టెన్త్‌ పుస్తకం నుంచి ప్రజాస్వామ్యం మాయం

– ఆవర్తన పట్టిక, ఇంధన వనరుల చాప్టర్లు కూడా…
న్యూఢిల్లీ : పాఠ్యపుస్తకాల నుండి తొలగింపుల ప్రక్రియను ఎన్సీఈఆర్టీ కొనసాగిస్తోంది. తాజాగా పదో తరగతి పుస్తకాల నుండి ప్రజాస్వామ్యం, ఆవర్తన పట్టిక, ఇంధన వనరులు అనే చాప్టర్లను తొలగించింది. విద్యార్థులపై భారం తగ్గించేందుకు ప్రారంభించిన హేతుబద్ధ చర్యలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామంటూ మరోసారి అరిగిపోయిన రికార్డును వినిపించింది. పదో తరగతి పాఠ్యపుస్తకాల నుంచి ఈ సంవత్సరం ప్రారంభంలోనే పరిణామ సిద్ధాంతాన్ని తొలగించిన విషయం తెలిసిందే. దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ 1800 మంది శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు బహిరంగ లేఖ రాశారు. ఎన్సీఈఆర్టీ తాజాగా విడుదల చేసిన పాఠ్యపుస్తకాల నుండి కూడా మరికొన్ని చాప్టర్లు అదృశ్యమయ్యాయి. ఇందులో ఆవర్తన పట్టిక కూడా ఉంది. పర్యావరణం, ఇంధన వనరులు వంటి చాప్టర్లు కూడా తొలగింపుల జాబితాలో ఉన్నాయి. తాజా రివిజన్‌ అనంతరం ప్రజాస్వామ్యం-రాజకీయ పార్టీలకు సవాళ్లు అనే చాప్టర్లను పూర్తిగా తొలగించారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులపై భారం తగ్గించడం అనివార్యమైందని ఎన్సీఈఆర్టీ వివరణ ఇచ్చింది. పైగా ఈ చాప్లర్లు కష్టంగా ఉన్నాయని, ప్రస్తుత పరిస్థితులలో వాటి అవసరం లేదని సాకులు చెప్పింది. అయితే 11, 12 తరగతులలో ఈ పాఠ్యాంశాలను అభ్యసిస్తామని విద్యార్థులు ఆప్షన్‌ ఇస్తే 10వ తరగతిలో వాటిని నేర్చుకోవచ్చునని తెలిపింది. పదో తరగతిలో గత సంవత్సరం సైన్స్‌ను తప్పనిసరి సబ్జెక్టుగా నిర్ణయించారు. యూనివర్సిటీ చదువుకు ముందు రెండు సంవత్సరాల పాటు రసాయన శాస్త్రాన్ని చదివేందుకు ఆప్షన్‌ ఇచ్చే విద్యార్థులు మాత్రం ఆవర్తన పట్టిక గురించి తెలుసుకుంటారు.