వికలాంగుల సమస్యలు మ్యానిఫెస్టోల్లో చేర్చాలి

Disability issues should be included in the manifestos– రాజకీయపార్టీలకు ఎన్పీఆర్డీ విజ్ఞప్తి
–  కనీస పెన్షన్‌ రూ.10 వేలు ఇవ్వాలి
–  ధరల సూచితో అనుసంధానించాలి
– డబుల్‌బెడ్‌రూం ఇండ్లివ్వాలి : ఇందిరాపార్కు వద్ద మహాధర్నాలో వక్తలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వికలాంగుల సమస్యల్ని అన్ని రాజకీయపార్టీలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోల్లో పెట్టాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) డిమాండ్‌ చేసింది. అర్హులైన వారందరికీ కనీస పెన్షన్‌ రూ.10వేలు ఇవ్వాలనీ, దాన్ని ధరల పెరుగుదల సూచీతో అనుసంధానం చేయాలని కోరారు. ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో సోమవారంనాడిక్కడి ఇందిరాపార్కు వద్ద వికలాంగుల మహాధర్నా జరిగింది. ఎన్పీఆర్డీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు నంబురాజన్‌ ముఖ్య అతిధిగా పాల్గొని, మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో 5 శాతం నిధుల్ని వికలాంగుల కోసం కేటాయించాలని డిమాండ్‌ చేస్తుంటే, మోడీ ప్రభుత్వం రూ. వెయ్యికి మూడు పైసలు మాత్రమే ఇస్తున్నదని విమర్శించారు. మరోసారి కేంద్రంలో బీజేపీ, నరేంద్రమోడీ అధికారంలోకి వస్తే రేషన్‌ షాపులు ఎత్తేసే కుట్ర జరుగుతున్నదని చెప్పారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం దండగ అని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారనీ, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పథకానికి నిధులు కేటాయింపులు కుదిస్తున్నదని వివరించారు. ఈ స్కీం ద్వారా వికలాంగులకు కొన్ని హక్కులు ఉన్నాయనీ, వాటిని కోల్పోయే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. వికలాంగులకు దేశవ్యాప్తంగా చెల్లుబాటయ్యేలా గుర్తింపుకార్డులు ఇవ్వాలనీ, కేంద్రంలోని దివ్యాంగుల శాఖకు నిధులు కేటాయించాలనీ, ఖాళీగా ఉన్న 13వేల బ్యాక్‌లాగ్‌ పోస్టుల్ని భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 43 లక్షల మంది వికలాంగులు ఉన్నారనీ, ధరల సూచికి అనుసంధానిస్తూ పెన్షన్లు చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టీ జ్యోతి మాట్లాడుతూ పోరాడితేనే హక్కులు సాధించుకోగలమని చెప్పారు. డబుల్‌ బెడ్‌రూంలు, గృహలక్ష్మి కేటాయింపులు నిజమైన లబ్దిదారులకు చేరట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రేషన్‌ షాపుల్లో కేవలం బియ్యం తప్ప ఏమీ ఇవ్వట్లేదనీ, కేరళలో బియ్యంతో పాటు 14 రకాల వస్తువుల్ని ఇస్తున్నారని ఉదహరించారు. ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్‌ అడివయ్య మాట్లాడుతూ వికలాంగులకు దేశవ్యాప్తంగా ఉచిత రవాణా కల్పించాలనీ, వారి కుటుంబాలకు 250 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాల్లో ఐదుశాతం వికలాంగులకు కేటాయించాలనీ, అంత్యోదయ కార్డులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా 37 డిమాండ్లతో కూడిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. కార్యక్రమానికి ఎన్పీఆర్డీ రాష్ట్ర అధ్యక్షులు కే వెంకట్‌ అధ్యక్షత వహించారు. ఎన్పీఆర్డీ కర్నాటక రాష్ట్ర కార్యదర్శి రంగప్ప ధర్నాకు సంఘీభావం తెలిపారు. టీడీపీ రాష్ట్ర నాయకులు సాయిబాబా, తెలంగాణ వికలాంగుల సమాఖ్య వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మీసాల మోహన్‌, హిమోఫిలియా హైదరాబాద్‌ చాప్టర్‌ కార్యదర్శి శ్రీనివాస్‌ తెలంగాణ వికలాంగుల హక్కుల పోరాట సంఘం గొల్ల ప్రభాకర్‌ మహాధర్నాకు సంఘీభావం తెలిపారు. ఎన్పీఆర్డీ కేంద్ర కమిటీ సభ్యులు ఆర్‌ వెంకటేష్‌, జే రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు టీ మధుమాబు, కాశప్ప, గోపాల్‌, స్వామి, దశరథ్‌ తదితరులు పాల్గొన్నారు.