దళిత జీవితాల దండోరా

ప్రతి సంవత్సరం దళిత కథలను సేకరించడం, వాటిలోంచి మేలైన కథలను ఏరి సంకలనంగా ప్రకటించడం ‘జంబూసాహితి’ వారి ఆనవాయితి. వారు ఈ ఆనవాయితీని 3 సంవత్సరాల నుండి కొనసాగిస్తున్నారు. ‘సాక’ కథాసంకలనం మూడవది. సంపాదకులు డా||సిద్దెంకి యాదగిరి, గుడిపల్లి నిరంజన్‌, తప్పెట ఓదయ్య గారలు ఈ కథా యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. సాక అంటే అర్పించడం, ధారగా పోయడం. గ్రామదేవతలైన పోచమ్మ, ఎల్లమ్మలకు మొక్కుకుని కల్లు సాక/ బెల్లం సాక అర్పిస్తారు. స్త్రీవాద కథలు, మైనారిటీ కథలు, ప్రేమ కథలు, కుటుంబ కథలు, క్రైం కథలు… ఇలా ఎవరికి వారు తమ అస్తిత్వాన్ని ప్రకటించుకునే సందర్భం నేటి ట్రెండ్‌. చాతుర్వర్ణ సమాజంలో దళితులు అట్టడుగు వర్గానికి చెందుతారు. పై మూడు వర్ణాలకు సేవ చేస్తూ ఊరికి దూరంగా వుంచబడి, చచ్చిన బర్రె, పోతుల్లాంటి పెద్ద జీవాలను పూడ్చుతూ, కొందరు చెప్పులు కుట్టడం వృత్తిగా పెట్టుకుంటారు. వారి జీవితాలే ఈ కథలు. సంకలనంలో 16 కథలున్నాయి. వీటన్నింటా దళితులు పడుతోన్న బాధ, వ్యధ వ్యక్తమౌతుంది. ఈ వర్గం వారే ఎందుకు తక్కువగా క్రైస్తవ మతం స్వీకరిస్తారో, కమ్యూనిజం వైపు మొగ్గుతారో తెలుపుతాయి. విచిత్రం ఏంటంటే పై వర్గాలను వీరు నిరసిస్తూనే, తమలో తాము ఉపకులాల వ్యవస్థను పెంచి పోషిస్తున్నట్టుగా అవుపిస్తుంది. సతీష్‌ చందర్‌, జూపాక సుభద్ర, చరణ్‌ పరిమి, మెర్సీ మార్గరెట్‌, కెంగార మోహన్‌, పైన చెప్పిన ముగ్గురు సంపాదకులు… అందరూ చేయి తిరిగిన రచయితలు/ రచయిత్రులు కావడం వల్ల చెప్పదలుచుకున్న ఇతి వృత్తాన్ని అతి బలంగా ప్రభావపూరితంగా మనసున నాటుకునే విధంగా చెప్పారు. కొన్ని కథలు (అప్పు పడ్డది సుమీ…, బురుదగుంట) దళిత మాండలికంలో రాయడం వల్ల సహజత్వం చేకూరింది. వైవిధ్యమైన ఆలోచన, వస్తువు, వ్యక్తీకరణ, నిజాన్ని నిర్భీతిగా చెప్పడం వీటన్నింటి వల్ల ఈ కథలన్నింటా మనసుకు హత్తుకుపోగలిగిన, ఆలోచింపచేసే నైజం వుంది.
– కూర చిదంబరం, 8639338675