కమ్యూనిస్టుల్లేకుండానే మునుగోడులో గెలిచారా?

– మంత్రి హరీశ్‌రావుకు కూనంనేని సూటిప్రశ్న
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కమ్యూనిస్టుల్లేకుండానే మునుగోడులో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గెలిచారా?అని మంత్రి హరీశ్‌రావును సీపీఐ రాష్ట్ర కూనంనేని సాంబశివరావు సూటిగా ప్రశ్నించారు. అంగన్‌వాడీ కార్యకర్తలనుద్దేశించి సిద్ధిపేటలో కమ్యూనిస్టుల ఉచ్చులో పడొద్దంటూ హరీశ్‌రావు వ్యాఖ్యానించడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. కమ్యూనిస్టు పార్టీలకు మనుషుల్లేరు, కార్యకర్తల్లేరు అనే వ్యాఖ్యలను మంత్రి గుండె మీద చెయ్యేసుకుని ఆ మాట చెప్పగలుగుతారా?అని ప్రశ్నించారు. కమ్యూనిస్టు పార్టీలకు కార్యకర్తలు, మనుషుల్లేకుంటే మునుగోడులో బీఆర్‌ఎస్‌ పార్టీ గెలిచేదా?అని సోమవారం ఒక ప్రకటనలో నిలదీశారు. ఆ ఎన్నికల తర్వాత కమ్యూనిస్టుల మద్దతుతో గెలిచామంటూ బీఆర్‌ఎస్‌ అధినాయకులు కృతజ్ఞతలు చెప్పిన విషయం వాస్తవం కాదా? అని పేర్కొన్నారు. నాడు కమ్యూనిస్టుల మద్దతు లేకుంటే ఈనాడు తెలంగాణలో బీజేపీని నిలవరించడం సాధ్యమయ్యేదా?అని ప్రశ్నించారు అంగన్‌వాడీ, ఆశా వర్కర్లే కాదు, రాష్ట్రంలోని, దేశంలోని ప్రతి కార్మికుడుకీ అండాదండా ఎర్రజెండా అని కూనంనేని తెలిపారు. ఇల్లు లేని పేదవాడి దగ్గర నుంచి, భూమి లేని నిరుపేదల వరకు, విద్యార్థులు, యువజనులు, మహిళలు, రైతులు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు, పాత్రికేయులు ఇలా దుర్భర జీవితం గడిపే ప్రతి మనిషి వెనుకవుండి వారి కోసం పోరాడేది కమ్యూనిస్టుపార్టీ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ గ్రామం వెళ్లినా, ఏ నియోజకవర్గం వెళ్లినా ఇప్పటికీ కమ్యూనిస్టుల్లేని ప్రాంతం ఒక్కటైనా చూపెడతారా?అని ప్రశ్నించారు. సమస్య ఎక్కడుంటే కమ్యూనిస్టులు అక్కడుంటారనీ, దాని పరిష్కారం కోసం ప్రశ్నిస్తారనీ, పోరాడతారని తెలిపారు.