జైలు గోడలపై దాశరథి ధిక్కార రాతలు

– పర్యాటక కేంద్రంగా నిజామాబాద్‌ ఖిల్లా జైలు : సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
నవతెలంగాణ-కల్చరల్‌
నైజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి కృష్ణమాచార్యను నాటి పాలకులు బంధించినా.. నిజామాబాద్‌లోని ఖిల్లా జైలు గోడలపై కూడా ధిక్కార రాతలు రాశారని సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఆ జైలును ఎమ్మెల్సీ కవిత అభ్యర్థన, ప్రభుత్వ సలహాదారు రమణాచారి సూచన మేరకు పర్యాటక కేంద్రంగా.. భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా రూపొందిస్తామని ప్రకటించారు. హైదరాబాద్‌ రవీంద్రభారతి ప్రధాన వేదికపై శనివారం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉద్యమ కవి దాశరథి కృష్ణమాచార్య 98వ జయంతి నిర్వహించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొని.. పండిత కవి ఆయాచితం నటేశ్వరశర్మకు దాశరథి పురస్కారం అందజేశారు. రూ.లక్షా వెయ్యి నూట పదహారు, జ్ఞాపికను బహుకరించారు. దాశరథి అనాధలు, అన్నార్తులు లేని కాలం, కరువు కాటకాలు లేని రోజుల గురించి కలలు కన్నారని, రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలో ఆ కలలు సాకారమవుతున్నాయని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక కొందరు విద్వేష ప్రచారం చేస్తున్నారని, వారికి దీటుగా కవులు కళాకారులు రాష్ట్ర ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఆధునిక వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న మాట్లాడుతూ.. దేశంలో కొన్నిచోట్ల ఆకృత్యాలు, అమానవీయ ఘటనలు జరు గుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మానవత ను ప్రేమించిన దాశరథి.. ఆధిపత్యాన్ని ధిక్కరిం చారని వివరించారు. శాసన మండలి సభ్యులు దేశపతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. తెలంగాణకు అత్యంత ఆత్మీయ కవి దాశరథి అన్నారు. పురస్కార గ్రహీత నటేశ్వరశర్మ.. సీఎం కేసీఆర్‌ను కృష్ణరాయలు లతో పోలుస్తూ ప్రస్తుతించారు. వేదికపై ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కెవి.రమణాచారి, సాహిత్య అకాడమి చైర్మెన్‌ జూలూరి గౌరీశంకర్‌, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, అధికార భాషా సంఘం చైర్మెన్‌ మంత్రి శ్రీదేవి, సంగీత నాటక అకాడెమీ చైర్మెన్‌ దీపికా రెడ్డి, గ్రంథాలయ పరిషత్‌ చైర్మెన్‌ ఆయాచితం శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు. సభకు సంచాలకుడు డాక్టర్‌ మామిడి హరికృష్ణ స్వాగతం పలికారు.