కృషి బ్యాంకు డైరెక్టర్‌ అరెస్టు

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
చాలా కాలం నుంచి పరారీలో ఉన్న కృషి అర్బన్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ పుస్తకాల శ్రీధర్‌ను ఎట్టకేలకు సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. సీఐడీ అదనపు డీజీ మహేశ్‌ భగవత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. 2001లో కృషి అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు యాజమాన్యం డిపాజిటర్ల నెత్తిన కోట్ల రూపాయల కుచ్చుటోపిని తొడిగి బిచాణా ఎత్తివేసింది. ఆ సమయంలో డిపాజిటర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌ మహంకాళీ పోలీసు స్టేషన్లు కేసును నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. కృషి బ్యాంకు చైర్మెన్‌ కొసరాజు వెంకటేశ్వర్‌రావుతో పాటు ఇతర డైరెక్టర్లు డిపాజిటర్లకు సంబంధించిన రూ. 36 కోట్ల మేరకు చెల్లింపులు నిలిపివేసి పరారీకావటం జరిగింది. ఈ కేసును దర్యాప్తునకు స్వీకరించిన సీఐడీ అధికారులు ఎట్టకేలకు కొందరు డైరెక్టర్లతో పాటు చైర్మెన్‌ కొసరాజు వెంకటేశ్వర్‌రావును కూడా అరెస్టు చేశారు. అటు తర్వాత పుస్తకాల శ్రీధర్‌ అనే డైరెక్టర్‌ కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. దీంతో అతని అరెస్టుకు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు నుంచి మూడేండ్ల క్రితం అరెస్టు వారెంటు జారీ అయింది. ఈ మేరకు రంగంలోకి దిగిన సీఐడీ ఎస్పీ రామిరెడ్డి నేతృత్వంలోని ఎన్‌బీడబ్ల్యూల జారీల బృందం ఎట్టకేలకు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో శ్రీధర్‌ను అరెస్టు చేసింది. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపర్చి రిమాండుకు తరలించింది.