శాశ్వత ప్రతిపాదికన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి

 Development programs should be undertaken on a permanent basis– వరంగల్‌, హన్మకొండ జిల్లాల వరద ప్రాంతాల్లో రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళి సై సౌందరరాజన్‌
– ‘రెడ్‌ క్రాస్‌’ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ
నవతెలంగాణ-హనుమకొండ/ఎన్జీఓస్‌కాలనీ
/మట్టెవాడ/హనుమకొండ చౌరస్తా
భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా ఈ ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా ప్రభుత్వానికి సూచించనున్నట్టు రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ తెలిపారు. హన్మకొండ, వరంగల్‌ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళి సై సౌందర రాజన్‌ బుధవారం పర్యటించి పరిశీలించారు. ఉదయం 8:30 గంటలకు ఎన్‌ఐటీకి చేరుకున్న గవర్నర్‌కు హన్మకొండ, వరంగల్‌ జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్‌, ప్రావీణ్య, వరంగల్‌ కమిషనర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా, ఆర్డీఓలు రమేష్‌ కుమార్‌, వాసు చంద్ర స్వాగతం పలికారు. అలాగే, వరంగల్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ చైర్మెన్‌, పాలకవర్గ సభ్యులు గవర్నర్‌ను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అక్కడి నుంచి శ్రీభద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వరంగల్‌, హన్మకొండలోని జవహర్‌ నగర్‌, నయీమ్‌ నగర్‌, భద్రకాళి బండ్‌, ఎన్టీఆర్‌ నగర్‌, ఎన్‌.ఎన్‌ నగర్‌ ప్రాంతాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరద నష్టం వివరాలను గవర్నర్‌కు అధికారులు వివరించారు. భద్రకాళి చెరువు కట్ట మరమ్మతు పనులు, నయీమ్‌ నగర్‌ పెద్ద మోరి నాలాను పరిశీలించారు. ఎన్టీఆర్‌ నగర్‌ బృందావన కాలనీలో మోకాలు లోతు నీటిలో నడుస్తూ బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా రెడ్‌ క్రాస్‌ సొసైటీ అందించిన హెల్త్‌ కిట్స్‌, నిత్యావసరాలను బాధితులకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా జవహర్‌ నగర్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత రెండవ రాజధానిగా పేరున్న వరంగల్‌ నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన పాలకుల నిర్లక్ష్యమే నేడు ఈ నష్టానికి కారణమని విమర్శించారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు వరంగల్‌, హన్మకొండ నగరాల్లో అనేక లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని, అక్కడి ప్రజలను ఆదుకునేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని స్థానిక రెడ్‌ క్రాస్‌ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తెలియజేశానని తెలిపారు. అనేక ముంపు ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను వెంటనే పునరుద్ధరించేందుకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వరదలు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు. ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా నగరాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరతామని, తక్షణ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాయమందేలా చూస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో వరంగల్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ అధ్యక్షులు డాక్టర్‌ పెసరు విజరు చందర్‌ రెడ్డి, ఈవీ శ్రీనివాస్‌, అధికారులు తదితరులు ఉన్నారు.