నామినేషన్‌ ర్యాలీలో అపశృతి

–  మంత్రి కేటీఆర్‌కు తప్పిన పెను ప్రమాదం
నవతెలంగాణ-ఆర్మూర్‌
నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలో ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి నామినేషన్‌ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. ముందు వరుసలో మంత్రి కేటీఆర్‌, రాజ్యసభ ఎంపీ సురేష్‌ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రచార వాహనంపై ఉన్నారు. అందరికీ అభివాదం చేస్తూ ప్రచార వాహనం ముందుకు వెళుతుండగా కరెంటు వైర్లు అడ్డంగా ఉండటాన్ని గమనించిన డ్రైవర్‌ సడన్‌ బ్రేకు వేశారు. దీంతో వాహనంపై చుట్టూ ఉన్న రైలింగ్‌ ఊడిపోయి ఒక్కసారిగా కింద పడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కేటీఆర్‌ను పట్టుకున్నారు. సురేష్‌రెడ్డికి స్వల్ప గాయాల య్యాయి. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ.. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని, తన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందొద్దని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. అనంతరం ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు అందజేశారు.

Spread the love