పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణంపై భిన్నస్వరాలు

Disagreement on construction of Palamuru-Ranga Reddy lift– ప్రచారంలోనే వేగం..పనుల్లో తీవ్ర జాప్యం
– స్థానికులు, సాగునీటిరంగ నిపుణుల్లో అసంతృప్తి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం చెబుతున్నట్టుగా పనుల్లో వేగం లేదనీ, తీవ్ర జాప్యం జరుగుతున్నదనే అభిప్రాయాలు వెల్లు వెత్తుతున్నాయి. మొత్తం తొమ్మిది మోటర్లకుగాను కేవలం ఒకటే మోటర్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2015లో శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టుకు రకరకాల సాంకేతిక సమస్యలు, జలవివాదాలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత తదితర అంశాలు అడ్డంకులుగా ఉన్న విషయం విదితమే. దీంతో అనవసరంగా జాప్యమవుతున్నది. కృష్ణాజలాలను శ్రీశైలం జలాశయం నుంచి తీసుకువచ్చి 12.30 లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. దాదాపు ఆరు జిల్లాలు లబ్ధిపొందనున్నాయి. ప్రతిరోజూ రెండు టీఎంసీలను శ్రీశైలం జలాల నుంచి ఎత్తిపోసేందుకు ఈ ప్రాజెన్టును ఉద్దేశించారు. మొత్తం ఐదు చొప్పున రిజర్వాయర్లు లిఫ్ట్‌లు ఏర్పాటు చేశారు.
7.15 టీఎంసీల తాగునీరు, 79 టీ ఎంసీల సాగునీటి కోసం కేటాయింపులు చేశారు. కాళేశ్వరాన్ని మించిన ప్రాజెక్టుగా ప్రభుత్వం చెప్పు కుంటున్నది. కానీ, వాస్తవంలో ప్రాజెక్టు పరిస్థితి భిన్నంగా ఉందంటూ స్థానికంగా ప్రజల్లో ప్రచారం జరుగుతున్నది. రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు, సాగునీటి రంగ నిపుణులు సైతం ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు.
ఏడేండ్ల తర్వాత..
శంకుస్థాపన చేసిన ఏడేండ్ల తర్వాత ప్రాజెక్టుపై ప్రేమ పుట్టుకొచ్చిందంటూ విమర్శలు చేస్తున్నారు. త్వరలో ఎన్నికలు ఉండటమే ఇందుకు కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒకవైపు ప్రభుత్వం 80 శాతం పనులు పూర్తయ్యాయని ప్రచారం చేసుకుంటుండగా, వాస్తవంలో 30 నుంచి 40 శాతం పనులే జరిగాయని స్థానిక ప్రజలు, సాగునీటిరంగ నిపుణులూ చెబుతున్నారు. పంపుల దగ్గర నుంచి మొదలెడితే మోటర్ల వరకు చాలా పనులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.
ఇటీవల వెట్‌రన్‌ చేపట్టినా, మొ త్తం తొమ్మిది పంపులకుగాను ఒకటే పంపు ద్వారా నీళ్లను వదిలారు. ఈ నీళ్లు సైతం ప్రవహించడానికి ఇంకా కాలువలే తవ్వలేదు. వారం రోజుల క్రితమే వాటి కోసం టెండర్లు పిలిచారు.
మూడు రెట్లు పెరిగిన వ్యయం
ప్రాజెక్టును సర్కారు రెండు ఫేజులుగా చేపట్టింది. ఫేజు-1 కింద ప్రధాన పనులు, ఫేజు-2 కింద కాలువల తవ్వకం, ఇతర పనుల చేసేందుకు టెండర్లను పిలిచింది. . సీడబ్ల్యూసీ నుంచి సైతం అనుమతులు సైతం పూర్తిగా రాలేదు. చివరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)సైతం ఇంకా పరిశీలనకు నోచుకోలేదు. కృష్ణాజలాల విషయంలో ఏపీ వేసిన కేసును జస్టీస్‌ బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ ఇటీవలే కొట్టేసింది. దీంతో త్వరలో డీపీఆర్‌ను పరిశీలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీతో పెండింగ్‌లో ఉన్న అనేక జలవివాదాల్లో ఇదొకటి. ప్రాజెక్టుకు రూ.35,200 కోట్లకు అనుమతులు ఇవ్వగా, ఇప్పటివరకు రూ.26, 262 కోట్లు ఖర్చుపెట్టినట్టు వెట్‌రన్‌ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం కాళేశ్వరంపై పెట్టిన శ్రద్ద, పాలమూరుపై పెట్టకనే తీవ్ర ఆలస్యమైందనే విమర్శలు వస్తున్నాయి. అందుకే అంచనా వ్యయం సైతం మూడు రెట్లు పెరిగిందని అంటున్నారు. దాదాపు రూ. 85 వేల కోట్లకు చేరినట్టుగా సాగునీటీ శాఖ చెబుతున్నది. ఈ విషయమై కూడా స్థానిక ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు, సాగునీటిరంగ నిపుణుల నుంచి అరోపణలు, విమర్శలు వస్తున్నాయి. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైన్‌ చేయడం ద్వారా ప్రాజెక్టు దశ-దిశను మార్చేశారనే విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. అందుకే కోర్టు కేసులు సైతం జాప్యానకి కారణమని అంటున్నారు. కాగా పనుల్లో నాణ్యత లేదని నిపుణులు చెబుతున్నారు.
బాహుబలి మోటర్లు
బాహుబలి మోటర్ల తయారీ బాధ్యత బీహెచ్‌ఈఎల్‌కు అప్పగించినప్పటికీ, ఏడేండ్లు దాటినా చివరిదశకు పనులు చేరకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో హడావిడిగా డ్రైరన్‌, వెట్‌రన్‌ చేపట్టారంటూ మాజీ మంత్రులు నాగం జనార్థన్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు విమర్శించిన సంగతి తెలిసిందే. కాలువల పనులు చేపట్టకుండానే ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేయడం ప్రజలను మోసగించడానికేనని ఆరోపించారు. ఇది సరికాదని మీడియాలో పలుమార్లు వ్యాఖ్యానించారు. నిజానికి ప్రాజెక్టు పనులు 30 నుంచి 40 శాతమే పూర్తయ్యాయని సాగునీటిరంగ నిపుణులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ మరోసారి కరువుబారిన పడే ప్రమాదముందన్నారు. రీడిజైన్‌ చేసినా ప్రయోజనం కలగలేదన్నారు. పంటకాలువలు, బ్రాంచ్‌ కెనాళ్ల పనులు ఇంకా ప్రారంభమే కాలేదని గుర్తు చేశారు. పాత ప్రాజెక్టులైన కల్వకుర్తి, నెట్టెంపాడు ఆయకట్టే పూర్తిగా సాగులోకి రాలేదని వివరించారు. రాష్ట్రంలో ప్రభుత్వం రూ.1.30 లక్షల కోట్లు ఖర్చుపెడితే సగం ఆయకట్టు కూడా ఖాస్తులోకి రాకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తంచేశారు.