కోడలంటే పరాయి మనిషా..?

కోడలంటే పరాయి మనిషా..?ఏ అమ్మాయి అయినా పెండ్లయి అత్త వారింట్లో అడుగు పెట్టగానే అక్కడ అందరూ తనని సొంత మనిషిలా చూసుకోవాలని కోరుకుంటుంది. నిజంగా అలాగే జరిగితే సమస్యే ఉండదు. పెండ్లయిఏండ్లు గడుస్తున్నా ఆమెను బయటి వ్యక్తిగానే చూస్తే సమస్యలు తప్పవు. ఆమెకు పెండ్లయి పాతికేండ్లు అవుతుంది. ఇంకా ఆ ఇంట్లో పరాయిదానిగానే చూస్తున్నారు. ఇన్నేండ్లు మౌనంగా భరించి ఇక ఉండలేక పరిష్కారం కోసం ఐద్వా లీగల్‌ సెల్‌కు వచ్చిన పల్లవి కథే ఈ వారం ఐద్వా అదాలత్‌…
పల్లవికి 40 ఏండ్లు ఉంటాయి. ఆమెకు ముగ్గురు తమ్ముళ్లు. తండ్రి లేడు, తల్లే వారికి అన్నీ. పెండ్లి చేసుకుని పెద్ద కుటుంబం లోకి అడుగుపెట్టింది. అందరూ కలిపి 15 మంది ఉంటారు. ఆడపడుచులు కూడా ఇంటికి దగ్గరలోనే ఉం టారు. ఆడపడు చులు ఎప్పుడూ తల్లి దగ్గరే ఉంటారు. ఈ మధ్య కొన్ని గొడవలు వచ్చి అందరూ విడిపోయారు. ప్రస్తుతం ఇంట్లో పల్లవి, అత్తా, భర్త పాప, బాబు ఉంటున్నారు. మామయ్య లేడు, ఆయన చనిపోయాడు. అత్తయ్యకు పెన్షన్‌ వస్తుంది. పల్లవి కూడా ఉద్యోగం చేస్తుంది. పిల్లలు కాలేజీకి, భర్త ఆఫీస్‌కి వెళ్ళిపోతారు.
అందరూ ఉదయం వెళితే సాయంత్రం వస్తారు. అత్తమ్మ ఇంట్లోనే ఉంటుంది. ఎవ్వరూ ఇంట్లో ఉండరు కదా ఇంకేంటి సమస్య అనుకుంటున్నారా! పల్లవి ఆఫీస్‌ నుండి వచ్చిన తర్వాత కూడా ఇంటి పని మొత్తం చేసుకోవాలి. దానితో పాటు ఆడపడుచుల పిల్లలు కూడా ఇక్కడే ఉంటారు. వాళ్ళకు కూడా ఆమే వంట చేయాలి. ఎంత కష్టపడి వండి పెట్టినా ఏదో ఒక వంక పెడుతుంటారు. అత్త ‘మీ అమ్మ నీకు పనేం నేర్పీయలేదా’ అంటుంది. అల్లుళ్ళు వచ్చినా పల్లవినే టిఫెన్‌ నుండి టీ, కాఫీ, భోజనం ఇలా అన్నీ సమకూర్చాలి.
ఆడపడుచు ఇంట్లోనే ఉంటుంది. అయినా సాయంత్రం టీ కూడా పెట్టదు. పల్లవి ఇంటికి రాగానే టీ పెట్టి ఇస్తే తాగు తుంది. పల్లవి ఆరోగ్యం బాగోలేక పోయినా ఆమే పని చేయాలి. తల్లి కూరగాయలు కట్‌ చేసి ఇస్తానన్నా కూతురు ఒప్పుకోదు. ‘నీకెందుకు అమ్మా కష్టం, అన్నీ ఆమే చేసుకుంటుం దిలే’ అంటది. పండుగలు వచ్చినా, పిల్లల పుట్టిన రోజులు వచ్చినా పిల్లలందరికీ వీళ్ళే బట్టలు కొంటారు. అయినా ఆమెకు తృప్తి ఉండదు. ఎప్పుడూ బట్టలు మాత్రమే తెస్తారు, బంగారు కొనివ్వచ్చు కదా అంటుంది. పల్లవి వాళ్ళ అత్తయ్య ఆమెకు పెన్షన్‌ రాగానే అందులో నుండి సగం డబ్బులు కూతురికే ఇస్తుంది. వాళ్ళ పిల్లలకు కాలేజీ ఫీజులు కూడా పల్లవి భర్త రఘునే కడతాడు. చివరకు ఆడపడుచు మనవరాలు, మనవడికి కూడా ఫీజులు వీళ్ళే కడతారు. దీనికి పల్లవి ఎప్పుడూ అడ్డు చెప్ప లేదు. ఈ ఏడాది తన ఇద్దరు పిల్లలకు కాలేజీ ఫీజు పెరి గింది. ఇద్దరికీ కలిపి సుమారు మూడు లక్షల వరకు అవుతుంది.
ఈ మధ్య పల్లవి ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆమెను ఆస్పత్రిలో చేర్పించాలి. దానికి సుమారు ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ సమస్యల మధ్యనే పల్లవి తల్లి చనిపోయింది. దాంతో మానసికంగా కుంగిపోయింది. ఇలా ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొనే సమయంలో రఘు ఆమెకు అండగా నిలబడ్డాడు. ఇంటి పనిలో కూడా సాయం చేసేవాడు. రోజులో కొంత సమయం కచ్చితంగా భార్యకు కేటాయించాలని డాక్టర్‌ చెప్పాడు. కాబట్టి భర్త, పిల్లలతో పాటు ఆడ పడుచు పిల్లలు కూడా ఆమెతో కొంత సమయం గడిపేవారు. దీంతో మానసిక క్షోభ నుండి కొంత బయటపడింది. కానీ ఆడపడుచు మాత్రం అందరూ ఆమెకు అనుకూలంగా ఉంటున్నారని, ఆమె చెప్పింది వింటున్నారని, తన పిల్లలు కూడా ఆమె చెప్పిందే వింటున్నారని ఈర్ష్య పడింది. బయటి నుండి వచ్చిన ఆమెకు ఇంత ప్రాధాన్యం ఇస్తున్నారని రఘుతో, తల్లితో గొడవ పడేది.
ఆడపడుచు పిల్లలకు పెండ్లి చేయాలను కున్నారు. ఆ విషయం కూడా పల్లవికి చెప్పలేదు. పెండ్లి వారంలో ఉంది అనగా అది కూడా వేరే వారి ద్వారా విషయం తెలిసింది. ఆ సమయంలో పల్లవికి మీటింగ్స్‌ వల్ల ఆఫీసులో సెలవులు ఇవ్వలేదు. పెండ్లికి, రిసెప్షన్‌కి మాత్రమే సెలవు తీసుకుంది. దాంతో ఆడపడుచు పల్లవితో గొడవపడింది. ‘పెండ్లికి కూడా సెలవు పెట్టకుండా నువ్వు కావాలనే ఇలా చేశావు. ఇక నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. నీ పిల్లల్ని తీసుకుని నీ ఇంటికి వెళ్ళిపో’ అని గొడవ పెట్టుకుంది. రఘు ‘ఎందుకు అలా మాట్లాడతావు. ఆమె చేసేది ప్రయివేటు ఉద్యోగం. సెలవులు ఎక్కువగా ఇవ్వరు. నువ్వు పెండ్లి ముహుర్తం పెట్టుకున్నప్పుడు కూడా మాకు చెప్పలేదు. కనీసం నాకు కూడా చెప్పలేదు’ అన్నాడు.
‘నన్ను ఎప్పుడూ ఒక్క మాట కూడా అనని అన్నయ్య ఇప్పుడు పల్లవికే సపోర్ట్‌ చేస్తున్నాడు. నీకు నేను కావాలో పల్లవి కావాలో తేల్చుకో’ అంటూ వెళ్ళిపోయింది. దాంతో రఘు చాలా బాధపడ్డాడు. పల్లవితో మాట్లాడటం మానేశాడు. ఇప్పటికి వాళ్ళ పెండ్లి జరిగి 25 ఏండ్లు అవుతుంది. ఇప్పటి వరకు పల్లవి ఏ ఒక్కరోజూ రఘుతో గొడవ పడలేదు. అతనికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. అలాంటిది ఇప్పుడు ఆమె తప్పు లేకుండా బాధపడాల్సి వస్తుంది. రెండేండ్లలో వాళ్ళ బిడ్డకు ఆడపడుచు కొడుక్కి ఇచ్చి పెండ్లి చేయాల నుకుంటున్నారు. ఇప్పటికి కూడా ఆడపడుచు నేను కావాలో ఆమె కావాలో తేల్చుకో అంటే అత్తమ్మ కూడా ఏమీ మాట్లాడ లేదు. భర్త మాట్లాడటం మానేశాడు. ఇన్నేండ్లయినా ఈ ఇంట్లో తన పరిస్థితి ఏంటి అనేది అర్థం కాలేదు. ఇక భవిష్యత్‌లో తన కూతురి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించు కుంటే ఆమెకు భయం వేసింది. అందుకే సాయం కోసం ఐద్వా అదాలత్‌కు వచ్చింది.
పల్లవి చెప్పింది మొత్తం విన్న తర్వాత మేము వాళ్ళకు ఫోన్‌ చేసి పిలిపించాము. రఘుతో మాట్లాడితే ‘పల్లవి అంటే నాకు చాలా ఇష్టం, ప్రేమ, గౌరవం. ఇప్పటి వరకు ఆమెకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నాను. ఆమే కాదు మా చెల్లి అన్నా నాకు చాలా ఇష్టం. ఆమె నన్ను అర్థం చేసుకోకుండా ఈ విధంగా ప్రవర్తించడం చాలా బాధగా అనిపిస్తుంది. అందుకే ఇంట్లో ఎవరితో ఏమీ మాట్లాడటం లేదు. చెల్లి కోసం నేనేం చేయడానికైనా సిద్ధమే. కానీ నేనే తన జీవితం అనుకున్న పల్లవిని మాత్రం వదులుకోలేను. ఆమె లేకపోతే నేను లేను. ఒక్కగాను ఒక చెల్లి కదా అని ఇన్నేండ్లు తనని ఆదరిస్తూనే ఉన్నాను. ఎప్పుడూ ఒక్క మాట కూడా అనలేదు. అయినా ఆమె మమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు. ఒక్కోసారి పల్లవి సంపాదిం చిన డబ్బు కూడా నా చెల్లి కోసమే ఖర్చు చేసే వాళ్ళం. అయినా పల్లవి ఒక్క మాట కూడా అనేది కాదు. అలాంటి మంచి మనసున్న పల్లవిని ఎన్నో మాటలు అంది. ఇక నా బిడ్డను తన కొడుక్కు ఇవ్వడం నాక్కూడా ఇష్టం లేదు. పల్లవిని కాదని నేను ఆ పని చేయలేను. మా బిడ్డ పెండ్లి పల్లవి ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఇకపై నాకు నా భార్యనే కావాలి’ అన్నాడు.
ఆడపడుచుతో మాట్లాడితే ‘మా ఇంట్లో నా మాటే గెలవాలి. అంతేగానీ బయట నుండి వచ్చిన కోడలి మాట ఎలా చెల్లుతుంది. ఆమె వల్ల మా అన్నయ్య నన్ను ఎన్నో మాటలు అన్నాడు. ఇప్పుడు నా భార్య ముఖ్యం, తనేం చెబితే అదే చేస్తాను అంటున్నాడు. అంటే ఆమె అన్నయ్యను అంతగా మార్చేసింది. చివరికి మా అమ్మ కూడా తనకే సపోర్ట్‌ చేస్తుంది. పైగా నా కోడలు చాలా మంచిది అంటూ అందరితో చెబుతుంది. ఆమె మాట నేను గెలవనివ్వను. పల్లవి కూతురిని నా ఇంటి కోడలిగా చేసుకొని అప్పుడు చెబుతా ఆమె సంగతి’ అంది.
‘మీ అబ్బాయికి వాళ్ళ అమ్మాయిని ఇవ్వమూ అని వాళ్ళిద్దరూ కచ్చితంగా చెప్పారు. అయినా నువ్వు పెండ్లి చేసుకొని సాధిస్తా అంటున్నావు. ఇక్కడ నీకు పెత్తనం చెలాయించే అధికారం లేదు. మీ పిల్లలు, మీ అత్తమామల దగ్గరకు వెళ్ళు. నీ పెత్తనం అక్కడ చూపించు. ఈ రోజుకూ నీ పిల్లల ఖర్చులు, మనవళ్ళ ఖర్చులు కూడా వీళ్ళే చూసుకుంటున్నారు. అయినా నువ్వు పల్లవిని పరాయి మనిషిలా చూస్తున్నావు. ఎవరైనా పెండ్లి తర్వాత నేనూ, నా భార్య అనుకుంటారు. కానీ మీ అన్నయ్య, వదినలు నీ గురించి, నీ కుటుంబం గురించి కూడా ఆలోచిస్తున్నారు. వారితో మంచిగా ఉండకపోగా విడదీయాలని చూస్తున్నావు. వదినను మాటలతో వేధిస్తున్నావు. ఇప్పటికైనా మారకపోతే సమస్య నీకే. నీ అన్న, అమ్మ కూడా మీ వదినకే సపోర్ట్‌ చేస్తున్నారంటే ఆమె ఎంత మంచిదో అర్థం చేసుకో. లేదంటే చివరకు నీకు ఎవ్వరూ మిగలకుండా పోతారు’ అన్నాము.
దాంతో ఆమె ఆలోచనలో పడింది. మౌనంగా వెళ్ళిపోయింది. అప్పటి నుండి పల్లవితో ప్రేమగా ఉండటం మొదలు పెట్టింది.
– వై. వరలక్ష్మి, 9948794051