రామకృష్ణయ్య దారుణ హత్యపై న్యాయ విచారణ జరపాలి : డీహెచ్‌పీఎస్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామానికి చెందిన విశ్రాంత అధికారి, ఆర్టీఐ కార్యకర్త నల్ల రామకృష్ణయ్య దారుణ హత్యపై సిట్టింగ్‌ జడ్జితో న్యాయ విచారణ జరపాలని డీహెచ్‌పీఎస్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్‌కుమార్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అందుకు కారకులైన పాత్రధారులు, సూత్రధారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. రామకృష్ణయ్య కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ప్రజాస్వామికవాదులు ఆయన కుటుంబానికి అండగా నిలబడాలని పేర్కొన్నారు.