– త్రిపురలో పరాకాష్టకు చేరిన దాడులు
– సంఘటిత ఉద్యమాలతో ప్రతిఘటిద్దాం : వ్యకాస ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ పిలుపు
అగర్తల: అభివృద్ధి మార్గంలో ఉన్న త్రిపురలో జాతి, మతం పేరుతో పేరుతో బీజేపీ విధ్వంసం సృష్టిస్తున్నదని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్ విమర్శించారు. గత రెండు రోజులుగా త్రిపుర గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తున్నా ఆయన శుక్రవారం నాడిక్కడ మీడియాతో మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జరుగుతున్న దురాగతాలను వెల్లడించారు. నాటి వామపక్ష పాలనలో అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాన్ని ఇప్పుడు ఆకలి చావులు, ఆత్మహత్యలు, అరాచకాలతో కల్లోల రాష్ట్రంగా అధికార బీజేపీ మార్చిందని విమర్శించారు. ఆదివాసీల హక్కులను పరిరక్షించడంలో అగ్రభాగాన ఉండటంతో పాటు గిరిజనేతర ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలోనూ నాటి ప్రభుత్వం ప్రగతి శీలంగా వ్యవహరించిందని తెలిపారు. ఉపాధి హామీని గత వామపక్ష ప్రభుత్వం సగటున ఏడాదికి 98 పనిదినాలు కల్పించి, దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని గుర్తుచేశారు. నేడు 10, 15 రోజులకు మించి ఉపాధి కల్పించడం లేదనీ, చేసిన పనికి వేతనాలు అందించడం లేదన్నారు. కువాయి, అగర్తలా తూర్పు, పశ్చిమ, ఉత్తర జిల్లాలలోని గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనిని పరిశీలిస్తే ఆ చట్టం స్ఫూర్తికే విరుద్ధంగా ఉందని చెప్పారు. దీనితో ఆ ప్రాంతంలో గ్రామీణ పేదల ఆకలి చావులు ప్రారంభమయ్యాయనీ, ప్రత్యేకించి గిరిజనులు నివసించే ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువైందని అన్నారు. అటవీ హక్కుల చట్టాన్ని అమలు జరిపి, నాలుగు లక్షల మందికి పట్టాలు ఇచ్చిన ఘనత నాటి మాణిక్ సర్కార్ ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు. నేడు అటవీ భూహక్కుల పత్రాలు నిలిపివేశారని ఫారెస్ట్ కన్జర్వేటివ్ యాక్ట్ సవరించి గిరిజన భూములను సంపన్నులకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు. వామపక్ష ప్రభుత్వం గిరిజన ప్రాంతాలకు అటానమస్ కౌన్సిల్ ఇచ్చిందనీ, జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించారని తెలిపారు. నేడు దాన్ని బిజెపి బలహీన పరిచిందన్నారు. వీటి పట్ల ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు అరాచకాలకు, హత్యలకు బీజేపీ పాల్పడుతున్నదని, వామపక్షాలు, వ్యవసాయ కార్మిక సంఘాల నేతల పై భౌతిక దాడులు, వారి ఆస్తులు ధ్వంసం, ఇల్లును కూలగొట్టడం లాంటి దుర్మార్గ చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇటువంటి అకత్యాలను అడ్డుకునేందుకు రాష్ట్రంలో 1200 పంచాయతీలలో పర్యటించి సభలు జరపాలని, బాధ్యత కుటుంబాలను పరామర్శించాలని వ్యవసాయ కార్మిక సంఘం నిర్ణయించినట్లు తెలిపారు. ఈ అరాచకాలను ప్రతిఘటించేందుకు సెప్టెంబర్ 27న మార్చ్ టు అగర్తల సెక్రటేరియట్ పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఈ పర్యటనలో వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ నాయకులు, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అధ్యక్షులు తుషార్ ఘోష్, త్రిపుర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యామలదేవ్, రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు.