గణపురంలో విజృంభిస్తున్న డెంగ్యూ

– మూడ్రోజుల్లో 16 కేసులు నమోదు
– ప్రభుత్వ ఆస్పత్రిలో టెస్టులు కరువు..ఆర్‌ఎంపీ వైద్యులే దిక్కు
నవతెలంగాణ-గణపురం
జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో డెంగ్యూ కేసులు భారీగా నమోదవుతున్నాయి. మూడ్రోజుల్లో ఒకే వీధిలో 16 కేసులు నమోదు కావడంతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో టెస్టులు కరువవ్వడంతో ప్రయివేట్‌ ల్యాబ్‌ సెంటర్‌లో పరీక్షలు చేయించుకుంటున్నారు. నాగవీధి సమీపంలోని పైడ్‌బాన్‌ కాలనీలో విష జ్వరాలు తీవ్రంగా ప్రబలుతున్నాయి. జ్వరాలతో ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే పరీక్షలు చేయకుండానే గోలీలు ఇచ్చిపంపిస్తుండటంతో ప్రజలు ఆర్‌ఎంపీ వైద్యులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రయివేట్‌ ల్యాబ్‌ టెస్టులో డెంగ్యూ పరీక్షలు చేయగా మూడ్రోజుల్లో 16 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. వారంతా వరంగల్‌ ప్రయివేట్‌ ఆస్పత్రికి వెళ్లి అడ్మిట్‌ అవుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్లేట్‌లెట్‌ మిషన్‌ ఉన్నప్పటికీ పరీక్షలు సక్రమంగా చేయకపోవడం, ములుగు ఆస్పత్రికి పంపించడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ ఆస్పత్రిలో సీనియర్‌ వైద్యులను నియమించి 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.