ప్రజాకళలకు ప్రాణం ప్రజాస్వామ్యం

Democracy is the lifeblood of public artళ స్వేచ్ఛను కోరుకుంటుంది. దుర్మార్గాన్ని, దౌర్జన్యాన్ని ధిక్కరిస్తుంది. కళ స్వభావమే అంత. అందుకే చీకటిలో పాటలు ఉంటాయా..? అంటే చీకటిని చీల్చేందుకే పాట పుట్టిందని జర్మన్‌ కవి బ్రెక్ట్‌ జవాబిస్తాడు. జానపద కళలు అనాదిగా ఈ స్వభావం నుండే జనపదాల నుండి జనం మధ్యన అసంఖ్యాకంగా పుట్టుకొచ్చాయి. పుట్టుకొస్తాయి కూడా ఇక ముందు.
మార్క్సిజం-లెనినిజం సైద్ధాంతిక భూమికపై చారిత్రక భౌతికవాదం ఆవిష్కృతమైనాక, కళ పుట్టుక-పరిణామం కూడా ఓ శాస్త్రీయ సిద్ధాంతంగా అవగతమైంది. ఇప్పుడు ఈ అవగాహన జగిద్విదితం. అనుసరణీయం. ‘కళ పూర్వజన్మ సుకృతం, కళ దైవదత్తం’ అనే అశాస్త్రీయ భావాలకు కాలం చెల్లింది. వర్గ దోపిడీ సమాజంలో కళ కూడా అనివార్యంగా రెండుగా చీలిపోతుంది. దోపిడీ వ్యవస్థను బలపరిచేది ఒకటైతే, ప్రజా విముక్తికై పాటుపడేది మరొకటి.
ఒకనాటి ఫ్యూడల్‌ వ్యవస్థలో ప్రభువుల ఆస్థాన అంత:పురాలకు, ఉన్నత వర్గాల రాచకేళీ విలాసాలకు ఓ కళ పరిమితమైతే, జనావాసాలకు, జానపథాలకు జానపద కళ రంగభూమైంది.
ఇరవయ్యవ శతాబ్దం సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ వ్యవస్థల దశలో ప్రపంచం రెండు ప్రపంచ యుద్ధాలను చవిచూసింది. 1914-19 మొదటి ప్రపంచయుద్ధం. 1939-44 రెండవ ప్రపంచ యుద్ధం. ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో కోట్లాది మంది ప్రజానీకం బలైపోయారు. నాజీ నరహంతక హిట్లర్‌ ఫాసిస్ట్‌ యుద్ధోన్మాద దాడికి ఒక సోవియట్‌ దేశంలోనే రెండు కోట్ల మందికి పైగా ప్రజలు హతులయ్యారు.
1945 ఆగస్టు 6, 9 తేదీలలో అమెరికన్‌ సామ్రాజ్యవాదం అమానుషంగా వేసిన అణుబాంబులకు జపాన్‌ నగరాలు హిరోషిమా, నాగసాకి ప్రజలు లక్షలాది మంది నేలకొరిగారు. ఆ విష పదార్థాల ప్రభావానికి ఇప్పటికీ ఆ ప్రజలు బాధలు అనుభవిస్తూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలో విశ్వశాంతి కాంక్ష ఎల్లెడలా పరుచుకున్నది. తిండి, బట్ట, వసతి వంటి కనీస అవసరాలతో పాటు శాంతి-సామరస్యం కూడా ఓ ప్రాథమిక అవసరంగా తోసుకు వచ్చింది. దేశాధినేతలు ఎవరైనా సరే శాంతి కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలనే డిమాండ్‌ ప్రజా హృదయాల్లో పెల్లుబికింది. ఈ క్రమంలోనే మానవుడే నా సందేశం అని, శాంతి-సమభావం-సమిష్టి క్షేమం ఆధునిక యుగ ధర్మాలని మహాకవి శ్రీశ్రీ వంటివారు ఉద్ఘాటించారు.
