వరదల బిల్లుల చెల్లింపులో జాప్యం

– ఏడాది గడిచిపోయినా అందని డబ్బులు
– మండల బాధితులకు చెల్లించాల్సింది సుమారు రూ.20 లక్షలు
– ఉన్నతాధికారులు స్పందించాలంటున్న బాధితులు
నవతెలంగాణ-అశ్వాపురం
గోదావరి వరదల బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. గత ఏడాది 2022లో పెద్ద ఎత్తున గోదావరి వరదలు సంభవించి మండలంలోని గోదావరి పరివాహక ప్రాంతాలను ముంచేశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతోపాటు జిల్లా ఉన్నతాధికారులు ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి అక్కడి ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీంతో స్థానిక రెవెన్యూ అధికారులు ముంపు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించి మెరుగైన సేవలందించారు. ఈ తరుణంలో ఆర్థికంగా అధికారులు వారి పరపతిని ఉపయోగించి మండలంలోని వివిధ రకాల వ్యాపారుల వద్ద అప్పులు చేసి ముంపు బాధితులకు అన్నప్రాణయాలు సమకూర్చారు. అదేవిధంగా ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు మండలంలోని ముంపు ప్రాంతాలైన పాములపల్లి, కుమ్మరిగూడెం, అమ్మగారు పల్లి, అమేర్ధ, చింతిర్యాల, ఆనందపురం, నెల్లిపాక వంటి ప్రాంతాల్లో పడవ కార్మికులను నియమించి వారికి దినసరి వేతనంతో పాటు పడవలను కాంట్రాక్ట్‌ పద్ధతిలో నియమించుకొని వరదలు తగ్గేంతవరకు వారితో సహాయక చర్యలను చేపట్టించింది. కిరాణా, కూరగాయల షాపుల్లో పెద్ద ఎత్తున ఖాతాలు పెట్టి సరుకులను పునరావాస కేంద్రాలకు సమకూర్చారు స్థానిక రెవెన్యూ అధికారులు. అయితే వీరందరూ అధికారుల ముఖ పరిచయంతో పెద్ద ఎత్తున అప్పులు పెట్టి సకాలంలో బిల్లులు రాక తిప్పలు పడుతున్నారు.
బాధితులు ఏమంటున్నారంటే..
విపత్తుల సమయంలో యుద్ధ ప్రాతిపదికిన చేపట్టాల్సిన పనులకు ప్రభుత్వం నుండి ప్రత్యేక నిధులు వస్తాయని బాధితులు అంటున్నారు. అయితే అటువంటి అప్పుడు తాము పనులు చేసి నిత్యవసరాలు, కూరగాయలతో పాటు ఇతరత్రాలు అందజేసి ఏడాదిన్నర కాలం పాటు ఎందుకు ఎదురు చూడాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోపం ఎక్కడ జరిగిందని తమకు ఇవ్వాల్సిన కష్టార్జితాన్ని ఇవ్వకుండా అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని బాధితులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. వరదల సమయంలో తాము మానవతా దక్పథంతో ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో అధికారులు చెప్పిన దానికే తలొగ్గి పనులు చేయడంతో పాటు పెద్ద ఎత్తున ఆర్థిక వ్యాయానికోర్చి అప్పులు పెట్టామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై గురువారం మొండికుంట గ్రామానికి చెందిన బద్దం చంద్రకళ తాను చిరు కిరాణా వ్యాపారినని తనకు రెవెన్యూ వారు వరదల సమయంలో తన కొట్లో చేసిన అప్పు రూ.16800 ఇవ్వాలని ఆందోళన చేపట్టింది. సుమారు గంటపాటు కార్యాలయం ముందు బైఠాయించి కూర్చుంది. దీంతో రెవెన్యూ అధికారులు ఏం చేయాలో అర్థం కాక మొండికుంట సర్పంచ్‌ మర్రి మల్లారెడ్డిని సహాయం కోరడంతో ఆయన వచ్చి ఆ సొమ్ము తాను ఇస్తానని హామీ ఇవ్వడంతో సదరు మహిళ ఆందోళన విరమించింది. రెవెన్యూ అధికారులు బాధితులకు బిల్లులు చెల్లించకుండా ఇలా వ్యవహరిస్తే మునుముందు రోజుల్లో ఎదురయ్యే విపత్కర పరిస్థితులకు ఎలా సహకరిస్తారని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వరదల సమయంలో అధికారులకు ఆసరాగా నిలిచి అప్పులు పెట్టిన వారికి వెంటనే డబ్బులు చెల్లించాలని కోరుతున్నారు.