ఢిల్లీ డిక్లరేషన్‌ సిద్ధం

Delhi Declaration is ready– ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతు
–  దేశాధినేతలకు అందజేస్తాం : జీ20 భారత్‌ దూత అమితాబ్‌ కాంత్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ డిక్లరేషన్‌ సిద్ధంగా ఉందని, దేశాధినేతలకు డిక్లరేషన్‌ను అందిస్తామని జీ20 భారత్‌ దూత అమితాబ్‌ కాంత్‌ వెల్లడించారు. ఢిల్లీ డిక్లరేషన్‌ గ్లోబల్‌ సౌత్‌,అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతును ప్రపంచ దేశాల ముందుంచుతుందని పేర్కొన్నారు. డీ20 సదస్సుకు ఆతిధ్యం ఇచ్చేందుకు దేశ రాజధాని ఢిల్లీ సర్వం సిద్ధం అయిందన్నారు. ఝఈ20 అధ్యక్ష బాధ్యతను బాలిలో భారత్‌ చేపట్టినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వృద్ధి, ఉత్పాదకత మందగించిన పరిస్ధితి నెలకొందని గుర్తు చేశారు. ప్రపంచమంతా ఒకే కుటుంబం అని చాటే వసుధైక కుటుంబం అనే థీమ్‌తో మన అధ్యక్ష బాధ్యతలు ప్రారంభించాలని భారత్‌ భావిస్తోందని చెప్పారు. భారత్‌ జీ20 ప్రెసిడెన్సీలో నిలకడతో కూడిన సుస్థిర అభివృద్ధి, వాతావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు కార్యాచరణ ప్రణాళికలు ప్రాధాన్యతాంశాలుగా ఉంటాయని అమితాబ్‌ కాంత్‌ పేర్కొన్నారు. 169 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో కేవలం 12 మాత్రమే పూర్తయ్యాయని, షెడ్యూల్‌ కంటే చాలా వెనుకబడి ఉన్నాయని అన్నారు. చర్చల నుంచి మెరుగైన సారాంశాలు, ఫలితాలు రాబట్టడం, పోషకాహార ప్రాధాన్యత గుర్తెరగడం వంటివి జీ20 భారత ప్రెసిడెన్సీలో చేపట్టాల్సిన కార్యక్రమాలని అన్నారు. వాతావరణ మార్పులపై కార్యాచరణకు అనుగుణంగా హరితఅభివృద్ధి దిశగా ప్రపంచం పయనించాలని తాము కోరుకుంటున్నామని అన్నారు. ఈ అంశాలూ తమ ప్రాధాన్యతాంశాల్లో ఉంటాయని తెలిపారు.