భౌతికంగా మనిషి సుఖదు:ఖాలకు, కష్టనష్టాలకు మనిషే కారకుడు తప్ప దేవుడు కాదని మార్క్సిజం తేల్చి చెప్పింది. దేవుని పేరిట (ఇన్‌ ది నేమ్‌ ఆఫ్‌ గాడ్‌) చరిత్రలో జరిగిన, జరుగుతున్న ఘోర కృత్యాలకు, ఊచకోతలకు ఉన్మాదపూరితుడైన మృగం లాంటి మనిషేనని విశదపరిచింది. ఈ సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ వ్యవస్థలో లాభాల దోపిడీ మార్కెట్ల కోసమే యుద్ధాలు జరుగుతాయని వివరించింది. అయితే ఈ దుర్మార్గాలను ఎప్పటికైనా ప్రజలు సంఘటితంగా సమరశీల పోరాటాలతో తిప్పికొడతారని తెలిపింది. అదో చారిత్రక విశ్వాసంగా దార్శనికతతో ప్రకటిస్తూ ‘ప్రజలే చరిత్ర నిర్మాతలు’ అన్న సత్యాన్ని చాటి చెబుతుంది.
ఈ సైద్ధాంతిక భూమికను అందిపుచ్చుకున్న ఎందరో ప్రజా కళాకారులు అద్భుతమైన సాహితీ కళాకృతులను సృష్టించారు. ఆ విప్లవ భావ చైతన్యాన్ని రంగరించి తమ కృతుల్లో నింపడమే గాక, ప్రజల్ని అలా వర్గభావ చైతన్యులను గావించేందుకు అహరహం శ్రమించారు. ప్రాణాలను, జీవితాలను ధారపోశారు.
ఈ మార్గంలో ఎన్నో జానపద కళలు ప్రజా కళలుగా రూపాంతరం చెందాయి. ఎందరో ప్రజా కళాకారులు తమ జీవితాలను కళలకే అంకితం చేశారు. అలాంటి వారిలో డాక్టర్‌ గరికపాటి రాజారావు తెలుగునాట ముందు పీఠిన నిలుస్తారు.
ప్రజా కళాతపస్విగా, ప్రజా రంగస్థల ప్రయోక్తగా డాక్టర్‌ రాజారావు గణతికెక్కడం, ఈ మార్గాన పయనించడం వల్లనే సాధ్యమైందని రాజారావు సహచరులు కాకరాల వక్కాణిస్తారు.
కళారూపం ఏదైనా, రచయిత ఎవరైనా ప్రదర్శనకు ప్రాణం ప్రయోక్త. ప్రాణం ఎక్కడ ఉంటుంది? అణువణువున ఉంటుంది. దాని ఉనికికి గుర్తు ఊపిరి. అది స్పర్శతో అనుభూతమవుతుంది. కానీ కంటికి కనిపించదు. ప్రదర్శనకు ప్రాణమైన ప్రయోక్త కూడా అంతే. ఆ చారిత్రక నేపథ్యంలో జన్మించిన రాజారావు ఆ విధంగా ప్రజా కళారంగంలో ఎనలేని కృషి చేశారు. ఎన్నెన్నో ప్రయోగాలకు ఒరవడి దిద్దారు.
హిట్లర్‌ బాగోతంలో ఎర్ర సైనికునిగా, మా భూమి, సీతారామరాజు వంటి సాంఘిక చారిత్రక నాటకాల దిగ్దర్శకునిగా, ‘పుట్టిల్లు’ సినిమాకు చిత్ర దర్శకునిగా డాక్టర్‌ రాజారావు కృషి అనుపమానం.
ప్రతి ప్రజా కళాకారునికి నాలుగు లక్షణాలు మెండుగా ఉండాలి. 1. వేదన. వర్గ సమాజంలో బాధితుల వేదనతో కళాకారుడు మమేకం కావాలి. సహానుభూతి (ఎంపథీ) చెందాలి. 2. శోధన. బాధితుల సమస్య పరిష్కారానికై ఓ కళాకారునిగా తాను ఏం చేయగలనో శోధించుకుని ఆ దిశగా అడుగేయాలి. రాసేవారు రాయాలి. పాడేవారు పాడాలి, ఆడేవారు ఆడాలి. ఆ రాత, ఆట, పాట, మాట నవ్యంగా, నాణ్యంగా ఉండాలి. అందుకు సాధన అవసరం. 3. సాధన. ఆ నిత్య సాధనలోనే కళా నైపుణ్యం పెరుగుతుంది. ఆ రూపానికి ఆకర్షణా శక్తి అబ్బుతుంది. ప్రజల కోసం కఠోర దీక్షతో ఈ సాధన చేయాల్సిందే, మినహాయింపు లేదు. 4. ప్రదర్శన. సాధన తర్వాత మాత్రమే ప్రజల్లో ప్రదర్శనకు వెళ్ళాలి. అలా చిత్తశుద్ధితో ప్రదర్శనలకు వెళ్ళినప్పుడు ప్రజలు ఆ కళారూపాలకు బ్రహ్మరథం పడతారు. ఆ కళారూపం ప్రజలను కదిలించే ఓ చైతన్య స్వరూపంగా మారుతుంది. ప్రజా కళాకారులకు ఇది అనుభవ సత్యమే.
