తడిసిన మనసు

Dirty mindఆ నిరుపేద గుడిసెలో
ఉదయం నుంచి ఒకటే వర్షం
ఎడతెరిపిలేకుండా కురుస్తూనే ఉంది
పగటికి, రాత్రికే కాదు
ఎండా, వానకు కూడా నెలవై ఉంది
ఉదయించే సూర్యకిరణాలు
పేదోడి గుడిసెలో నేరుగా
ప్రతిరోజూ ప్రసరిస్తునే ఉంటాయి
సూర్యోదయం, చంద్రోదయాలకు
ఆ పాక నిలయమైపోయింది
అమావాస్య, పున్నములు చూడటానికి
కొందరికి క్యాలెండర్‌ కావాలేమో
కానీ, అతడు చూరు నడిగి చెప్పేస్తాడు
చిరుగుల దుప్పటితో,
చిల్లుల పడిన పైకప్పుతో
కాలాలు, ఋతువులు
లెక్కకట్టకుండానే చెపుతాడు
రోజంతా కురిసిన వర్షంతో
తెల్లవార్లూ నిద్ర మేలుకుని
జాగారం చేస్తూనే ఉన్నాడు
రెక్కల కింద పొదుగుకునే పక్షిలా
బిడ్డలను తన గుండెల్లో దాచుకుంటాడు
వర్షానికి ఎప్పుడూ అలుపు లేదు
వానకు తడిసిన గుడిసె మాత్రం
అలసిపోయి కునుకు తీస్తోంది
పేదోడి గుడిసెలోనూ, గుండెలోనూ
రాత్రంతా కురిసిన వర్షం
తెల్లవారి అతని కళ్ళలో మళ్ళీ మొదలైంది!
– ములుగు లక్ష్మీ మైథిలి, 9440088482