ముంబయి : కార్వీ గ్రూపునకు చెందిన మర్చంట్ బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించే కార్వీ ఇన్వెస్టర్ సర్వీసెస్ లిమిటెడ్ (కెఐఎస్‌ఎల్) గుర్తింపును సెబీ రద్దు చేసింది. గతేడాది మార్చిలో సెబీ ఈ సంస్థలో తనిఖీలు నిర్వహించింది. కాగా.. ఆ సంస్థలో ఎటువంటి కార్యకలాపాలు కొనసాగడం లేదని గుర్తించింది. వ్యాపార బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించడానికి అవసరమైన సాధనా సంపత్తి లేదని నిర్థారించింది. అదే విధంగా సంస్థ డైరెక్టర్ ఒకరు సెక్యూరిటీస్ మార్కెట్ వివాదంలో చిక్కుకున్నారు. దీంతో పాటు మర్చంట్ బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించడానికి అవసరమైన ఇతర నియమ నిబంధనలు సైతం పాటించడం లేదని, పైగా రిజిస్ట్రేషన్‌ను రెన్యువల్ చేయడానికి ఫీజు చెల్లించలేదని సెబీ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే సంస్థ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది.