‘దశాబ్ది’ పాలన – ఒక పరిశీలన

రాష్ట్రాల హక్కుల విషయంలో రాష్ట్ర పాలకులు కేంద్రం మీద సమరభేరి మోగించారు. మంచిదే! కేంద్రం నిరంకుశ విధానాల మీద పోరాటమే ప్రాంతీయ పార్టీలకు గౌరవం తెచ్చిపెట్టింది మన దేశ చరిత్రలో. కానీ దీనికి ఒంటరి పోరుతో సరిపోదు. కలిసొచ్చే రాష్ట్ర ప్రభుత్వాలను కలుపుకుని పోరాడాలి. రాష్ట్రంలో కలిసిరావడానికి సిద్ధపడిన పార్టీలతో కలిసి కేంద్రాన్ని నిలదీయాలి. కలిసే ఉన్నామన్న అభిప్రాయం మాత్రం కలిగిస్తున్నారు కానీ కలిసి పోరాటానికి సిద్ధపడటం లేదు.
రాష్ట్రం దశాబ్ది ఉత్సవాల సంరంభంలో ఉన్నది. అద్భుతాలు సృష్టించామంటున్నది. ఏమి సాధించారని బీజేపీ హేళన చేస్తున్నది. కాంగ్రెసూ ప్రశ్నిస్తున్నది. ఇంతకూ… ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అర్థం చేసుకోవల్సిందేమిటి? పాలన గురించి తూలనాత్మక పరిశీలనతో మాత్రమే అది సాధ్యం. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలకూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలకూ తేడా ఏమీ లేదా? ఎవరి రాజకీయ ప్రయోజనాలతో వారు పరిశీలిస్తే సహజంగానే పాక్షిక నిర్థారణలకు వస్తాం. పాలకులు కూడా, ఆత్మావలోకనం చేసుకోవల్సిన సందర్భమని గుర్తించకుండా, అంతా బ్రహ్మాండమని గొప్పలు చెప్పుకోవటం వల్ల ప్రయోజనం ఉండదు. ఏ ప్రభుత్వం పనితనమైనా ప్రజా ప్రయోజనాలతో బేరీజు వేయటంతోనే తేలుతుంది.
తెలంగాణ ప్రభుత్వ విధానాలలో కొన్ని ఆహ్వానించదగినవి. రైతులకు ఏ సమయంలోనైనా, ఎంత సమయమైనా ఉచిత విద్యుత్తు, రైతుబంధు, ధాన్యం కొనుగోళ్ళు, సంక్షేమ పథకాలు, వెయ్యికి పైగా గురుకులాలు, ప్రభుత్వ వైద్యం మెరుగుపర్చటం, కొంతమేరకైనా ఖాళీ పోస్టుల భర్తీ లాంటి చర్యలు ప్రజా జీవితం మీద మంచి ప్రభావం చూపుతాయి. ప్రజలకు ఊరట కల్గించే విధానాలే! ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ తదితర శక్తులు మత విద్వేషాలు సృష్టించేందుకు ప్రయత్నించిన సందర్భాలలో సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. పెద్దనోట్ల రద్దు, కార్మిక చట్టాలు రద్దు, కరోనా కాలంలో చర్యల వంటి సందర్భాలలో కేంద్రం తప్పుడు విధానాలను వ్యతిరేకించలేదు. ప్రారంభంలో కేంద్రంతో సహకారం పేరుతో తప్పటడుగులు వేసినప్పటికీ, తమకే ముప్పు ఏర్పడటంతో కొంతకాలంగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ తప్పుడు విధానాల మీద, కేంద్రం నియంతృత్వం మీద పదునైన విమర్శలకు సిద్ధపడటం మంచి పరిణామం. అదే సమయంలో ప్రభుత్వం విద్యారంగంలో అందరికీ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య వాగ్దానం చేసింది. దళితులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్‌ బెడ్రూం ఇండ్లు వాగ్దానాలుగానే మిగిలిపోయాయి. వ్యవసాయ కూలీల ఊసెత్తదు ప్రభుత్వం. కార్మికుల కనీసవేతనాలు, హక్కులు, పోరాటాలు, నిరసనలంటే