చదువుల్లో నాణ్యత… ప్రభుత్వాల బాధ్యత

పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం ఉద్దేశించిన ”మన ఊరు-మనబడి / మనబస్తీ-మన బడి” పనుల్లో కూడా వేగం పుంజుకోవడం లేదు. ఇప్పటికీ 85శాతం బడుల్లో కంప్యూటర్లు లేవు. ఉపాధ్యాయుల కొరత ఉన్నా నియామకాలు చేపట్టడం లేదు. ఆరువేలకు పైగా బడుల్లో ఒక్క ఉపాధ్యాయుడే ఐదు తరగతులు బోధిóంచాల్సి వస్తుంది. బడి పారిశుద్ధ్య నిర్వహణ కోసం స్కావెంజర్లు, వాచ్‌మెన్లు లేరు. పాఠ్య పుస్తకాలు, దుస్తులు సకాలంలో అందడం లేదు. గత అనుభవాలు.. వివిధ రకాల ఖాళీలతో పాఠశాలల పర్యవేక్షణ పడకేసింది.
ప్రభుత్వ బడంటే? సమాజ ఆస్తి. అది విలువలు, సమానత్వం, నైతికత పరిపూర్ణమైన వ్యక్తిత్వం గల పౌరులను తయారు చేసే కేంద్ర బిందువు. జీవితాన్ని నిలబెట్టే నాణ్యమైన విద్య పొందడం బాలబాలికల ప్రాథమిక హక్కు. ఏదేశం మనుగడ సాగాలన్నా అందులో కీలకమైనది విద్యారంగమే. దేశ వ్యవస్థలో దానిది తిరుగులేని స్థానం. మానవ మేధస్సుకు అతిముఖ్యమైన సాధనం. అటువంట విద్యలో మన విద్యార్థులు ఎక్కడున్నారు. ఎలాంటి స్థానాల్లో ఉన్నారనేది ముఖ్యం. ప్రపంచంలోనే అతి పెద్ద పాఠశాల విద్యావ్యవస్థ మనది. సుమారు15లక్షల పాఠశాలలు, 25కోట్ల మందికి పైగా విద్యార్థులు, 85లక్షల మంది ఉపాధ్యాయులతో ముందుకు సాగుతోంది. మైనం ముద్దలాంటి చిన్నారులను భావి భారత నిర్మాతలుగా మలచడంలో సర్వహంగులున్న పాఠశాలలు, గురువుల పాత్ర కీలకం. ఆహ్లాదకరమైన తరగతి గదిలో వృత్తి నిబద్ధత గల ఉపాధ్యాయుల బోధనలను అందిపుచ్చుకున్న జ్ఞానమే విద్యార్థుల భవిష్యత్తుకు చుక్కానిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరి ప్రతిభా పాటవాలే రేపటి దేశ అభివృద్ధికి దోహదం. కానీ పాలకులకు విద్యా వ్యవస్థ మీద ఉన్న ఉదాసీన విధానాలు, కోవిడ్‌ మహమ్మారి విజృంభణతో పాఠశాలలు దీర్ఘకాలం (రెండు విద్యా సంవత్సరాలు) మూతబడ్డాయి. ఆ తర్వాత ఆన్‌లైన్‌ చదువుల్లో అభ్యసన సామర్థ్యాలు, విద్యా ప్రమాణాలు పాతాళానికి దిగజారిపోతున్నాయి. బడి గడప తొక్కకుండానే నేరుగా ఆ కాలంలోని విద్యార్థులు వారి వయసు ఆధారం చేసుకుని మూడో తరగతిలోకి చేర్చుకో(కూర్చో)వలసి వచ్చింది. అలా ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో భాష, గణిత తదితర విషయాల్లో విద్యార్థుల్లో కనీస అభ్యసన స్థాయిలైన పఠనం, లేఖనం నైపుణ్యాలు ఘోరంగా తెగ్గోసుకుపోయిన చేదువాస్తవాలను అనేక నివేదికలు, అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ సంక్షోభం ప్రయివేటు, ప్రభుత్వం అనే తేడా లేకుండా అందరిని కుదిపేసి దెబ్బతీసింది. ఆ తర్వాత ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల కోసం వారి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ట్యూషన్లు పెట్టించడం వల్ల అభ్యాసన కాస్త మెరుగైనటు సమాచారం. కానీ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థుల్లో అత్యధికులు రెక్కాడితే గానీ డొక్కాడని పేద, బడుగు, మధ్య తరగతికి చెందిన పిల్లలు. వారి తల్లిదండ్రులు బతుకు దెరువు, జీవనోపాధిపై పెట్టినంత శ్రద్ధ వారి పిల్లల చదువులపై పెట్టలేరు. ట్యూషన్లు లాంటివి సమకూర్చలేరు. వారి ఆర్థిక పరిస్థితులు వారికి సహకరించవు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాథమిక విద్యలో నాణ్యత లేమి వీరికి శాపంగా మారింది. వీరు విజ్ఞాన పోటీ ప్రపంచంలో తట్టుకోలేకపోతున్నారు.
