భారత్‌లో క్షీణిస్తున్న హక్కుల పరిస్థితి

Desilining Rights Situation in India– ఇది ప్రమాదకరమైనది :యూఎన్‌ ప్రత్యేక ప్రతినిధి ఫెర్నాండ్‌ డి వరెన్నెస్‌
న్యూఢిల్లీ: భారతదేశంలోని హక్కుల పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) ప్రత్యేక ప్రతినిధి ఫెడ్నాండ్‌ డి వరెన్నెస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో ”క్షీణిస్తున్న” హక్కుల పరిస్థితి ”భారీ, క్రమబద్ధమైన, ప్రమాదకరమైనది” అని అన్నారు. వాషింగ్టన్‌ డీసీలో యూఎస్‌ కమిషన్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ రిలిజియస్‌ ఫ్రీడం(యూఎస్‌సీఐఆర్‌ ఎఫ్‌) నిర్వహించిన కార్యక్రమంలో భారతదేశంలో మతపరమైన స్వేచ్ఛపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ”భారత్‌ ప్రపంచంలో దురాగతాల ప్రధాన ఉత్పాదక దేశాలలో ఒకటిగా మారే ప్రమాదం ఉన్నది. ప్రధానంగా మతపరంగా ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, ఇతర మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని ఉల్లంఘనలు, దుర్వినియోగాలు భారీ స్థాయిలో ఉంటున్నాయి. ఇవి అస్థిరత, దౌర్జన్యాలు, హింస ప్రధాన జనరేటర్లు. ఇది కేవలం వ్యక్తి లేదా స్థానికమైనది కాదు. ఇది క్రమబద్ధమైనది, మతపరమైన జాతీయవాదానికి ప్రతిబింబం” అని తెలిపారు. యూఎన్‌ ప్రత్యేక ప్రతినిధి మణిపూర్‌ ఘటనను చాలాసార్లు గుర్తు చేశారు. మే 4న జరిగిన ఒక సంఘటనపై వైరల్‌ అయిన వీడియో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు గురి చేసిన విషయం విదితమే. ”ఈ వీడియో అంతర్జాతీయ దృష్టికి వచ్చే వరకు అధికారుల నుంచి చర్యలు నిష్క్రియాత్మకంగా ఉన్నాయి” అని అతను చెప్పాడు. 2014 నుంచి 2018 మధ్య మైనారిటీలపై ద్వేషపూరిత నేరాలు 786 శాతం పెరిగాయని అతను ఒక అధ్యయనాన్ని ఉదహరించాడు. అసోంలో ఎన్నార్సీ, జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దును ప్రస్తావించారు.