అసహనం ప్రదర్శిస్తున్నది. ప్రజల జీవితాలపైన దీర్ఘకాలిక ప్రభావం చూపే మౌలిక సమస్యల ఊసెత్తటం లేదు. నూతన సచివాలయ నిర్మాణం, కాళేశ్వరం ప్రాజెక్టు, అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ కూడా చిరకాలం నిలిచిపోయేవే! సాగునీటి సమస్య పరిష్కారానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగం. ఖర్చు బాగా తగ్గించి, ఇంతకన్నా మెరుగైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేక కాదు. కానీ ఈ మాటకు ఇప్పుడు విలువ ఉండదు. సత్ఫలితాల మాటున నిధుల దుబారా, దుర్వినియోగం దాగుంటాయి. నూతన సచివాలయం సకల సౌకర్యాలతో, అందంగా నిర్మించారు. కానీ, ఇంకా చాలాకాలం పాత భవనం ఉపయోగపడేదే. ఈ డబ్బు తక్షణావసరాలకు ఖర్చుచేసి ఉండవచ్చు. అంబేద్కర్‌ విగ్రహా విష్కరణ సామాజిక ఉద్యమకారులకు స్ఫూర్తినిస్తుంది. కానీ కులవివక్ష గురించి పాలకులు మాట్లాడకుండా, కేవలం విగ్రహం తో సంతృప్తిపరిచే ప్రయత్నమిది. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళల భద్రతకు కేవలం ‘షీ’ టీములే పరిష్కారం కాదుకదా!
రైతుబంధు, గురుకులాలు, ప్రభుత్వ వైద్యం మీద ఖర్చు, రైతులకు ఉచిత విద్యుత్తు, సాగునీరు, ధాన్యం కొనుగోళ్ళు, పాక్షికంగానే అయినా ఉద్యోగ ఖాళీ పోస్టుల భర్తీ, తాగునీరు లాంటి చర్యలు ఆర్థిక వ్యవస్థ మీద, సమాజం మీద సానుకూల, దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయి. వీటితోపాటు రకరకాల పెన్షన్లు, బతుకమ్మ చీరలు, దళితబంధు, వృత్తిదారులకు, ఆడపిల్లల పెండ్లిండ్లు తదితర సందర్భాలలో అమలుచేస్తున్న అనేక సంక్షేమ పథకాలు పేదలకు ఊరటనిస్తున్నాయి. ఈ చర్యల పేరుతో ప్రభుత్వం పెద్దయెత్తున ఖర్చుపెడుతున్న నిధులు మార్కెట్లోకి వస్తున్నాయి. సహజంగానే ఇది మళ్ళీ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతుంది.
ప్రజాస్వామ్య విలువల విషయంలో మాత్రం ప్రజల ఆశలమీద ప్రభుత్వం నీళ్ళు చల్లింది. అధికారంలోకి రాగానే ప్రతిపక్షాన్ని ఖాళీ చేసే పనిలోపడింది. ప్రతిపక్షంలో రాజకీయ శూన్యత, మరింత ప్రమాదకరమైన మతోన్మాద శక్తులు చొరబడేందుకు తోడ్పడుతుందన్న స్పృహలో లేకుండా ఏకపక్ష ధోరణి ప్రదర్శించింది. ఆమేరకు నష్టం రుచి చూసిన తర్వాత మాత్రమే నాలుక కర్చుకున్నది. శ్రామికుల హక్కులపట్ల అప్రజాస్వామిక ధోరణి హానికరం. ‘ఎవరూ తమ సమస్యలు పరిష్కారించాలని అడగొద్దు. సమ్మెలు చేయొద్దు’. ప్రభుత్వాధినేత ‘దయ’తో ఇచ్చింది తీసుకోవాలి. ఇదీ వరస! కనీసం నిరసన ప్రదర్శనలూ, ధర్నాలు సైతం గిట్టవు. అతికష్టం మీద, అనుమతించిన కార్యక్రమాల విషయంలో కూడా పోలీసుల ‘అతి’ ఆంక్షలు. చివరకు ముఖ్యమంత్రిగానీ, ముఖ్యమంత్రి ముందు ప్రతిపాదనలు పెట్టగల మంత్రులుగానీ వినతిపత్రాలు కూడా స్వీకరించరు. తాము సుముఖంగా ఉన్న విషయాల మీద, అదికూడా తామే చేస్తున్నామని చెప్పుకునే అవకాశం ఉన్నమేరకే వినతిపత్రాలకు అవకాశం! ప్రతిపక్ష పార్టీల నాయకులకు, శాసనసభ్యులకు, మాజీ ప్రజాప్రతినిధులకు కూడా కనీసం అపాయింట్‌మెంట్‌ దొరకదు. రియలెస్టేట్‌కు పెద్దపీట వేయటం, ప్రభుత్వమే భూముల అమ్మకానికి సిద్ధపడటం, అభివృద్ధి పేరుతో పేదల అసైన్డ్‌ భూము లు గుంజుకోవటం గమనించదగిన విషయం. పేదలకు ఇక ఇండ్ల స్థలాలు దొరకవన్న ఆందోళన మొదలైంది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా, ఒకవైపు మహిళా దినోత్సవం నిర్వహిస్తూనే, అదేరోజు మహబూబాబాద్‌లో మహిళలమీద పోలీసులు దౌర్జన్యం చేశారు.
రాష్ట్రాల హక్కుల విషయంలో రాష్ట్ర పాలకులు కేంద్రం మీద సమరభేరి మోగించారు. మంచిదే! కేంద్రం నిరంకుశ విధానాల మీద పోరాటమే ప్రాంతీయ పార్టీలకు గౌరవం తెచ్చిపెట్టింది మన దేశ చరిత్రలో. కానీ దీనికి ఒంటరి పోరుతో సరిపోదు. కలిసొచ్చే రాష్ట్ర ప్రభుత్వాలను కలుపుకుని పోరాడాలి. రాష్ట్రంలో కలిసిరావడానికి సిద్ధపడిన పార్టీలతో కలిసి కేంద్రాన్ని నిలదీయాలి. కలిసే ఉన్నామన్న అభిప్రాయం మాత్రం కలిగిస్తున్నారు కానీ కలిసి పోరాటానికి సిద్ధపడటంలేదు. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర, అన్ని పంటలను ‘మద్దతు ధర’ పరిధిలోకి తేవటం, మార్కెట్‌ సౌకర్యం లాంటి సమస్యల మీద కేంద్రంతో ఐక్య ఉద్యమం అవసరం. ఆర్టీసీ, సింగరేణి పరిరక్షణ, విభజన సమస్యల పరిష్కారం వంటి విషయాలలో కేంద్రంతో పోరాడాలి.
దశాబ్ది ఉత్సవాల సమయంలో పరిశీలన ఇంతవరకే పరిమితం కాకూడదు. రాజకీయ విభేదాలు ఎన్ని ఉన్నా ఉన్నత వర్గాల ప్రయోజనాలు కాపాడే విషయంలో మాత్రం వామపక్షేతర పార్టీలన్నింటిదీ ఒకే దారి. కేంద్రమైనా, రాష్ట్రమైనా అదే పరిస్థితి. శ్రామికుల సమస్యలు ఎర్రజెండాకు తప్ప ఎవరికీ పట్టవు. ఈ తొమ్మిది సంవత్సరాల పాలనలో కూడా అంతిమంగా తేలింది ఇదే. కేంద్రంలో మోడీ ప్రభుత్వం నూతన విద్యావిధానం పేరుతో విద్యలో మరింతగా వర్గ విభజనకు పూనుకున్నది. ఉన్నత వర్గాలకు తప్ప ఇతరులకు విద్య అందుబాటులో లేకుండా చేయబూనుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టతనివ్వాలి. కానీ ఇక్కడ కూడా మరో రకమైన విభజన జరుగుతున్నది. ఆర్థికంగా వెసులుబాటు ఉన్న కుటుంబాల పిల్లలు ప్రయివేటు సంస్థలకు పోతున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలు పాలకుల నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. బడుగు బలహీన వర్గాల నుంచి కూడా కొద్దిమందికి గురుకుల విద్యనందించి, మిగిలినవారందరినీ వదిలేస్తున్నారు. ఉన్నత విద్యాసంస్థలను గాలికి వదిలేస్తున్నారు. ఫలితంగా ఉన్నత కుటుంబాల పిల్లలు, బడుగువర్గాలలోని చదువులో ముందున్నవారిని (క్రీమీలేయర్‌) మినహా మిగిలిన విద్యార్థులను నిర్లక్ష్యం చేస్తున్నారు. అంటే ఉన్నత వర్గాలకు, వారికి అవసరమైనవారికి మాత్రమే నాణ్యమైన విద్య.
తలసరి ఆదాయం సాధారణ ప్రజల జీవన ప్రమాణాలను సూచించదు. బలిసిపోతున్న బడాబాబుల ఆస్తి కూడా ఈ లెక్కల్లో కలుస్తుంది కదా! అటవీ విస్తీర్ణంలో కూడా మెరుగైన ఫలితాలు సూచిస్తున్నది తెలంగాణ. కానీ ఇది ఆదివాసీల పోడుహక్కు మీద దాడి చేస్తూ చూపిస్తున్న లెక్క తప్ప, కొత్తగా అభివృద్ధి చేసిన అడవుల విస్తీర్ణం కాదు. జీఎస్టీ వృద్ధి రేటు ప్రజలమీద పాలకులు వేసిన భారాల ప్రతిబింబం. కేంద్రం లెక్కల ప్రకారం సరుకుల వినియోగం పెరగలేదు. అందువల్ల సరుకుల అమ్మకాల పెరుగుదలకన్నా ప్రజలమీద మోపిన అదనపు పన్నుల భారం ఫలితమే జీఎస్టీ ఆదాయం పెరుగుదల. కార్మికులకు కనీసవేతనాలు పెంచకుండా, యూనియన్ల కార్యకలాపాలను నిరోధించి, పెట్టుబడిదారులకు ఇస్తున్న రాయితీల ఫలితమే పరిశ్రమల అభివృద్ధి. పన్నుల రాబడిలో తెలంగాణ సాధించిన ర్యాంక్‌ కూడా దీనినే సూచిస్తున్నది. ఆదాయం అభివృద్ధి రేటు, తలసరి విద్యుత్తు వినియోగం (ఇది కూడా భారీ మధ్యతరహా పరిశ్రమలు, కాంట్రాక్టర్లు, వాణిజ్యవేత్తలు వాడే విద్యుత్తు కలుపుకుని లెక్కిస్తారు!) కూడా ఇలాంటిదే కదా! పెట్టుబడిదారుల ప్రయోజనాలు కాపాడటం, ప్రజలమీద భారాలు మోపటమే అంతిమంగా వీటి సారాంశం. రైతుబంధు కూడా పెద్ద సంఖ్యలో ఉన్న పేద, మధ్యతరగతి రైతులకు ఊరట కలిగిస్తున్నది. కానీ ఇందులో అధికభాగం ఎక్కువ భూమి కలిగిన భూస్వాములకు, ధనిక రైతులకు, రియలెస్టేట్‌ వ్యాపారులకే దక్కుతున్నది. ధరణి పేరుతో దశాబ్దాలుగా పేదలు సాగుచేసుకుంటున్న భూములు భూస్వాములకు ధారాదత్తం చేశారు. బడాబాబుల లావా దేవీ లు సులభతరం చేశారు. ఇవన్నీ కలిపితేనే దేశంలో ఐదు ఉన్నతస్థాయి రాష్ట్రాల జాబితాలో తెలంగాణకు దక్కిన స్థానం.
