ఆరోగ్య సర్వేలో వికలాంగులకు స్థానం లేదా?

     ‘మన దేశంలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌) ఆరవ రౌండ్‌సర్వే ఈనెలలో ప్రారంభమవుతుంది. వచ్చే సంవత్సరంలోపు సర్వే పూర్తి చేసి రిపోర్ట్‌ వెల్లడి చేస్తాం. ఆరోగ్యం, జనాభా, లింగ సమానత్వంలో పురోగతిని సర్వే ద్వారా అంచనా వేస్తాం. సర్వే నిర్వహణ కోసం అవసరమైన చర్యలు, ప్రశ్నలు గతంలో జరిగిన సర్వేల మాదిరిగానే ఉంటాయి’ ఆరోగ్య పరిశోధన విభాగం కార్యదర్శి, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసిఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ రాజీవ్‌ బహ్లూ ప్రకటన ఇది. అయితే గతంలో ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ సర్వేలో వికలాంగుల వివరాలు నమోదు చేయడానికి ఉన్నటువంటి అవకాశాన్ని ఈసారి రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సాంకేతిక పరమైన కారణాలను సాకుగా చూపుతోంది. వికలాంగులు అంటే కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి లెక్కేలేదు. ‘సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌’ అంటూ దేశమంతా మోడీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటూనే ”సబ్‌ కా సాత్‌ వికలాంగులు కాదంటూ” తమ వైఖరిని స్పష్టం చేసింది.
దేశంలో మొదటి సారిగా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 1992-93, రెండవ సర్వే 1998-99, మూడవ సర్వే 2005-06, నాల్గవ సర్వే 2014-15, ఐదవ సర్వే 2018-19లో జరిగింది. ఆరవ రౌండ్‌ సర్వే ఈ సంవత్సరం ప్రారంభమై 2024లో ముగుస్తుంది. సర్వే కోసం ఖరారు చేసిన ప్రశ్నాపత్రంలో వైకల్యానికి సంబంధించిన ప్రశ్న ఒక్కటీ లేదు. ”వైకల్యం అనేది వైద్యుల ధృవీకరణ ఆధారంగా నిర్ణయించబడుతుంది. మా సర్వేయర్లు వైద్యులు కాదు. వారు మెడికల్‌ సర్టిఫికెట్లను తనిఖీ చేయలేరని ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ అధికారులు పేర్కొనడం దురదష్టకరం. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ సర్వే పత్రం నుంచి వికలాంగులకు సంబంధించిన ప్రశ్నను తొలగించమని కోరిందని, అందుకే ప్రశ్నను తొలగించామని అధికారులు చెప్పడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. సర్వే నిర్వహిస్తున్న సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇవ్వాలి. కానీ ఎలాంటి శిక్షణ లేనటువంటి వారితో సర్వే జరిపించి వికలాంగులను సర్వే నుంచి మినహాయించే హక్కు ఎవరికీ లేదు. పైస్థాయిలో ఉన్న వ్యక్తులు తమకు అప్పగించిన ఉద్యోగ బాధ్యతలను చిత్తశుద్ధితో అమలు పరచడానికి కృషి చేయాలి. అలా కాకుండా నేడు సమాజంలో వైకల్యంపై సమగ్రమైన అవగాహన లేనటువంటి అధికారులు ఉండడం వలన ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికారుల అనాలోచిత నిర్ణయం వలన వికలాంగులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. భారతదేశంలో వికలాం గులను అన్ని రంగాల్లో భాగస్వాములను చేసేందుకు ప్రభుత్వాలు ఒకవైపు చట్టాలు చేస్తుంటే మరోవైపు వికలాంగుల వివరాలు నమోదు చేయడానికి సాంకేతికపరమైన కారణాలు చూపించి నిరాకరించడం ఎంతవరకు సమంజసం?
సెన్సస్‌, నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆర్గనైజేషన్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ), ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ డేటా ఆధారంగా వికలాంగుల కచ్చితమైన సమాచారం ప్రకటించ కుండా… సర్వే నిర్వహిస్తున్న సంస్థలు వారికి అనుకూలంగా ఉన్న అంశాల ఆధారంగా సర్వే నిర్వహించి వివరాలు నమోదు చేయడం వలన వికలాంగుల కచ్చితమైన సమాచారం రావడం లేదు. వివిధ కారణాల వల్ల 2021 జనాభా గణన ఆలస్యమైన నేపథ్యంలో, ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2011 జనాభా లెక్కల్లో ప్రకటించిన (ఏడురకాల వైకల్యాలు) సమాచారంపైనే ఆధారపడుతున్నారు. కానీ 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం గుర్తించిన 21రకాల వైకల్యాల ఆధారంగా వాస్తవమైన గణాంకాలు ఇప్పటివరకు ప్రకటించలేదు. వికలాంగుల జనాభా లెక్కల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనాభా లెక్కల ప్రకారం 2011 వికలాంగుల జనాభా 2.21శాతంగా గుర్తించబడింది. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-5 దీనిని 1శాతంగా పేర్కొంది. అంటే జనాభా లెక్కలకు ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ సర్వే వివరాలకు మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో చేసిన సర్వేలో జరిగిన పొరపాట్లు ప్రస్తుతం చేస్తున్న సర్వేలో జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్‌పిఆర్‌డితో పాటు అనేక వికలాంగుల సంఘాల ప్రతినిధి బృందం… నేషనల్‌ హెల్త్‌ సిస్టమ్స్‌ రిసోర్స్‌ సెంటర్‌లోని అధికారులను, నోడల్‌ డిపార్ట్‌మెంట్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ డిజ్‌ఎబిలిటీస్‌ (డిఇపిడబ్ల్యుడి) అధికారులను కలిసి… ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ సర్వేలో వికలాంగుల వివరాలు నమోదు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది.
కోవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో, ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ సర్వేలో వికలాంగులను మినహాయించాలని కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్ణయం మరింత తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. వికలాంగుల హక్కులపై ఐక్యరాజ్య సమితి కన్వెన్షన్‌ (యుఎన్‌సిఆర్‌పిడి) చేసిన తీర్మానాల గురించి మాట్లాడటం లేదు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం (ఆర్‌పిడబ్ల్యుడి) చట్టం, యూనిక్‌ డిస్‌ఎబిలిటీ ఐడి (యుడిఐడి) ప్రాజెక్ట్‌ ద్వారా కచ్చితమైన సమాచారం రావడానికి అవకాశం ఉంది. యుడిఐడి వెబ్‌సైట్‌ ప్రకారం, ఈ ప్రాజెక్ట్‌ పిడబ్ల్యుడి కోసం జాతీయ డేటాబేస్‌ను రూపొందించడం, వైకల్యం ఉన్న ప్రతి వికలాంగునికి ఒక ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డును జారీ చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా పారదర్శకంగా వికలాంగులకు ప్రభుత్వ ప్రయోజనాలను సులభంగా అందించడం మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా వికలాంగులు అందరూ ఒక్కటే అనే భావన కలుగుతుంది. ప్రాజెక్ట్‌ అమలుపై కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ లేదు. సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వశాఖ 2021-22 వార్షిక నివేదిక ప్రకారం, 2022 జనవరి 1 నాటికి దాదాపు 1,74,25,905 మంది వికలాంగులు వైకల్య ధృవీకరణ పత్రాలు కలిగి ఉంటే 6.80లక్షల యుడిఐడి కార్డులు పంపిణీ చేశారు. 2011 జనాభా లెక్కల ద్వారా గుర్తింపు పొందిన వికలాంగుల సంఖ్య 2.68కోట్లుగా అంచనా. ఇప్పటి వరకు వారికి ధృవపత్రాలుగానీ కార్డులుగానీ పంపిణీ చేయలేదు.
దేశ పౌరులుగా వికలాంగులకు ఉన్నటువంటి అన్ని హక్కులు, అర్హతలను కోల్పోయే ప్రమాదం నేడు ఏర్పడుతున్నది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేండ్లుగా వికలాంగుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుందని, 2016 ఆర్‌పిడబ్ల్యుడి చట్టాన్ని తామే తెచ్చామని గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ 2013 డిసెంబర్‌లో పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలలో కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం బిల్లులో వికలాంగులకు ఉపయోగపడే అనేక అంశాలను పొందుపరిస్తే… ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వం వాటిని తొలగించి 2016లో చట్టం ఆమోదించింది. 2008లో ఐక్యరాజ్య సమితి వికలాంగుల హక్కుల ఒప్పందంపై (యుఎన్‌సిఆర్‌పిడి) భారత్‌ సంతకం పెట్టింది. యుఎన్‌సిఆర్‌పిడి స్ఫూర్తికి విరుద్ధంగా చర్యలు చేపడుతోంది. ఆ చట్టం ఉపోద్ఘాతంలో చెప్పినట్లుగా వికలాంగుల పట్ల వివక్ష పాటించకుండా చట్టాలను తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నది. ఇతర చట్టాలు మార్చినట్లే వికలాంగుల చట్టాలనూ మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే దానికి వ్యతిరేకంగా ఎన్‌పిఆర్‌డి దేశవ్యాప్త ఉద్యమాలు నిర్వహించి విజయాలు సాధించింది. వికలాంగుల కోసం ఉన్నటువంటి 9 జాతీయ సంస్థలను విలీనం చేయాలని నిర్ణయిస్తే దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం జరిగింది. నేషనల్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ను 2014 నుండి నియమించడం లేదు. రిహాబిలిటేషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, వికలాంగుల ప్రధాన కమిషనర్‌ కార్యాలయాలు కూడా నేటికీ కమిషనర్‌ లేకుండా ఖాళీగా ఉన్నాయి. ఈ మూడు ముఖ్యమైన సంస్థల స్వతంత్రతను దెబ్బతీసే విధంగా కమిషనర్లు, ఛైర్మన్‌ను నియమించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వం మరొకటి లేదు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వికలాంగుల వివరాలు నమోదు చేయడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. వికలాంగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఉద్యమాలకు సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది.
– ఎం. అడివయ్య