మెడిసిటీ మెడికల్‌ కాలేజీ గుర్తింపు రద్దు

– ఎన్‌ఎంసీ నిర్ణయాన్ని స్వాగతించిన ఎస్‌ఎఫ్‌ఐ
– మౌలిక సదుపాయాల్లేని కాలేజీలపై విచారణ జరపాలి : ఎస్‌ఎఫ్‌ఐ
నవతెలంగాణ-సిటీబ్యూరో / మేడ్చల్‌
మెడిసిటీ(మెడిసిటీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) మెడికల్‌ కాలేజీ గుర్తింపును నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌(ఎన్‌ఎంసీ) రద్దు చేసింది. మేడ్చల్‌ మండల పరిధిలోని ఘనపూర్‌ గ్రామంలోని మెడిసిటీ మెడికల్‌ కళాశాలలో కనీస మౌలిక సదుపాయాలు లేవని కళాశాల గుర్తిపును రద్దు చేయడం మంచి విషయమని అన్నారు. ఈ కళాశాలలో కనీస మౌలిక సదుపాయాలు లేవని ఎన్‌ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్‌ఎంసీ తీసుకున్న నిర్ణయాన్ని ఎస్‌ఎఫ్‌ఐ స్వాగతించింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. నిబంధనల మేరకు అధ్యాపకులు, కనీస మౌలిక సదుపాయాలు లేకుం డా రాష్ట్రంలో వందలాది మెడికల్‌ కాలేజీలు ఉన్నాయని, వాటిపైన విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఎన్‌ఎంసీని ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాథోడ్‌ సంతోష్‌ డిమాండ్‌ చేశారు. అదేవిధంగా మెడికల్‌ కాలేజీల యజమాన్యాలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని, పేద బడుగు, బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులు మెడికల్‌ విద్య అందుకోవాలంటే లక్షల్లో చెల్లించాల్సి పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఫీజుల విషయంలోనూ నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కనీస మౌలిక సదుపాయాల లేని మెడికల్‌ కాలేజీలపై చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో పెద్దఎత్తున పోరాటాలు చేస్తామని ఎస్‌ఎఫ్‌ఐ తరపున ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.