నిలదీత

అడుగు ముందుకేయడం
విజయం, కానీ
అన్ని అడుగులై ఆకాశానికి ఎదగడం
ఎవరితరం!

నీ చూపుడు వేలు
ఇంకా మావైపుకే చూపిస్తోంది
నడకలో, నడతలో
ఏదో అపసవ్యం
పసికడుతోంది.

వంకర టింకర రీతులు
ఉచ్ఛనీచా చూపులు
వివక్షలూ విద్వేషాలూ
కల్మషాల కాలువలూ
కంపును తెగ
నింపుతూనేవున్నాయి.

ఎంత మురికిని ఎత్తిపోసినా
మనసుముంత శుభ్రమవుతలే
అందుకేనేమో నువ్వు మా
నగరం నడిబొడ్డులోకొచ్చి మరీ
నిలబడి నిలదీస్తున్నావ్‌

తలలెత్తలేని మా అశక్తకు
శక్తిని నింపే నీ ప్రయత్నం
ప్రతిమలా ప్రత్యక్షమైంది.

ఇప్పుడు నిన్ను చూస్తే చాలు
మా గుండెతో పాటు
తలల్నీ ఎత్తి నడుస్తాము.

– ఆనంద