డాక్టర్‌ రాజారావు ఈ నాలుగు లక్షణాలను పుణికిపుచ్చుకుని ఆదర్శప్రాయంగా నిలిచాడు. ప్రదర్శన నిర్మాణ బాధ్యతంతా ప్రయోక్తది. తెర ముందు కంటే తెర వెనుక కృషి అధికం. కార్యక్రమ లేదా కర్తవ్య పథ నిర్దేశకుడు అతనే. ఆఖరికి నిరాకార నిరంజనుడుగా మిగిలిపోక తప్పదు. ఆ విధంగా కనిపించని కళా ప్రవక్త ఈ ప్రయోక్త.
డాక్టర్‌ రాజారావు ఈ కారణాన కేవలం ఓ కళాకారుడిగా మాత్రమేగాక ఓ సాంస్కృతిక కార్యకర్తగా (కల్చరల్‌ ఆర్గనైజర్‌గా) ప్రజా కళకు బాటలు వేశాడు.
1943లో బొంబాయిలో భారత కమ్యూనిస్టు పార్టీ మహాసభలు జరుగుతున్న తరుణంలోనే ఆలిండియా పీపుల్స్‌ థియేటర్‌ అసోసియేషన్‌-ఇప్టా ప్రథమ మహాసభలు జరిగాయి. ఆ మహాసభలు ద్విముఖ లక్ష్యాన్ని ప్రకటించాయి. 1. ఫాసిస్టు ప్రమాదాన్ని ప్రతిఘటించడం 2. అంతర్జాతీయ శ్రామిక వర్గ దృక్పధాన్ని కలిగి ఉండటం.
ఇప్టా కేంద్ర కమిటీకి ఆంధ్ర ప్రాంతం నుండి కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైన రాజారావు ఆ లక్ష్య సాధనకు అహర్నిశలూ శ్రమించాడు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. 1963 సెప్టెంబర్‌ 8న అస్వస్థతతో అస్తమించాడు.
రాజారావు ఓ ఉద్యమం నుండి పుట్టాడు. అందులో నాటకరంగం ఒకటి. రాజారావు ప్రజానటుడు. ప్రజా నాటకాలు నాటకరంగంలో తెచ్చిన పరిణామం విప్లవ పరిణామం అనడానికి ఎలాంటి సందేహం లేదు.
‘ప్రసిద్ధ నాటకాలు అన్నీ ప్రజా నాటకాలు కావు. గొప్ప నటులని చెప్పుకునే మహానటులందరూ ప్రజా నటులు కారు. ప్రజా నాటకాలు ఎలా ప్రదర్శించినా జనం చూసి ఉండేవారే కానీ, వాటిలో నాటక శిల్పం, నటనా శిల్పం ఉన్నతంగా ఉంచడానికి రాజారావు చేసిన కృషి, పడిన శ్రమ మరువరానిది. అతను నాటక కళకి ఉద్యమానికి సమన్వయం సాధించడానికి తన బుద్ధిని నిర్దాక్షిణ్యంగా ధారపోశాడు’ అని కొడవటిగంటి కుటుంబరావు కొనియాడుతూ నివాళులర్పించారు.
ప్రస్తుతం మన దేశంలో అటు ఫాసిస్టు శక్తులు, ఇటు కార్పొరేట్‌ శక్తులు జమిలిగా దాడి చేస్తూ కష్టజీవుల హక్కులను, జీవితాలను కాలరాస్తుంటే, రాజ్యాంగ స్ఫూర్తిని ధ్వంసం చేస్తూ నియంతృత్వం వైపు అడుగిడుతుంటే ప్రజా కళాకారులు డాక్టర్‌ రాజారావు మార్గంలో పని చేయడమే ఏకైక శిరోధార్యం.
(సెప్టెంబరు 8 గరికపాటి రాజారావు 60వ వర్థంతి)

  • కె. శాంతారావు
    9959745723