కూతురు ప్రేమ పెండ్లి చేసుకుందని..

– వరుడు, మరో ముగ్గురి ఇండ్లు దహనం చేసిన తండ్రి
– పోలీసుల మోహరింపు.. అదుపులో 8మంది
నవతెలంగాణ -నర్సంపేట
కూతురు ప్రేమ పెండ్లి చేసుకోవడం ఇష్టం లేని ఓ తండ్రి.. వరుడు, అతనికి సహకరించిన ముగ్గురి ఇండ్లకు నిప్పంటించి దగ్ధం చేసిన అమానుష సంఘటన వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం ఇటుకాలపెల్లి గ్రామంలో బుధవారం సంచలనం రేకెత్తించింది. బాధితులు, గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం.. ఇటుకాలపెల్లి గ్రామ సర్పంచ్‌ మండల రవీందర్‌ కూతురు కావ్యశ్రీ.. హసన్‌పర్తి మండలం ఎస్‌ఆర్‌ యూనివర్సిటీ సమీపంలో ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ప్రథమ సంవత్సరం చదువుతోంది. కాగా, అదే గ్రామానికి చెందిన యువకుడు జాలిగం రంజిత్‌, కావ్యశ్రీ కొంతకాలంగా ప్రేమించుకున్నారు. జూన్‌ 30న కావ్య శ్రీ కళాశాల నుంచి రంజిత్‌తో బయటకొచ్చింది. ఈ నెల 1న కొందరి యువకుల సహకారంతో ఓ గుడిలో పెండ్లి చేసుకున్నారు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న కావ్యశ్రీ తండ్రి రవీందర్‌ హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ నెల 4న పోలీసులు కావ్యశ్రీ, రంజిత్‌ను అదుపులోకి తీసుకుని తల్లిదండ్రుల ఎదుట కౌన్సెలింగ్‌ చేశారు. రంజిత్‌తోనే తాను జీవనం సాగిస్తానని కావ్యశ్రీ స్పష్టం చేసింది. దాంతో మనస్తాపం చెందిన రవీందర్‌, అతని కుటుంబ సభ్యులు ఆగ్రహించి బుధవారం రంజిత్‌ ఇంటిని, అతనికి సహకరించిన సామల రాకేష్‌, సమీప శివారు గ్రామంలోని బూస ప్రవీణ్‌ ఇండ్లకు వెళ్లి.. ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యులను లేపి బయటకు వెళ్లగొట్టారు. అనంతరం ఇంటికి నిప్పంటించి దగ్ధం చేశారు. ఈ సంఘటనలో ఇండ్లలోని విలువైన వస్తువులు కాలి బూడిదయ్యాయి. నిల్వ ఉంచిన పత్తి దిగుబడులు దహనమయ్యాయి. ఒక్కో ఇంటిలో రూ.లక్ష విలువైన వస్తువులు కాలి నష్టం వాటిల్లిందని బాధిత కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ చెప్పారు. సంఘటనా స్థలానికి ఏసీపీ సంపత్‌రావు, సీఐ పులి రమేష్‌, ఎస్‌ఐలు రవీందర్‌, సురేష్‌ చేరుకుని వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనలో ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.