నీటితోనే తెలంగాణ అభివృద్ధి

– ఐటీ, ఇతర పరిశ్రమలు అందుకే వస్తున్నాయి : రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మెన్‌ వి. ప్రకాష్‌
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
విస్తారంగా అందుబాటులోకి వచ్చిన జల వనరులతోనే రాష్ట్రానికి ఐటీతోపాటు ఇతర పరిశ్రమలు తరలివస్తున్నాయని తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మెన్‌ వి. ప్రకాష్‌ అన్నారు. నీటితోనే ఆర్థిక ప్రగతితోపాటు వ్యవసా యాభివృద్ధి కనిపిస్తున్నదని చెప్పారు.మంగళవారం హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో ఆర్థిక కమిటీ ఆధ్వర్యంలో ‘జలసంరక్షణ-పౌర సంఘాల పాత్ర’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. దీనికి ఆ కమిటీ అధ్యక్షులు డాక్టర్‌ గంగాధర్‌ రావు అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా ప్రకాష్‌ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో నీటికి, విద్యుత్‌కు ఎప్పడూ కొరత ఉండేదన్నారు. కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల మూలంగా రాష్ట్రానికి ప్రాధాన్యత పెరిగిందన్నారు. ఐటీ, విద్యుత్‌, వ్యవసాయ సంబంధిత పరిశ్రమలు భారీగా వస్తున్నాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి నీరు ప్రధాన వనరుగా ఉందని చెప్పారు. ప్రతినీటిబొట్టు ఒడిసి పట్టాల్సిన అవసరం ఉందనీ, భూగర్భజలాలను పెంచుకోవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్‌లో ఎలాంటి నీటి సమస్యలు రాకుండా ఉండాలంటే తప్పకుండా పొదుపు చేయాలని కోరారు. వాలంటీర్ల ద్వారా నీటిపొదుపు గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రైతులు తక్కువ నీటితో ఎక్కువ పంటలను సాగుచేసేలా సమాయత్తం కావాలని చెప్పారు. ఒక కిలో బియ్యం పండించాలంటే కనీసం ఐదు వేల లీటర్ల నుంచి ఏనిమిది వేల లీటర్ల వరకు నీరు అవసరమవు తుందని చెప్పారు. అలాగే మిల్లెట్లు పండించాలని కేవలం 500 లీటర్లు సరిపోతాయని వివరిం చారు. ఒకపూట వరికి బదులు మిల్లెట్లు అలవాటు చేసుకోవాలని చెప్పారు. దీంతో ఆరోగ్యంతోపాటు నీటి పొదుపు సాధ్యమవుతుందన్నారు. ఈ కార్య క్రమంలో సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, రిటైర్డ్‌ ఇంజినీర్స్‌ ఫోరం కార్య దర్శి బి.శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి, వాతావరణ వేత్త మధులిక చౌధరి, ఆర్థిక కమిటీ గౌరవ కార్యదర్శి జీవీ రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.