– ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎద్దేవా
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
‘దశాబ్ది కాలంలో శతాబ్ది అభివృద్ధి’ అనేది ఎన్నికల స్టంట్ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రాభివృద్ధి కాదు… రాష్ట్రాన్ని వంద సంవత్సరాల వెనక్కి తీసుకెళతున్నారని విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని చెప్పారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కల్వకుంట్ల కుటుంబమే బాగుపడిందన్నారు. కేసీఆర్ చేసే అభివృద్ధి ప్రకటనలకే పరిమితమవుతుందని విమర్శించారు. దళిత బంధు పథకం ప్రకటనలో ఆర్భాటం చేసిన కేసీఆర్ దాని అమలులో చిత్తశుద్ది ప్రదర్శించలేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ప్రజలు మార్చిపోతారని అనుకుంటున్నారా? అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో రూ. 50వేల కోట్లు దారి మళ్లించారని విమర్శించారు. ప్రజలు ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించాలనీ, కేసీఆర్ మాయ మాటలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
జీవో 111 రద్దు వెనుక భారీ కుంభకోణం :కిసాన్ కాంగ్రెస్ చైర్మెన్ కోదండరెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం జీవో 111 ను రద్దు చేయడం వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని కిసాన్ కాంగ్రెస్ చైర్మెన్ కోదండరెడ్డి ఆరోపించారు. 111 పరిధిలో ఉన్న 80 శాతం భూముల్లో ఇప్పటికే రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అధికారులు, అనధికారికంగా తక్కువ ధరకు సొంతం చేసుకున్నారని చెప్పారు. మంత్రులు, మాజీ మంత్రులు, పార్టీ నాయకులు ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారని చెప్పారు. పేదలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ఈ ప్రభుత్వం భూదాన బోర్డును రద్దు చేసి, లక్ష 45 వేల ఎకరాల భూమిని చట్ట విరుద్దంగా పారిశ్రామిక వేత్తలకు అమ్ముతున్నదని విమర్శించారు. దళితులకు చెందిన అసైన్డ్ భూములు వేలం వేసి అమ్ముతున్నారని చెప్పారు.