త్వరలో ఎన్నికల నోటిఫికేషన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
త్వరలో తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (టీఎస్‌ఎంసీ) ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా నిర్వహించనున్నఈ ఎన్నికల కోసం కసరత్తు ఇప్పటికే ఆరంభమైంది. శనివారం హైదరాబాద్‌లోని సరోజినీ దేవి కంటి ఆస్పత్రి ప్రాంగణంలో టీఎస్‌ఎంసీ చైర్మెన్ రాజలింగం వివిధ వైద్యుల సంఘాల ప్రతినిధులతో సమావేశమై దీనికి సంబంధించిన విషయాలపై చర్చించారు. 16 అసోసియేషన్ల నుంచి 42 మంది హాజరై పలు సూచనలు చేసినట్టు ఆయన తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చివరిసారిగా జరిగిన ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించారు. గతంలో సర్టిఫికేట్ ఆఫ్ పోస్టింగ్‌కు అవకాశముండేది. ప్రస్తుతం దాన్ని తొలగించినట్టు రాజలింగం వివరించారు. దాదాపు 50 వేల మందికి ఆ విధానంలో పోస్టల్ పంపడమనేది ఖర్చుతో కూడుకున్నదని చెప్పారు. దానికి చాలా సమయం పడుతుందని చెప్పారు. మెజారిటీ ప్రతినిధులు ఆన్‌లైన్ ఓటింగ్ ను కోరారనీ, ఈ విషయంపై ప్రభుత్వానికి అనుమతి కోసం రాయనున్నట్టు చెప్పారు. నామినేషన్ డేట్, ఓటు వేసేందుకు రిజిస్టర్ అయిన కట్ ఆఫ్ డేట్ తదితర విషయాలపై ఈ సమావేశంలో చర్చించారు. టీఎస్‌ఎంసీ వద్ద ఇప్పటికే 55 వేల మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ నుంచి 30 వేల మంది ఉండగా, తెలంగాణ ఆవిర్భావం తర్వాత మరో 25 వేల మంది నమోదు చేసుకున్నారు. ఎన్నికలను నిర్వహించనున్న నేపథ్యంలో రెన్యూవల్ చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఎక్కువ మంది సభ్యులు కోరినట్టు తెలుస్తున్నది. కౌన్సిల్‌లో ఇప్పటికే చైర్మెన్‌తో పాటు ఆరుగురు ప్రభుత్వ నామినేటెడ్ సభ్యులు, ఇద్దరు యూనివర్సిటీ నామినేట్ చేసిన సభ్యులు, మరో నలుగురు ఎక్స్‌అఫిషియో సభ్యులు మొత్తం 12 మంది ఉన్నారు. వీరు కాకుండా ఎన్నికల ద్వారా మరో 13 మందిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. శనివారం నాటి సమావేశంలో టీఎస్‌ఎంసీ రిజిస్ట్రార్ హనుమంత రావు, సభ్యులు డాక్టర్ శేషు, డాక్టర్ క్రిష్ణారెడ్డి, డాక్టర్ ఎస్.కె.అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.