డిగ్రీ కాలేజీలకు మూడేండ్ల వరకు గుర్తింపు

– ఈ విద్యాసంవత్సరం ముగిసేలోగా అఫిలియేషన్లు పూర్తి
– జులై నుంచి తరగతులు ప్రారంభం
– కొత్తగా బీఎస్సీ కంప్యూటర్స్‌ కోర్సు
– ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ లింబాద్రి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ప్రయివేటు డిగ్రీ కాలేజీలకు ఇక నుంచి మూడేండ్ల వరకు విశ్వవిద్యాలయాలు అనుబంధ గుర్తింపును ప్రకటిస్తాయని ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ఆర్‌ లింబాద్రి చెప్పారు. ప్రస్తుత విద్యాసంవత్సరం ముగిసేలోగా అఫిలియేషన్ల ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. గురువారం హైదరాబాద్‌లో ఆరు సంప్రదాయ విశ్వవిద్యాలయాల వీసీలు, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌తో ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ఆర్‌ లింబాద్రి సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌, వీసీలు డి రవీందర్‌, టి రమేష్‌, సిహెచ్‌ గోపాల్‌రెడ్డి, లక్ష్మికాంత్‌ రాథోడ్‌, ఎస్‌ మల్లేష్‌, డి రవీందర్‌, ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనంతరం తనను కలిసిన విలేకర్లతో లింబాద్రి మాట్లాడుతూ వచ్చే విద్యాసంవత్సరం జులైలో ప్రారంభమవుతుందని చెప్పారు. జులై నుంచే డిగ్రీ ప్రథమ సంవత్సరంతోపాటు మిగిలిన విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయని అన్నారు. ఈలోగా అఫిలియేషన్ల ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఆలస్యం కావడం వల్ల కాలేజీలు, ఉన్నత విద్యామండలి, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఒక కొత్త కోర్సు కోసం గతంలో 20 కోర్సులకు గుర్తింపు ఇవ్వకుండా ఆపడం సరైంది కాదన్నారు. ఇకనుంచి డిగ్రీ కాలేజీలకు మూడేండ్ల వరకు అనుబంధ గుర్తింపు ఇస్తామని చెప్పారు. మొదటి ఏడాది అఫిలియేషన్‌ ఫీజు కట్టాలనీ, రెండు, మూడో ఏడాది ఆన్‌లైన్‌లో వివరాలను సంబంధిత విశ్వవిద్యాలయాలకు సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. అఫిలియేషన్ల కోసం వర్సిటీల వారీగా యూనివర్సిటీ మేనేజ్‌మెంట్‌ సిస్టం పోర్టల్‌ అందుబాటులో ఉంటుందని వివరించారు. కోర్సులకు ఇచ్చే అఫిలియేషన్లలో కూడా మార్పులు చేస్తున్నామని అన్నారు. ఒక్కో కోర్సుకు ఒక గుర్తింపు ఇవ్వబోమని చెప్పారు. ఉదాహరణకు మ్యాథ్స్‌, ఫిజికల్‌ సైన్స్‌ ఉండే సబ్జెక్టులకు బీఎస్సీ ఫిజికల్‌ సైన్స్‌ కోర్సుకు గుర్తింపును ప్రకటిస్తామని వివరించారు. వీసీలు, రిజిస్ట్రార్లు, అధ్యాపకులు కాలేజీలకు అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్తగా బీఎస్సీ కంప్యూటర్స్‌ కోర్సును ప్రవేశపెడతామన్నారు. కంప్యూటర్‌ సబ్జెక్టుకు ఎక్కువ క్రెడిట్లు, మ్యాథ్స్‌ సబ్జెక్టుకు తక్కువ క్రెడిట్లు ఉంటాయని అన్నారు. డిగ్రీ విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు సైబర్‌ సెక్యూరిటీ కోర్సును ప్రవేశపెడుతున్నామని చెప్పారు. విద్యార్థులు కోవిడ్‌ సమస్యలను అధిగమించే విద్యాసంవత్సరంగా మారుస్తామని వివరించారు. జాతీయస్థాయిలో పీజీ ప్రవేశాలకు రాతపరీక్షలను దృష్టిలో ఉంచుకుని అకడమిక్‌ క్యాలెండర్‌ను రూపొందిస్తామని చెప్పారు. డిగ్రీ కాలేజీలకు న్యాక్‌ గుర్తింపును పొందడంపైనా దృష్టి కేంద్రీకరిస్తామని అన్నారు. న్యాక్‌ పొందే కాలేజీకి సీడ్‌ మనీ కింద రూ.లక్ష ప్రోత్సాహకంగా ఉన్నత విద్యామండలి ఇస్తుందన్నారు. సెమినార్లు నిర్వహించి న్యాక్‌ ప్రాధాన్యతను వివరిస్తామని చెప్పారు. త్వరలో వర్సిటీల వారీగా డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాళ్లతో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. వర్సిటీల వీసీలతో న్యాక్‌ డైరెక్టర్‌తో సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పారు. కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలు పెరిగేందుకు ఈ చర్యలు దోహదపడతాయని వివరించారు.