ప్రతిపక్షాలతో ప్రమాదం

Danger with opposition– ప్రజలు జాగ్రత్తగుండాలే…
– అబద్ధాలతో, ఆపద మొక్కులతో వచ్చే వాళ్లను నమ్మకండి..
– చేనేత కార్మికులను ఆదుకునే బతుకమ్మ చీరెల పంపిణీని రాజకీయం చేయొద్దు..
– నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఇంత మంచిగా చేసే వాడిని కాదేమో
– కండ్ల ముందు కనబడుతున్న అభివృద్ధిని చూసి మమ్మల్ని ఆశీర్వదించండి : సిరిసిల్ల, సిద్దిపేట ప్రజా ఆశీర్వాదసభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయప్రతినిధి / సిరిసిల్ల రూరల్‌ / సిద్దిపేట
”అబద్ధాలు, ఆపద మొక్కులతో ప్రతిపక్షాలు దుర్మార్గపు హామీలిచ్చి మనల్ని మోసం చేస్తాయి. వారి మోసాన్ని పసిగట్టి, ఆ పార్టీల ప్రమాదం నుంచి తప్పించుకోవాలి. కండ్ల ముందు ఉన్న అభివృద్ధిని చూసి మమ్మల్ని ఆశీర్వదించండి. విపక్షాల మోసపూరిత మాటలకు లొంగకండి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. సోమవారం సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.
సిరిసిల్లతో తనకు ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేసుకుంటూ తన 70 ఏండ్ల జీవితంలో సిరిసిల్లలో వందసార్లు పర్యటించానన్నారు. ఆనాడు సిరిసిల్ల ప్రాంతాన్ని చూస్తే కన్నీళ్లు వచ్చేవని, అప్పట్లో ఏడుగురు చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకోవడంతో ఎంతో చలించిపోయానన్నారు. అప్పుడు పార్టీ నిధులు, చందాలు సేకరించి చేనేత కార్మికులకు సాయం చేశామని గుర్తు చేశారు. ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా మారిందని, చేనేత శాఖ మంత్రిగా కేటీఆర్‌ వచ్చాక రూపురేఖలు మారిపోయిన సిరిసిల్ల కండ్ల ఎదుటే ఉందని వివరించారు. చేనేత కార్మికులను ఆదుకొని ఉపాధి కల్పించేందుకే బతుకమ్మ చీరల పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. చివరికి ఈ పథకాన్ని కూడా రాజకీయం చేశారని, చీరలు నచ్చకపోతే తీసుకోవద్దని, అంతేగానీ చీరల పంపిణీని రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. షోలాపూర్‌ ఎలా ఉంటుందో.. సిరిసిల్లనూ అలా చేయాలనేదే తమ ప్రయత్నమని చెప్పుకొచ్చారు. భవిష్యత్‌లో సిరిసిల్ల మంచి విద్యాకేంద్రంగా అభివృద్ధి చెందుతుందని మాట ఇచ్చారు. సమైక్య పాలనలో అడుగంటిన ఎగువ మానేరు ఇప్పుడు ఏడాదంతా నీటితో ఉంటూ సిరిసిల్ల వరకు సజీవ జలధారగా మారిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే.. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటున్నారని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే రైతులు ఆగం అవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలని చెబుతున్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డిలాంటి నేతలు అబద్ధాలతో, ఆపద మొక్కులతో వస్తారని, వారిని ప్రజలు నమ్మవద్దని కోరారు. ఈ సభలో మంత్రి కేటీఆర్‌ సహా రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షులు బోయిన్‌పల్లి వినోద్‌కుమార్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, పార్టీ నేతలు, నాయకులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
తెలంగాణకు సిద్దిపేట తలమానికం
సిద్దిపేటలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడుతూ.. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి.. అన్నట్టుగా జన్మభూమిని మించిన స్వర్గం మరొకటి లేదని, తనను ప్రతి సందర్భంలో విజేతగా నిలిపింది ఈ గడ్డేనని గుర్తు చేసుకున్నారు. దేశానికి తెలంగాణ తలమానికమైతే.. తెలంగాణకు సిద్దిపేట తలమానికమని అన్నారు. ఈ ప్రాంత ప్రజలు గతంలో మంచినీటి కోసం గోసలు పడేవారనీ.. కానీ నేడు మానేరు డ్యామ్‌ నుంచి నీటిని తీసుకొచ్చి ఇక్కడ జల జాతర చేశామన్నారు. సిద్దిపేటకు సాగు, తాగునీటితో పాటు ఇటీవలే రైలును కూడా తీసుకొచ్చుకున్నామన్నారు. ప్రజలందరి ఆజ్ఞతో మొండి పట్టుదలతో వెళ్లి ప్రాణాలకు తెగించి తెలంగాణను సాధించుకున్నామ న్నారు. అప్పుడు బస్సు గుర్తు వచ్చిందని, సమైక్యవాదులందరూ తనను ఓడించడానికి ఎంత ప్రయత్నించినా.. 60 వేల మెజార్టీతో గెలుపొందాన న్నారు. కరీంనగర్‌ ఎంపీగా గెలిచిన తర్వాత ఆరడుగుల బుల్లెట్‌ హరీశ్‌రావును సిద్దిపేటకు అందించానన్నారు. హరీశ్‌రావు తన నమ్మకాన్ని నిలబెట్టాడని, మీ గౌరవాన్ని కాపాడాడన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నా ఇంత బాగా చేసే వాడిని కాదేమోనంటూ హరీశ్‌రావును మెచ్చుకున్నారు. సిద్దిపేటలో రానిది ఏంది.. లేనిది ఏంది.. ఇక్కడ అన్నింటిని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. గాలి మోటర్‌ ఒక్కటే తక్కువగా ఉందన్నారు. కాగా సిద్దిపేట పట్టణానికి పక్కనే ఉన్న ఇరుకోడు వద్ద మినీ యూనివర్సిటీ రాబోతుందన్నారు. హరీశ్‌రావుకు గతంలో కంటే ఎక్కువ మెజార్టీని తీసుకొచ్చి, ఆ రికార్డును ప్రజలే తిరగరాయాలని సూచించారు. దళితబంధుకు సిద్దిపేట దగ్గర ఉన్న రామంచ ఆడబిడ్డనే ప్రేరణ అని, ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అందిస్తానన్నారు. బీసీ వృత్తులను కాపాడుకోవడానికి ప్రతి ఇంటికి లక్ష అందించే వరకు పథకం కొనసాగిస్తానన్నారు. కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, దామోదర్‌ రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌, యాదవ రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మెన్‌ ప్రతాప్‌ రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ రోజా రాధాకృష్ణ శర్మ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల రాజనర్సు, ఏరోల్ల శ్రీనివాస్‌, మధుసూదనా చారి, నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్స్‌ తదితరులు పాల్గొన్నారు.