డిజిటల్‌ బాల్యం అభ్యంతరకరం

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సాంకేతికత పేరుతో పిల్లలు డిజిటలైజేషన్‌కు అలవాటుపడటం వారి ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీనిపై ఉషారామన్‌, సుమన కస్తూరి రాసిన ‘చైల్డ్‌స్కేప్‌-మీడియా స్కేప్‌’ పుస్తకం అనేక సందేహాలకు సమాధానాలు ఇచ్చిందన్నారు. శుక్రవారంనాడిక్కడి విద్యారణ్య హైస్కూల్‌లో ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. రచయితలతో పాటు హైదరాబాద్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ వినోద్‌ పవరాల, యునిసెఫ్‌ బాలల హక్కుల మాజీ న్యాయవాది సుధామురళి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి, విశ్లేషించారు. పిల్లల బాల్యం డిజిటలైజ్‌పై అనేప ప్రపంచ పరిశోధనలు జరిగాయమన్నారు. దీనిపై భిన్నమైన వైఖరులు వెల్లడయ్యాయనీ, భవిష్యత్‌ తరాల పోటీ ప్రపంచంలో డిజిటలైజేషన్‌ అవసరమని కొందరు పేర్కొంటే, మరికొందరు దీనివల్ల బాల్యం అనేక సమస్యల్ని ఎదుర్కొంటుందని తెలిపారన్నారు. పిల్లలు మీడియా ల్యాండ్‌స్కేప్‌లో అనేక రకాల థీమ్‌లను అన్వేషిస్తూ డిజిటల్‌గా ఎదగడం అంటే ఏమిటో ఈ పుస్తకంలో వివరించారని తెలిపారు. పిల్లల్లో డిజిటల్‌ మీడియా అక్షరాస్యత, కొత్త మీడియా పద్ధతులు, మధ్యవర్తిత్వ బాల్యం, హక్కుల విభజన, సోషల్‌ మీడియా వినియోగదారులు, నిర్మాతలుగా పిల్లలు ఎదుగుతున్నారనే 12 వ్యాసాలు ఈ పుస్తకంలో ఉన్నాయని చెప్పారు. పిల్లల వినోదం, విశ్రాంతి అభ్యాసం ప్రధానమని పుస్తకంలో వివరించారన్నారు. మీడియా, కమ్యూనికేషన్‌ స్టడీస్‌, కల్చరల్‌ స్టడీస్‌, సైకాలజీ, జర్నలిజం విద్యార్థులకు ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుందని తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, శిక్షణా సంస్థలు, బాలల హక్కుల స్వచ్ఛంద సంస్థలు ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవాలన్నారు. కార్యక్రమంలో ఓరియంట్‌ బ్లాక్‌స్వాన్‌ ప్రచురణకర్త ప్రతినిధి జనార్థన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.