– దాన్ని సాధించిన రాష్ట్రం తెలంగాణ
– మార్పు తెచ్చిన కేసీఆర్‌కు ఓటేస్తారా? లేక
– పట్టించుకోని అసమర్థులకు వేస్తారా : సంపాదకులతో ఇష్టాగోష్టిలో మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అభివృద్ధి, సంక్షేమం అరుదైన సమతూకం, దాన్ని సాధించిన రాష్ట్రం తెలంగాణ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో సంపాదకులు, సీనియర్ పాత్రికేయులతో నిర్వహించిన ప్రత్యేక ఇష్టాగోష్టి కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 25 ఏండ్లలో పట్టణాలు, ఐటీ, వ్యాపార అనుకూల విధానాలకు గానూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును, గ్రామాలు, వ్యవసాయం, పేదల అనుకూల విధానాలకుగాను మాజీ సీఎం వై.ఎస్.రాజశేఖర్ రెడ్డిని ప్రజలు గుర్తు పెట్టుకుంటారని తెలిపారు. అవన్నీ మళ్లీ కేసీఆర్‌లో కనిపిస్తున్నాయని తెలిపారు. 2014లో హైదరాబాద్ మినహా మిగిలిన 9 జిల్లాలు వెనుకబడి ఉన్నాయనీ, ప్రస్తుతం 33 జిల్లాలు తలసరి ఆదాయం జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉందని తెలిపారు. గతంలో విద్యుత్, నీరు, వ్యవసాయం పట్టించుకోని అసమర్థులకు ఓటేస్తారా? లేక మార్పు తెచ్చిన కేసీఆర్‌కు ఓటేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ప్రగతికి ఓటు వేయాలని ఆయన కోరారు.
గతానికి భిన్నంగా ప్రచార పద్ధతిని ఎంచుకోవడానికి ప్రజలకు, తమకు బోర్ కొట్టకుండా ఉండేందుకేనని కేటీఆర్ తెలిపారు. వివిధ వర్గాలతో కనెక్ట్ అయ్యేందుకేనని చెప్పారు. తామూ మనుషులమేననీ, తప్పులు జరుగుతుంటాయనీ, సరిదిద్దుకోవడమే జీవితమన్నారు. తెలంగాణలో కన్నా ఎక్కువ నియామకాలు జరిపిన రాష్ట్రముంటే చెప్పాలని బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు. ప్రభుత్వంతో తమకొచ్చిన ఫలితాల ఆధారంగానే ప్రజలు ఓటస్తారని అభిప్రాయపడ్డారు. 2018లో గెలిచిన సీట్ల కంటే ఎక్కువే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదరికం ఎక్కువనీ, దాని కారణంగానే నక్సలిజం పుట్టుకొచ్చిందన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక మూసీ సుందరీకరణపై దష్టి పెడతామన్నారు. కోవిడ్ కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ.లక్ష కోట్లు నష్టమొచ్చిందని తెలిపారు. శత్రు దేశంపై ఆర్థిక ఆంక్షలు విధించినట్టుగా కేంద్రంలోని బీజేపీ తమపై ఆంక్షలు పెట్టిందని విమర్శించారు. మేధావులు కొంత మంది తమ బాధను ప్రజల బాధగా చెబుతున్నారనీ, సమాజంలో 99.99 శాతం మందికి ముఖ్యమంత్రిని నేరుగా కలవాల్సిన అవసరమే ఉండదని చెప్పారు. సీఎం నేరుగా కలవకపోతే ప్రజాస్వామ్యమే లేదన్నట్టు చెప్పడం సరి కాదన్నారు.
రేవంత్ రెడ్డి అవినీతిపరుడు కాదా?
సీఎం కేసీఆర్‌ను అవినీతిపరుడంటూ విమర్శిస్తున్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అవినీతి పరుడు కాదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో ఆటో యూనియన్ కార్మికులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. నోట్ల కట్టలతో దొరకిన చిల్లరగాడు రేవంత్ రెడ్డి అని విమర్శించారు. సీఎం కేసీఆర్ రూ.100 కోట్ల తో ఆటో కార్మికులను ఆదుకున్నారని తెలిపారు.
హైదరాబాద్ మెట్రో రైల్ లో మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్ శుక్రవారం హైదరాబాద్‌లోని రాయదుర్గం నుంచి బేగంపేట్ వరకు మెట్రో రైల్లో ప్రయాణించారు. ప్రయాణికులతో ముచ్చటించారు. సాధారణ ప్రయాణికునిగా వారితో కలిసిపోయారు. ఆత్మీయంగా పలకరించారు. ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనాలనీ, మంచి నాయకులను ఎన్నుకోవాలని కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువతకు సూచించారు.