండీఘర్‌లో విద్యుత్‌ ఉద్యోగులు తిప్పికొట్టారు. తన ఏలుబడిలోని జమ్మూ-కాశ్మీర్‌లో ప్రయత్నించి విద్యుత్‌ ఉద్యోగుల ప్రతిఘటనతో వెనక్కి తగ్గింది. తాజాగా పాండిచేరిలో ప్రయత్నించి విఫలమైంది. వీటి మధ్యలో హర్యానాలో కూడా ఒక విఫల ప్రయత్నం చేసింది. ఆఖరికి నేడు యూపీలో బుల్‌డోజర్‌ సర్కార్‌ సైతం ప్రయత్నించి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. యూపీ విద్యుత్‌ ఉద్యోగుల సమ్మెకు దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. కరెంటు చార్జీల పెంపుదల నేడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో లేదు. పంజాబ్‌ ఒడిషా నుండి బొగ్గు కొంటోంది. రైలు రవాణా చార్జీలే పంజాబ్‌ వినియోగదారులు భరించాల్సి వచ్చేది. ఇప్పుడు మోడీ పుణ్యాన ఒడిషా బొగ్గు శ్రీలంక పోర్టుకెళ్ళి, అక్కడి నుంచి గుజరాత్‌ పోర్టుకి వెళ్ళి, అక్కడి నుంచి రైలెక్కి పంజాబ్‌ చేరాలట! పైరెండు పోర్టులు శ్రీమాన్‌ అదానీవని వేరే చెప్పక్కర్లేదు కదా! భారం తడిసి మోపెడవుతోంది. ఇదంతా పంజాబ్‌ వినియోగదార్లు మొయ్యాల్సివస్తోంది. అన్ని రాష్ట్రాలూ కనీసం పదిశాతాన్ని దిగుమతి చేసుకున్న బొగ్గునే తమ విద్యుత్‌ ప్రాజెక్టుల్లో వాడాలన్న నిబంధన చేసింది మోడీ ప్రభుత్వం. ఆపేరున ఆస్ట్రేలియా నుండి అదానీ బొగ్గు వచ్చిపడుతోంది! ప్రతి డిస్కామూ తాను వినియోగించే ఇంధనంలో 20శాతం సాంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారానే ఉరఫ్‌ సౌరవిద్యుత్‌ శక్తి ద్వారా ఉరఫ్‌ అదానీ సోలార్‌ పవర్‌ ద్వారానే కొనాలని మరో ఫత్వా విడుదలైంది. శ్రీలంకలో అదానీ గాలిమరల ద్వారా ఉత్పత్తి అయ్యే (విండ్‌ పవర్‌) విద్యుత్‌ను తప్పనిసరిగా కొనాలని తనపై భారత పిఎంఒ నుండి ఒత్తిడి వచ్చిందని ఇటీవల ఆదేశ విద్యుత్‌ కమిషన్‌ ఛైర్మన్‌ వారి పార్లమెంటరీ కమిటీ ముందు తన గోడు వెళ్ళబోసుకున్న విషయం చూశాం. అంటే దేశమూ, దేశ ప్రజల బాగోగుల కంటే అదానీ జేబులు నింపడమే ప్రభుత్వ పరమావధి అయిన తర్వాత టారిఫ్‌లు పెరుగక ఏమవుతాయి? డిస్కాంలు వినియోగదారులకు సప్లై చేసే విద్యుత్‌లో 75-80శాతం విద్యుత్‌ కొనుగోలు వ్యయమే! దీనిలో ఇంధనాల వ్యయమే అధికంగా ఉంటోంది. కోల్‌మైన్‌ పైనే విద్యుదుత్పత్తి స్టేషన్‌ పెట్టుకుంటే రవాణా ఖర్చు తగ్గి టారిఫ్‌ల భారం తగ్గుతుంది. అందుకే పిట్‌హెడ్‌ స్టేషన్ల కాన్సెప్ట్‌ వచ్చింది. సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టుకి తన బొగ్గునే వినియోగించుకుంటానంటే గత నాలుగైదేండ్లుగా అనుమతి నివ్వని మోడీ సర్కార్‌ తాజాగా ఒడిషా నుండి బొగ్గు తెచ్చుకోమంది. ఉత్పత్తిదారులు పోటీపడి చౌకగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశమెక్కడుంది? టారిఫ్‌లు తగ్గే అవకాశమేది? చౌకగా విద్యుత్‌ ఒకరితో ఒకరు పోటీపడి తక్కువ ధరకు అందించడం, విద్యుత్‌ సంస్థలు నష్టాల నుండి బయట పడటం వంటి డైలాగులన్నీ ‘గాలికి పేలపిండి క్రిష్ణార్పణం’ అయ్యింది. సంస్కరణలు విద్యుత్‌ రంగాన్ని ఉద్ధరించడానికన్నది కూడా ఉత్తిదే! ”క్యాట్‌ ఈజ్‌ ఔట్‌ ఆఫ్‌ బ్యాగ్‌” (అసలు విషయం బహిర్గతమైందని అర్థం) విద్యుత్‌ రంగాన్ని అంబానీ, అదానీ, టాటా వంటి గుత్త పెట్టుబడిదారుల చేతిలో పెట్టేందుకేననేది స్పష్టం. ఇప్పటి వరకు విద్యుత్‌ ఉద్యోగులే పోరాడి ప్రయివేటీకరణను అడ్డుకుంటున్నారు. సాధారణ ప్రజల భాగస్వామ్యం పెద్దగా లేదు. దీన్ని పెద్ద ప్రజాపోరాటంగా మలవగలిగితేనే ఈ జగన్నాధ రథచక్రాలను నిలువరించగలం. రైతులు చూపిన తెగువ, మృత్యువునే ఎదిరించిన తీరు, విద్యుత్‌రంగ ఉద్యోగులు కార్మికులు చూపగిలిగితే, దానికి అపారమైన ప్రజలు మద్దతుగా నిలబడితే ‘మోదానీ’లు నిలువగలరా?!