బొగ్గులకుంటలో అక్రమ నిర్మాణాల కూల్చివేత..

నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతామని జీహెచ్ఎంసీ గోషామహల్ సర్కిల్ పట్టణ ప్రణాళిక అధికారి సయ్యద్ సయీదుద్దీన్ హెచ్చరించారు. అబిడ్స్ బొగ్గులకుంట రోడ్డులో అక్రమ కట్టడాలను సెక్షన్ అధికారి ముఖేశ్ సింగ్ ఆధ్వర్యంలో పోలీసుల సహకారంతో  కూల్చివేశారు. కొందరు అడ్డుకునేందుకు యత్నించగా సీఐ నరసింహ రాజు, డీఐ నరసింహ, సిబ్బంది జోక్యం చేసుకున్నారు. ఈ సందర్భంగా సయ్యద్ సయీదుద్దీన్, ముఖేశ్ సింగ్ లు మాట్లాడుతూ.. గోషామహల్ సర్కిల్ పరిధిలో తొలి విడతగా రహదారులు, పాదాచారులను నడిచే ఆక్రమణల తొలగింపునకు శ్రీకారం చుట్టామన్నారు. బొగ్గులకుంట రహదారిపై తాగునీరు పంపిణీ కేంద్రం పేరుతో తొలుత తాత్కాలిక షెడ్డు నిర్మించారని, ఆ తర్వాత శాశ్వత దుకాణంగా మార్చి కార్యకలాపాలు చేస్తున్నారన్నారు. దీంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందుల దృష్ట్యా దాన్ని కూల్చివేశామన్నారు. సర్కిల్ పరిధిలో ప్రభుత్వం సంబంధించిన వాటిని ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.