– అర్హులైన వాళ్లకు రెగ్యులరైజ్ చేయాలి
– ఐలాపురం భూముల వివాదంపై సమగ్ర విచారణ జరపాలి
– కూల్చిన ఇండ్ల్లను పరిశీలించిన సీపీఐ(ఎం) బృందం
– బాధితులకు అండగా ఉంటామని భరోసా
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలంలోని ఐలాపురం, ఐలాపురం తండా గ్రామాల పరిధిలో పేదలు కట్టుకున్న ఇండ్లను కూల్చివేయడం అన్యాయమని సీపీఐ(ఎం) నేతలు అన్నారు. బుధవారం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అతిమేల మాణిక్, నాయిని నర్సింహరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు నాగేశ్వరావు ప్రతినిధి బృందం కూల్చిన ఇండ్లను పరిశీలించి, నష్టపోయిన బాధితులతో మాట్లాడారు. 119 సర్వేనెంబర్‌లో ఉన్న భూముల పూర్వాపరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జయరాజు మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాల నుంచి జీవనోపాధి కోసం వలస వచ్చిన పేదలు తక్కువ ధరకు లభిస్తుందని ప్లాట్లు కొనుగోలు చేసి ఇండ్లు కట్టుకున్నారని తెలిపారు. ప్రభుత్వపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్థానిక నాయకులు చెప్పడంతో పేదలు ఇండ్లు కట్టుకొని ఉంటున్న సమయంలో అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి ఇండ్లను కూల్చివేయడం అన్యాయమన్నారు. ఇంట్లో ఉంటున్న వాళ్లను బయటికి ఈడ్చుకొచ్చి పడేసి జేసీబీ, ఇటాచీలతో ఇండ్లను పూర్తిగా ధ్వంసం చేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐలాపుం, ఐలాపురం తండాలో ఎన్నో ఏండ్లుగా ప్లాట్ల విక్రయాలు జరుగుతున్నాయని, కాయకష్టం చేసి పోగేసుకున్న సొమ్ముతో ప్లాట్లు కొనుకున్న పేదలు ఇండ్లు నిర్మించుకున్నారన్నారు. ప్లాట్ల కొనుగోళ్లు, ఇండ్ల నిర్మాణాలు జరుగుతుంటే ప్రభుత్వం గానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. ఇండ్లు కట్టుకున్న ప్రాంతంలో రోడ్లు వేసి, ఇండ్లకు ఇంటి నెంబర్లు ఇచ్చి పన్నులు వసూలు చేశారని తెలిపారు. విద్యుత్ శాఖ నుంచి ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంబాలేసి కరెంట్ మీటర్లు పెట్టింది అధికారులు కాదా అని ప్రశ్నించారు. ఐలాపురం భూముల క్రయవిక్రయాల్లో వేల కోట్ల కుంభకోణం దాగి ఉందని,. ఇట్టి భూముల వివాదంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల్లో ఇండ్లు కట్టుకున్న వాళ్లకు రెగ్యులరైజ్ చేస్తున్న ప్రభుత్వం.. ఐలాపురం పేదలకు కూడా వాళ్లు కొనుగోలు చేసిన ప్లాట్లను రెగ్యులరైజ్ చేయాలని కోరారు.
ఇండ్లు కూల్చినందుకు నష్ట పోయిన బాధితులకు ప్రభుత్వమే తిరిగి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, మధ్యవర్తుల మోసపు మాటలు నమ్మి ప్లాట్లు కొనుగోలు చేసి ఇండ్లు కట్టుకున్న పేదలకు ప్రభుత్వం న్యాయం చేయాలని, మోసం చేసిన వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పేదలను సమీ కరించి సీపీఐ(ఎం) పోరాడుతుందని స్పష్టంచేశారు.