– నేటికీ అందని నోట్ పుస్తకాలు
– అ ‘డ్రెస్’ లేని యూనిఫామ్
– దుప్పట్లు లేక అవస్థలు
– పాఠశాలలు తెరిచి నేల గడిచినా పట్టించుకోని ప్రభుత్వం
– విద్యకు దూరంగా పేద విద్యార్థులు
– అటకెక్కిన చదువుకు తార్కానమిది
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు పాలకుల నిర్లక్ష్యంతో సంక్షామ గృహాలుగా మారుతున్నాయి. పర్యవేక్షణ లేక…మోను అమలుకాక…సౌకర్యాలకు నోచుకోక విద్యార్థులంతా అల్లాడిపోతున్నారు. పాఠశాలలు తెరిచి నెలనర గడిచిన విద్యార్థులకు నేటికీ అందించాల్సిన నోట్ పుస్తకాలు, యూనిఫామ్ లు, అందివ్వలేదు. దుప్పట్లు కూడా పంపిణీ చేయకపోవడంతో చిన్నారులంతా చలికి వణికి పోతున్నారు. దాదాపు ఏ వసతి గృహంలోనూ మెనూ అమలు చేయకపోవడంతో చప్పిడి మెతుకులతోనే కాలం వెళ్లదీస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెలరోజులు దాటినా ఇప్పటిదాకా యూనీఫాం…నోట్ అందకపోవడంతో చదువులు ముందుకు సాగడం లేదు.
నల్లగొండ జిల్లాలో సంక్షేమ శాఖ హాస్టల్లు…
నల్లగొండ జిల్లాలో 60 ఎస్సీ సంక్షేమ శాఖ హాస్టల్ లు ఉండగా అందులో 45 ఫ్రీ మెట్రిక్, 15 పోస్ట్ మెట్రిక్ హాస్టల్లు ఉన్నాయి. వీటిలో సుమారు 4700 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. అందులో 3200 మంది ఫ్రీ మెట్రిక్ విద్యార్థులకు నోటి పుస్తకాలు, నాలుగు జతల యూనిఫాం, దుప్పట్లు పంపిణీ చేయాల్సి ఉంది. అదేవిధంగా ఎస్టీ సంక్షేమ శాఖకు సంబంధించి 18 ఫ్రీ మెట్రిక్, 11 పోస్టుమట్రిక్, 13 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో పోస్ట్మెట్రిక్ మినహాయించి సుమారు 5000 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. వీరందరికీ నోట్ పుస్తకాలు, రెండు జతల యూనిఫాం, దుప్పట్లు ఇవ్వాల్సి ఉంది. అదేవిధంగా బీసీ హాస్టల్ కు సంబంధించి నల్లగొండ జిల్లాలో 25 ఫ్రీ మెట్రిక్, 21 పోస్టు మెట్రిక్ హాస్టల్లు ఉన్నాయి. వీటిలో సుమారుగా ఫ్రీ మెట్రిక్ విద్యార్థులు 2200 మంది ఉన్నారు. ఈ విద్యార్థులకు కూడా నోటు పుస్తకాలు, యూనిఫామ్, దుప్పట్లను పంపిణీ చేయాల్సి ఉంది.
పుస్తకం అందితే ఒట్టు..
పాఠశాలకు వెళ్లేరోజునే వసతి గృహంలోని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉన్నా… జిల్లాలో ఏ వసతి గృహం విద్యార్థికీ ఇంతవరకు ఒక్కటంటే ఒక్క పుస్తకమూ అందలేదు. పుస్తకాలు లేక ఖాళీ బ్యాగులతో విద్యార్థులు పాఠశాలలకు వెళ్తున్నారు. ఉపాధ్యాయులు చెబుతున్న పాఠాలు నోట్ పుస్తకాలలో రాసుకోవాలంటే దిక్కులు చూస్తున్నారు.
గుడ్డ ముక్క ఇవ్వలేదు..
ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలో ‘ఒక్క విద్యార్థికీ ఒక్క గుడ్డ ముక్క కూడా ఇవ్వలేదు. దీంతో చేసేదేమీ లేక విద్యార్థులు గతేడాది ఇచ్చిన యూనిఫాంతోనే పాఠశాలలకు వెళుతున్నారు. బడి ఈడు పిల్లలు అంటే ఏడాది కాలంలో వారి శారీరక పెరుగుదల నమోదవుతూ ఉంటుంది. గత ఏడాది, ఇప్పటికి విద్యార్థుల ఎత్తు, బరువులో వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ మేరకు వారు కొత్త యూనిఫాం కుట్టించుకుని పాఠశాలలకు రావాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులంతా చాలీచాలనీ యూనిఫాంతో బడులకు హాజరవుతున్నారు. గత నెల 13న పాఠ శాలలు పునః ప్రారంభమయ్యాయి. అప్పటినుంచి విద్యార్థులు యూనిఫాం కోసం ఎదురు చూస్తున్నారు.
దుప్పట్లు లేక ఇక్కట్లు..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, హాస్టల్లో చదివే విద్యార్థులకు నేటీ వరకు దుప్పట్లను పంపిణీ చేయలేదు. ఇంటి వద్ద నుండి తెచ్చుకున్న దుప్పటిని ఇద్దరు, ముగ్గురు విద్యార్థులు కప్పుకుంటున్నారు.దుప్పట్లు పంపిణీ చేయకపోవడంతో రాత్రి వేళలో విద్యార్థుల దోమలు మోతతో…వర్షంతో చలికి వణుకుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దోమల మోత..
జిల్లాలోని దాదాపు అన్ని వసతి గృహాల్లో దోమల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం మారిన సీజన్లో దోమల బెడద రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. దోమతెరలు కొనుగోలు చేసేందుకు అనుమతులు లేవని చెబుతున్న అధికారులు కనీసం కిటికీలు, డోర్లకు నెట్ (వల) కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో దోమల మోత అధికం కావడంతో విద్యార్థులకు కంటిమీద కనుకు కరువైంది. కొంతమంది అనారోగ్యానికి కూడా గురవుతున్నారు.
కన్నెత్తి చూడని వైద్యులు..
నిబంధనల మేరకు ప్రతినెలా ప్రభుత్వ వైద్యులు సమీప వసతి గృహాలకు వెళ్లి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేయాలి. కానీ చాలా హాస్టల్లో విద్యార్థులకు వైద్యులు వస్తారనే సమాచారం కూడా తెలియదు. ముఖ్యంగా ఈ సీజన్లో ఎక్కువగా విద్యార్థులు వ్యాధుల బారిన పడే ప్రమాదముంటుంది. జిల్లాకేంద్రంలో ఉన్న హాస్టళ్ల వైపే వైద్యులు కన్నెత్తి చూడడం లేదంటే… ఇక మారుమాల గ్రామాల్లో ఉన్న హాస్టల్లకు ఏమాత్రం వెళుతుంటారో అర్థం చేసుకోవచ్చు.
నేడు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయాల ముట్టడి..
జిల్లాలోని అన్ని సంక్షేమ హాస్టల్ విద్యార్థుల కు నోట్ బుక్స్, యూనిఫాం, దుప్పట్లు, ఇవ్వాలని జిల్లా వ్యాప్తంగా ఆర్డీవో కార్యాలయం ముట్టడి చేస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కంభంపాటి శంకర్ తెలిపారు. వసతి గృహ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమురయ్య భవనంలో సమావేశాన్ని నిర్వహించి కార్యాచరణను ప్రకటించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్ ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, సంక్షేమ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న విద్యార్థులకు నేటికీ నోటి పుస్తకాలు యూనిఫామ్ దుప్పట్లు పంపిణీ చేయలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహ విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని మండిపడ్డారు.నల్లగొండ జిల్లాలో అన్ని సంక్షేమ హాస్టల్లో సుమారు 12000 మంది విద్యార్థులు విద్యనభసిస్తున్నారని ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వారంతా ఇబ్బందుల పాలవుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అన్ని సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు నోటు పుస్తకాలు, యూనిఫాం, దుప్పట్లు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టల్ విద్యార్థులను పట్టించుకోకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వాన్ని పడుతుందని హెచ్చరించారు. సోమవారం వరకు హాస్టల్ విద్యార్థులకు అందించకుంటే జిల్లా వ్యాప్తంగా ఎమ్మార్వో, ఆర్డీవో కార్యాలయాల ముందు నిరాహార దీక్షలకు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కో కన్వీనర్ కుంచం కావ్య, ముస్కు రవిందర్, చందు పావని, మౌనిక,అజయ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.