దీనిని గుర్తించిన పాలకులు పలు నివేదికల, సూచనల మేరకు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి మూలమైన ప్రాథమిక తరగతుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంచాలన్న లక్ష్యంతో కేంద్రం గత విద్యా సంవత్సరం నుండి ఫౌండేషన్‌ లిటరసీ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్‌) పేరిట అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. తెలంగాణలో తొలిమెట్టు పేరుతో 2022 ఆగస్టు 15న దీనికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందే అభ్యసన సామర్థ్యాలు ఎలా ఉన్నాయో? దేశవ్యాప్తంగా మౌఖిక, రాత పూర్వకంగా మొత్తం 20 మాతృభాషలు, గణితంలో మూడో తరగతి విద్యార్థుల ప్రగతిని జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) పరిశీలించారు. దేశంలోని 10వేల ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 3వ తరగతి చదువుతున్న 86వేల విద్యార్థుల అధ్యయన పరిశీలన నివేదిక ఇది. ప్రపంచస్థాయి ప్రమాణాల ప్రకారం… నిమిషంలో 8పదాలలోపు మాత్రమే చదవగలిగిన వారిలో కనీస ప్రాథమిక పరిజ్ఞానం లేదని అర్థం. 9-26 మధ్య పదాలను తప్పుల్లేకుండా చదివితే, ప్రపంచ కనీస ప్రమాణాలను పాక్షికంగా అందుకున్నట్లు. 27-50 పదాలు చదవగలిగితే ప్రపంచ కనీస సామర్థ్యాలు కలిగి ఉన్నారని లెక్క. రెండు తెలుగు రాష్ట్రాల్లో పాఠశాల విద్యార్థుల పై ఎన్సీఈఆర్టీ పరిశీలనా నివేదికల మేరకు సగటున 52శాతం మంది విద్యార్థులలో కనీస అభ్యసన సామర్థ్యాలు లేవని స్పష్టమైంది. అబ్బాయిల కంటే అమ్మాయిలు చాలా వరకు మెరుగ్గా ఉన్నారు. మూడో తరగతిలో మాతృభాషను చదవలేకపోతున్నారు. 19శాతం మంది ఒక్క తెలుగు పదం కూడా చదవలేక పోవడం ఆందోళన కలిగిస్తుంది. మన రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యలో ఒక్కొక్క విద్యార్థిపై చేసే సగటు ఖర్చు రూ.60వేలు దాటుతుంది అని చెపుతుంది. విద్యా ప్రమాణాలు మాత్రం వెనుక బాటులో నాసిరకంగా ఉంటుందనే ప్రభుత్వాల వాదనలు ఇలా ఉంటే? వాస్తవ పరిస్థితులను చూస్తే గనుక పాఠశాల విద్యా బడ్జెట్‌ పెరుగుతున్నా అందులో సుమారు 90శాతం నిధులు జీతభత్యాలకు పోను, మిగిలిన 10శాతం ఇతర సదుపాయాలకు వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది.
పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం ఉద్దేశించిన ”మన ఊరు-మనబడి / మనబస్తీ-మన బడి” పనుల్లో కూడా వేగం పుంజుకోవడం లేదు. ఇప్పటికీ 85శాతం బడుల్లో కంప్యూటర్లు లేవు. ఉపాధ్యాయుల కొరత ఉన్నా నియామకాలు చేపట్టడం లేదు. ఆరువేలకు పైగా బడుల్లో ఒక్క ఉపాధ్యాయుడే ఐదు తరగతులు బోధిóంచాల్సి వస్తుంది. బడి పారిశుద్ధ్య నిర్వహణ కోసం స్కావెంజర్లు, వాచ్‌మెన్లు లేరు. పాఠ్య పుస్తకాలు, దుస్తులు సకాలంలో అందడం లేదు. గత అనుభవాలు.. వివిధ రకాల ఖాళీలతో పాఠశాలల పర్యవేక్షణ పడకేసింది. 602 మండలాల్లో కేవలం 17చోట్ల మాత్రమే రెగ్యులర్‌ ఎంఈఓలు ఉన్నారు. పీజీ హెచ్‌ఎమ్‌లకు ఒక్కొక్కరికి నాలుగు ఐదు మండలాల చొప్పున అదనపు బాధ్యతలు ఇవ్వడంతో అటు ఉన్నత పాఠశాల, ఇటు ప్రాథమిక పాఠశాలలలో పర్యవేక్షణ కుంటు పడుతోంది. ప్రాంతీయ విద్యాధికారులు, జిల్లా విద్యాధికారులు, జిల్లా ఉప విద్యాధికారుల పోస్టులు ఇలా విద్యా వ్యవస్థ మొత్తం ఖాళీలతో కూనరిల్లుతూ, పర్యవేక్షణ లోపాలతో ప్రమాణాలు పడిపోతున్నట్లు అసర్‌ సర్వే 2022 చెపుతుంది. అంతేకాదు గతం కంటే గణనీయంగా పడిపోయినట్లు తెలిపింది. ఇలా ప్రభుత్వం లోపాలను కప్పి పుచ్చుకుంటూ సమస్యల పరిష్కారం చేయకుండా ఉపాధ్యాయులను సమాజంలో తక్కువ చేయడం భావ్యమా! ప్రభుత్వ బడిని ప్రయోగశాలగా మార్చారు. ఇవి ప్రయివేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలకు పిల్లలు వెళ్లడానికి తోడ్పాటు కావా! అది మీకు తెలియదా! కరోనా మరణ మృదంగం వెరసి విద్యార్థుల్లో మాతృభాష, గణితం మిగతా విషయాల్లో కనీస సామర్థ్యాల వెనుకబాటుతనంతో విద్యార్థులు కాలం వెల్లదీస్తున్నారు. ఏ విషయాన్ని అవగాహన చేసుకో వాలన్నా… భాషపై పట్టు రావాలి. భాషాపరమైన వెనుకబాటు ఉంటే ఇతర సబ్జెక్టు(విషయా)ల్లో రాణించలేరు. ఈ సమస్య పరిష్కరించబడాలన్నా… పాఠశాల విద్య బాగుపడాలన్నా… ఇన్నాళ్ల నిర్లక్ష్యం వీడి ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో టైం బాండ్‌ ప్రోగ్రామ్‌తో బడులను సకల సౌకర్యాలతో ఎలాంటి ఖాళీలు, సమస్యలు లేని విధంగా సర్వహంగులతో తయారు చేయాల్సి ఉంది. అప్పుడు నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల భాషా, పరిజ్ఞానం మెరుగుపడుతుంది. అదే విధంగా విద్యా వ్యాపారాన్ని ఆపి ‘కామన్‌ స్కూల్‌’ విధానంలో అందరికీ ఉచిత నాణ్యమైన విద్యనందిస్తే దేశ భవిష్యత్తు మరింత ఉన్నతంగా ఉజ్వలిస్తుంది.
మేకిరి దామోదర్‌ 
సెల్‌: 9573666650

Spread the love