నవతెలంగాణ-చిట్యాల
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మొదటగా బావుసింగ్ పల్లి గ్రామంలో రూ.160 లక్షలతో బీటీ రోడ్డు, వరికోల్ పల్లి గ్రామంలో రూ.10 లక్షలతో అంతర్గత సీసీ రోడ్లు, వెంచరామి గ్రామంలో రూ.256లక్షలతో అందుకుతండా ఆర్‌అండ్‌బీ నుంచి వెం చరామి వరకు బీటీ రోడ్డు పనులకు, అందుకుతండా గ్రామంలో రూ.20లక్షలతో నూతన ఉప వైద్య కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.200 లక్షలతో గిద్దెముత్తరాం ఆర్‌అండ్‌బీ నుంచి కాల్వపల్లి గ్రామం వరకు బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం కాల్వపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే గండ్ర మాట్లాడారు. గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సీఎం కేసీఆర్ అభివృద్ధి పర్చినట్టు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు అనేక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక అనేక గ్రామ పంచాయతీలు మండలాలు జిల్లాలు నూతనంగా ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. పట్టణాల ధీటుగా గ్రామాలను అభివృద్ధి దిశగా నడిపిస్తూ ప్రజా రంజక పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. నియోజకవర్గ పరిధికి చిట్ట చివరి గ్రామంగా ఉన్న కాల్వపల్లికి రూ.256 లక్షలతో బీటీ రోడ్డు వేయడం వల్ల స్థానిక ప్రజలకు రవాణ సదుపాయాలు మెరుగుపడతాయని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధి, ఇప్పుడు జరుగు తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను బేరీజు వేసుకోవాలని కోరారు. పనిచేసే ప్రభుత్వాలకి ప్రజలు పట్టం కట్టాలన్నారు. భూపాలపల్లి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పరిచి రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలుపుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దావు వినోద వీరారెడ్డి, జెడ్పీటీసీలు పులి తిరుపతిరెడ్డి, గొర్రె సాగర్, పీఏసీఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ కూర మహిపల్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మడికొండ రవీందర్ రావు, మండల అధ్యక్షుడు అరపెళ్లి మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.