ఇప్పటివరకు చెప్పుకున్న విషయాలన్నీ ఎట్లా ఉన్నా, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పాలనను కాంగ్రెస్‌ నాయకులు విమర్శించడంలో అర్థం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలన చూసినా, ప్రస్తుతం కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలతో పోల్చినా, కాంగ్రెస్‌ నాయకులు దశాబ్ది ఉత్సవాలను ప్రశ్నించటం సమంజసం కాదు. మంచిచెడ్డలు బేరీజు వేస్తే అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో ఈ రాష్ట్రంలో పాలనను విమర్శించే కనీస అర్హత కూడా బీజేపీ నాయకత్వానికి లేదు. కేంద్రంలో తామే అధికారంలో ఉన్నామన్న సోయి లేకుండా మాట్లాడటం బాధ్యతారహితం. తాము అధికారంలో ఉన్న ఏ రాష్ట్రం కూడా తెలంగాణ దరిదాపులో కూడా లేదు కదా! కేవలం రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం రాళ్ళేయటమే తప్ప నిజాయితీ లేదు. అంతే కాదు. ప్రధాని మోడీ, తానే స్వయంగా పదేండ్లు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు. గుజరాత్‌ నమూనా గురించి దేశమంతా ప్రచారంలో పెట్టి ప్రధాని అభ్యర్థిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రధానిగా కూడా తొమ్మిదేండ్లుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు గుజరాత్‌ ఊసెత్తగల స్థితిలో లేరు. మోడీ ప్రభుత్వ లెక్కల ప్రకారమే అన్ని కీలకమైన అంశాలలోనూ తెలంగాణకన్నా గుజరాత్‌ బాగా వెనుకబడింది.
ఇప్పుడు దేశంలో ఒక నమూనాగా ప్రజలను ఆకర్షిస్తున్న రాష్ట్రం కేరళ. ఎర్రజెండా పాలనలో ఉన్న కేరళ, సాధారణ ప్రజల జీవితాలతో ముడిపడిన అన్ని కీలకాంశాలలోనూ దేశానికే ఆదర్శప్రాయంగా ఉన్నది. మానవాభివృద్ధి సూచీలలో ముందున్నది. వైద్యరంగంలో, కరోనాను ఎదుర్కొన్న తీరుకు ఐక్యరాజ్యసమితి నుంచి అరుదైన గౌరవాన్ని అందుకున్నది. వలస కార్మికులను అతిథులుగా పరిగణించింది. దేశంలోనే కార్మికులకు అత్యధిక కనీస వేతనాలు అమలు చేస్తున్న రాష్ట్రం కేరళ. భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవటంలో, ప్రజలకు అండగా నిలవటంలో తనకు తానే సాటి కదా! ప్రతిపక్షాన్ని సైతం గౌరవిస్తూ, ప్రజాస్వామ్య విలువలకు వన్నె తెస్తున్న రాష్ట్రం. ప్రభుత్వరంగం, సామాజిక న్యాయం, మహిళల భద్రత, లౌకిక విలువలు, సహకార రంగం అభివృద్ధి తదితర విషయాలలో దేశం దృష్టిని ఆకర్షిస్తున్న ఆదర్శపాలన. అందువల్ల తెలంగాణలో పాలన మరొక ముందడుగు వేయాలంటే కేరళ పాలనను పరిశీలించాలి. తెలంగాణ ప్రత్యేక పరిస్థితులకు అన్వయించుకోవాలి. కానీ వామపక్షాలకు మాత్రమే సాధ్యమైన విధానాలు అవి.
సరిగ్గా ఈ సమయంలోనే, బీఆర్‌ఎస్‌ రాజకీయ విధానాల గురించి కూడా చర్చ వేడెక్కింది. గత కొంతకాలంగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మాద విధానాల మీద బీఆర్‌ఎస్‌ పోరాటాన్ని తీవ్రతరం చేసింది. రాష్ట్రాల హక్కుల కోసం స్వరం పెంచింది. ప్రభుత్వరంగం ప్రాధాన్యత గురించి కూడా నొక్కి చెప్పింది. ఇదే సరైంది. కానీ, బీఆర్‌ఎస్‌ క్రమంగా బీజేపీకి దగ్గరవుతుందన్న వాదనలు మీడియాలో బలంగా ముందుకొస్తున్నాయి. మోడీ ప్రభుత్వం బ్లాక్‌మెయిల్‌ ఫలితమేనని కూడా వస్తున్నది. ఈ విషయంలో బీఆర్‌ఎస్‌ నాయకత్వం ఇంకా స్పందించకపోవటం ఆశ్చర్యకరం!
ఎస్‌. వీరయ్య